జనసేన వైపు చూడండి… నిండు మనసుతో ఆశీర్వదించండి

* రాష్ట్ర దశ, దిశ మారుస్తాం
* అవినీతి, లంచగొండితనం లేని పాలన తీసుకొస్తాం
* బాధ్యతగల వ్యక్తులనే చట్టసభలకు పంపిస్తే రాష్ట్రం బాగుపడుతుంది
* వైసీపీకి మరోసారి అవకాశం ఇస్తే రాష్ట్రం సర్వనాశనమే
* లక్షల కోట్లు అప్పులు తెచ్చి జేబులు నింపుకొన్నారు
* కాగ్ ప్రశ్నలకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు
* తప్పు చేస్తే సీఎంనైనా నిలదీసే యువత ఉండాలనే పార్టీ పెట్టాను
* యువతకు ఉపాధి, కన్నీరు పెట్టని రైతాంగం ఉండాలన్నదే జనసేన ఆశ
* షణ్ముఖ వ్యూహంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తాం
*పర్చూరు రైతు భరోసా సభలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్

అడిగిన వారు ఎవరెవరికో అవకాశం ఇచ్చారు… ఈసారి జనసేన పార్టీకి సంపూర్ణ అండదండలు అందించి ఆశీర్వదించండి… రాష్ట్రం దశ దిశను మార్చే బాధ్యత తీసుకుంటామని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు హామీ ఇచ్చారు. అవినీతి, లంచగొండితనం లేని పాలన అందిస్తామని, తప్పు చేసిన నాయకుడిని ప్రజా కోర్టులో నిలబెట్టి శిక్షపడేలా చేస్తామని… జనసేన వైపు చూడాలని కోరారు. బాధ్యత గల వ్యక్తులను ప్రజాప్రతినిధులుగా పంపించకపోతే రాష్ట్రం బాగుపడదని, వైసీపీకి మరోసారి అవకాశం ఇస్తే రాష్ట్రం సర్వ నాశనమవుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు సుభిక్షంగా ఉండాలన్నా, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగాలన్నా, కన్నీరు పెట్టని రైతాంగం ఉండాలన్నా ఒక్కసారి జనసేనకు అండగా నిలబడాలని కోరారు. ఆదివారం సాయంత్రం పర్చూరులోని ఎస్.కె.పి.ఆర్. డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా రచ్చబండ కార్యక్రమం జరిగింది. సాగు భారమై బలవన్మరణానికి పాల్పడిన 74 మంది కౌలు రైతు కుటుంబాలను శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరామర్శించి, ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… “అధికారంలోకి వస్తే అద్భుతాలు చేస్తామని, ప్రజల కన్నీరు తుడుస్తామని 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ నాయకులు చెప్పారు. వాళ్లు చెప్పిన మాటలు నమ్మి మీరు కూడా వాళ్లను గెలిపించారు. వాళ్లు అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో 3వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే … ఆత్మహత్యలు చేసుకున్న వారు రైతులే కాదన్నట్లు మాట్లాడుతున్నారు. ఒక్క ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే దాదాపు 84 మంది కౌలు రైతులు బలవన్మరణాలకు పాల్పడితే ఇప్పటి వరకు వాళ్లను ప్రభుత్వం గుర్తించలేదు. చనిపోయిన వాళ్లకు గుర్తింపు కార్డులు లేవని అంటోంది. కౌలు రైతులకు పాస్ పుస్తకాలు, గుర్తింపు పత్రాలు ఉండవని వ్యవసాయం తెలిసిన అందరికీ తెలుసు ఒక్క ముఖ్యమంత్రికి తప్ప.
* ప్రామిస్ చేయడం…మోసం చేయడమే వైసీపీ నైజం
వైసీపీ ప్రభుత్వం అద్భుతమైన పాలన అందిస్తే ఆనందపడేవాడిని. కానీ వాళ్లు చెప్పేది ఒకటి… చేస్తోంది మరొకటి. పరిశ్రమలు వస్తాయి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు. మద్యపాన నిషేధం అన్నారు. పోలవరం పూర్తి చేస్తామన్నారు. బీజేపీ మెడలు వంచైనా ప్రత్యేక హోదా తీసుకొస్తామని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని చెప్పారు. ఇలా ఇచ్చిన ఏ హామీనీ వాళ్లు నిలబెట్టుకోలేదు. ప్రామిస్ చేయడం ప్రజలను మోసం చేయడం వైసీపీ నైజంగా మారింది. వైసీపీ నాయకులు సంస్కారం, ఇంగిత జ్ఞానం లేకుండా ఏది పడితే అది మాట్లాడొచ్చు. మనం మాత్రం వాళ్లను ఒక్క మాట కూడా అనకూడదు. రోడ్ల దుస్థితి గురించి ప్రశ్నించినందుకు ఈ జిల్లాకు చెందిన వెంగయ్య నాయుడు అనే జనసైనికుడిని వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారు. వాళ్ల పాలసీలను ప్రశ్నించినందుకు నన్ను వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. వాళ్లకు తెలియని విషయం ఏంటంటే నేను వాళ్లకంటే గట్టి మనిషిని. పాలసీపరంగా మాట్లాడుకుందాం అంటే మేము ముందు దానికే ప్రాధాన్యత ఇస్తాం. కాదు గొడవే పడతాం అనుకుంటే ఏ స్థాయి గొడవకైనా సిద్ధం. మీ దగ్గర అధికారం, గూండా, డబ్బు బలం ఉంటే మా దగ్గర టంగుటూరి ప్రకాశం పంతులు గారిని స్ఫూర్తిగా తీసుకున్న గుండె ధైర్యం ఉంది.
* వాళ్లకో న్యాయం మనకో న్యాయమా?
ఎవరి మీదయినా చిన్న క్రిమినల్ కేసు ఉంటే ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హుడు అని ముద్ర వేసి ఉద్యోగాలు ఇవ్వడం లేదు. అలాంటిది ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల మీద అన్ని కేసులు ఉన్నా ఎలా వస్తున్నాయి ప్రజా ప్రతినిధులుగా కొలువులు? మనకేనా రూల్స్… వాళ్లకి వర్తించవా? మనకో న్యాయం వాళ్లకో న్యాయమా? ముఖ్యమంత్రి సొంత చిన్నాన్న వివేకానందరెడ్డిని హత్య చేశారు. మొదట గుండెపోటు అన్నారు. తరువాత ఎవరో హత్య చేశారు అన్నారు. ఇప్పుడు విచారణకు వచ్చిన సీబీఐ అధికారులనే బెదిరిస్తున్నారు. ఈ పరిస్థితి మార్చాలనే జనసేన పార్టీ పెట్టాను. పార్టీ స్థాపించింది ముఖ్యమంత్రి అయిపోవాలనో, సీఎం కాకపోతే వెనక్కి వెళ్లిపోవాలనో కాదు. ముఖ్యమంత్రి తప్పు చేసినా చొక్కపట్టుకొని నిలదీసే యువతను తయారు చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను. జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించినా ప్రశ్నించే హక్కు ప్రజలు కోల్పోకూడదు. మా వాళ్లు తప్పు చేసినా, నేను తప్పు చేసినా మమ్మల్ని నిలదీసే ప్రజాస్వామ్యాన్నే కోరుకుంటాను.
* మీరు సీబీఐ దత్తపుత్రుడు…. ఇది వాస్తవం
పాదయాత్రలు, ఓదార్పు యాత్రలు చేసి ముద్దులు పెట్టి నోటికొచ్చిన హామీలు ఇచ్చారు. ఇప్పుడు వాటిపై ప్రజల పక్షాన ప్రశ్నిస్తుంటే సీబీఎన్ దత్తపుత్రుడు అని అంటున్నారు. మీరు అలా పిలిచినంత మాత్రాన నా ఒంటికి చిల్లులు పడిపోవు. మీరు ఎన్నిసార్లు పిలిచినా అది వాస్తవం కాదని ప్రజలకు కూడా తెలుసు. ఇంతకుముందు కూడా నేను చెప్పాను…నేను ప్రజలకు దత్తపుత్రుడిని తప్ప మరెవరికి కాదని. సీబీఐ దత్తపుత్రుడు అని నేను పిలిచిన మాట వాస్తవం. భవిష్యత్తులో మీరు సీబీఐ కేసులు ఎదుర్కొనే తీరాలి. ఫాదర్స్ డే రోజున.. ఇంతమంది తండ్రిలేని పిల్లలను చూస్తున్నాం. ఈ పాపం ఎవరిది? మేము లక్ష ఇస్తున్నాం ఈ డబ్బుతో అద్భుతాలు జరిగిపోతాయని చెప్పడం లేదు. తోటి మనిషి కష్టాల్లో ఉంటే వాళ్లు కన్నీరు తుడవడానికి వచ్చామని చెప్పడానికే ఇక్కడికి వచ్చాం. జనసేన పార్టీ అద్భుతాలు చేయకపోవచ్చు కానీ సాటి మనిషి కన్నీరు తుడవగలిగే హృదయం ఉంది అది చాలు. కొంతమంది నాయకులు డబ్బు మదం తలకెక్కి ప్రజలను బానిసలు అనుకుంటున్నారు. ఏదైనా సమస్య గురించి వెళ్తే ఓటుకు రెండు వేలు ఇచ్చాం కదా ఇంకేంటి అన్నట్లు మాట్లాడుతున్నారు. ప్రశ్నిస్తే దాడులు, కేసులు పెడుతున్నారు. నోటుతో ఓటును కొనుక్కోవచ్చనే ఎమ్మెల్యేను రోడ్లు మీద నిలదీసే రోజు రావాలి.
* వైసీపీ ఇంకోసారి గెలిస్తే రాష్ట్ర వినాశనమే
పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక, అమ్మిన పంటకు సకాలంలో డబ్బులు రాకపోవడంతో ఇవాళ రైతాంగం క్రాప్ హాలిడే ప్రకటించింది. తూర్పు గోదావరి జిల్లాలో 12 మండలాలు, గుంటూరు జిల్లాలో 3 వేల ఎకరాలు, కడప, నెల్లూరు జిల్లాల్లో రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నారు. అన్నం పెట్టే రైతులను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. దీనిపై మేము మాట్లాడితే జనసేన పార్టీ రైతులను రెచ్చగొడుతోంది అంటున్నారు. రైతులను రెచ్చగొట్టడానికి మాకేమైనా సరదానా? రైతుల్లో లేని కోపాన్ని తెప్పించగలమా? అలాగే పంటల బీమా కింద రూ. 2 వేల కోట్లు ఖర్చు చేశామని ప్రభుత్వం లెక్కలు చెబుతోంది. ఏ పంటకు ఎంత ఇచ్చారు.. ఏ జిల్లాలో ఏ పంటకు ఇచ్చారో చెప్పకుండా దాస్తున్నారు. సంక్షేమం పేరుతో ఈ మూడేళ్లలో దాదాపు 5 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చారు. ప్రజలకు ఇచ్చింది మాత్రం దాదాపు లక్ష నుంచి లక్షన్నర కోట్లు. మిగిలిన డబ్బు ఏమైందని కాగ్ ప్రశ్నిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. గుంటూరు చానెల్ కోసం సీఎంను కలుద్దామని రైతులు వెళ్తే వాళ్లను పోలీసులతో అడ్డుకున్నారు. ప్రకాశం జిల్లా నుంచి ఎందుకు వలసలు ఆగడం లేదు? వెలుగొండ ప్రాజెక్టు ఎందుకు పూర్తవ్వడం లేదు? రాజకీయ నాయకుల దగ్గర తప్ప ఎవరి దగ్గరా ఎందుకు సంపద ఉండటం లేదు? ఇవన్నీ ఎప్పుడైనా ఆలోచించారా? చిన్నప్పుడు నేను పెరిగిన కనిగిరిలో ఇప్పటికీ ఫ్లోరైడ్ రక్కసి ఉందంటే మన కోసం పని చేసే ప్రజా ప్రతినిధులు సరిగా పని చేయడం లేదని అర్థం. ఒక్కసారి అవకాశం ఇచ్చి చట్టసభలకు పంపిస్తే మనల్ని ఇంకేం పీకలేరని వాళ్లకు గుండె ధైర్యం. అలా కాకుండా రీకాల్ వ్యవస్థ ఉంటే వీళ్లు ఇలా ప్రవర్తించే వాళ్లా? కనీసం వచ్చే ఎన్నికల్లో అయినా మనకోసం నిలబడే నాయకులను ఎన్నుకుందాం. అలా కాదని మళ్లీ వైసీపీకి అవకాశం ఇస్తే మాత్రం రాష్ట్రం సర్వనాశనం అవుతుంది.
* వచ్చే సార్వత్రిక ఎన్నికలు చాలా కీలకమైనవి
2024 సార్వత్రిక ఎన్నికలు చాలా కీలకమైనవి. రాష్ట్ర భవిష్యత్ ను నిర్ధారించే ఎన్నికలు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే షణ్ముఖ వ్యూహంతో ముందుకు వెళ్తాం. అధికారంలోకి రాగానే యువతకు రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తాం. తమ సొంత కాళ్ల మీద వాళ్లు నిలబడేలా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రూ. 10 లక్షల రుణం అందిస్తాం. ఎలా ఇస్తారని మీరు అడగొచ్చు. కొంతమంది అవినీతి నాయకులు లక్ష కోట్లు ప్రజాధనం తినేసినప్పుడు యువతకు ఎందుకు రూ.10 వేల కోట్లు పంచలేం. అన్నం పెట్టే రైతు కన్నీరు తుడిచేలా చర్యలు తీసుకుంటాం. వ్యవసాయం గిట్టుబాటు కాదు లాభసాటి అయ్యేలా మారుస్తాం. దసరా నుంచి ప్రజా సమస్యలపై రోడ్ల మీదే ఉంటాం. ఈ సారి నిండు మనసుతో జనసేన పార్టీకి అండగా నిలవాలని” కోరారు.