సుస్థిరమైన కూటమి ప్రభుత్వం రాబోతోంది

• యువతరం ఆక్రోశం ఓట్ల రూపంలో చూపించాలి
• ఆడబిడ్డల రక్షణకు పెద్దపీట వేస్తాం
• పొత్తు ధర్మం పాటించి పరస్పరం సహకరించుకుందాం
• ద్రాక్షారామం వారాహి విజయభేరి యాత్ర బహిరంగ సభలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్

‘ఈసారి రాష్ట్రంలో సుస్థిర, సమర్ధవంతమైన పాలన రావాలి. ప్రజల కష్టాలను మనసుతో అర్ధం చేసుకునే పాలన, యువతకు ఉపాధి కల్పించే పాలన రావాలి. మళ్లీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పురోగమనం దిశగా సాగాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాల’ని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా శుక్రవారం రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామంలో వారాహి విజయభేరి యాత్ర బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… “వైసీపీ దోపిడీని అరికట్టి ఆ పార్టీని ఇంటికి పంపించాల్సిన సమయం ఆసన్నమైంది. 18 రోజుల్లో రాబోతున్న ఎన్నికల్లో యువతరం వారి కోపం, ఆక్రోశాన్ని అంతా ఓట్ల రూపంలో బలంగా చూపించాలి. అన్ని రంగాలను నాశనం చేసి, వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఈ ప్రభుత్వం కచ్చితంగా ఇంటికి వెళ్లబోతోంది. వచ్చేది కూటమి ప్రభుత్వమేనని రాష్ట్రంలో స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. రాబోయే ప్రభుత్వంలో జనసేన కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పటి వరకు మనసుతో అర్ధం చేసుకున్న ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తాను. ఒక సామాన్యుడి వేదన ఎలా ఉంటుందో అసెంబ్లీలో గళం వినిపిస్తాను. ముఖ్యంగా ఆడబిడ్డలకు పూర్తిస్థాయి రక్షణ బాధ్యతలను కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. దానికే మొదటి ప్రాధాన్యం ఇస్తాం. ఈ ఎన్నికల్లో రామచంద్రపురం నియోజకవర్గం నుంచి మొదట జనసేన పోటీ చేస్తుందని అనుకున్నాం. అయితే పొత్తు ధర్మంలో భాగంగా తెలుగుదేశం పార్టీకి ఈ సీటు కేటాయించాల్సి వచ్చింది. యువకుడు, ఉత్సాహవంతుడు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారికి జన సైనికులు అండగా నిలబడాలి. పొత్తు ధర్మంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జనసేనకు అండగా నిలుస్తోంది. జన సైనికులు కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి. బీజేపీ కూడా మనకు సహకరిస్తోంది. వచ్చేది కచ్చితంగా కూటమి ప్రభుత్వమే… వైసీపీ అవినీతి కోటలను బద్ధలు కొడుతున్నాం. అమలాపురం లోక్ సభ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా శ్రీ హరీష్ మాధుర్, రామచంద్రపురం శాసనసభ స్థానానికి కూటమి అభ్యర్థిగా శ్రీ వాసంశెట్టి సుభాష్ , మండపేట నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా శ్రీ వేగుళ్ళ జోగేశ్వరరావు పోటీ చేస్తున్నారు. వీరిని భారీ మెజార్టీతో గెలిపించాల”ని కోరారు.