జనసేనాని రాకతో జనసంద్రమైన ద్రాక్షారామం

• యానాం నుంచి భారీ ర్యాలీ
• గ్రామ గ్రామాన హారతులతో స్వాగతం
• జన సైనికుల కేరింతలు, పూల వర్షం మధ్య శ్రీ పవన్ కళ్యాణ్ రోడ్ షో
• రామచంద్రపురం నియోజకవర్గంలో వారాహి విజయ భేరి సభ

పంచారామ క్షేత్రం ద్రాక్షారామం జన సైనికుల జయజయధ్వానాలతో దద్దరిల్లింది. వీర మహిళల కేరింతలు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తల హర్షధ్వానాలతో రామచంద్రపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారాహి విజయభేరీ యాత్ర నిర్వహించారు. యానాం నుంచి ద్రాక్షారామం మధ్య గ్రామ గ్రామాన ప్రజలు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హారతుల స్వాగతం పలికారు. 18 కిలోమీటర్ల ప్రయాణం గంటన్నరకుపైగా సాగడంతో వారాహి విజయభేరీ సభకు పది నిమిషాల సమయం మాత్రమే మిగిలింది. అయితే సుమారు 8 గ్రామాల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు రోడ్ షో నిర్వహించి కూటమి పక్షాలను, ప్రజలను ఉత్సాహపరిచారు.
• రాజోలు గడ్డ.. జనసేన అడ్డా..
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రాజోలు, రామచంద్రపురం నియోజకవర్గాల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పర్యటించారు. సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో రాజోలు నియోజకవర్గం మలికిపురం చేరుకున్న ఆయన అక్కడ జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. రాజోలు గడ్డ.. జనసేన అడ్డా.. అని నిరూపిస్తూ జన ప్రభంజనం మధ్య వారాహి సభ సాగింది. వీర మహిళలు హారతులు పట్టి స్వాగతం పలుకగా కూటమి ప్రభుత్వం వచ్చాక తమ సమస్యలు పరిష్కరించాలంటూ మోరి, మోరిపాడు జీడిపిక్కల కార్మికులు వినతి పత్రాలు సమర్పించారు. అనంతరం అశేష జనవాహనిని ఉద్దేశించి ప్రసంగించారు.
• యానాం – ద్రాక్షారామం మధ్య కిక్కిరిసిన రహదారులు
అక్కడి నుంచి రామచంద్రపురం నియోజకవర్గానికి బయలుదేరారు. రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం మీదుగా దారి పొడుగునా జనసేన శ్రేణుల ర్యాలీలు, హారతుల స్వాగతం మధ్య యానాం చేరుకున్నారు. యానాంలో రామచంద్రపురం నియోజకవర్గ జనసైనికులు బాణసంచా పేలుళ్లు, జనసేన జెండాల రెపరెపలతో శ్రీ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికారు. అక్కడి నుంచి వేలాది బైకులతో భారీ ర్యాలీగా సుంకరపాలెం, చింతాకులవారిపేట, ఇంజరం, కోలంక, ఉప్పుమిల్లి, కుయ్యేరు, బాలాంత్రం, ఎర్రపోతవరం, వేగయ్యపేట తదితర గ్రామాల మీదుగా ద్రాక్షారామం సభకు తరలివెళ్లారు. గ్రామగ్రామాన ఆడపడుచులు జనసేనానికి హారతులు పట్టగా, ప్రజలు మద్దతుగా పెద్ద సంఖ్యలో రోడ్ల మీదకు వచ్చారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పూలు, పూలదండలతో ముంచెత్తారు. రహదారులన్నీ జనసైనికులు, వీర మహిళలతో కిక్కిరిసిపోవడంతో యానాం, ద్రాక్షారామం మధ్య 18 కిలోమీటర్ల ప్రయాణానికి గంటన్నర సమయం పట్టింది. ప్రతి ఒక్కరికీ అభివాదం చేసుకుంటూ, ప్రతి ఆడపడుచు ఇచ్చిన హారతి స్వీకరిస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముందుకు సాగారు. అప్పటికే ద్రాక్షారామం వారాహి విజయభేరీ సభా ప్రాంగణం వేలాది మంది జనసైనికులు, టీడీపీ, బీజీపీ కార్యకర్తలు, ప్రజలతో నిండిపోగా ర్యాలీ కారణంగా సభ ముగింపుకి కేవలం 10 నిమిషాల సమయం మాత్రమే మిగిలింది. వచ్చిన వెంటనే వేదిక మీదకు ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తూనే ప్రసంగించారు. అసెంబ్లీ, పార్లమెంటు బరిలో ఉన్న కూటమి అభ్యర్ధులను గెలిపించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *