వైసీపీ గ్రామసింహాల గోంకారాలు సహజమే!: పవన్ కల్యాణ్

సినీ రంగ సమస్యలు, ఆన్ లైన్ టికెటింగ్ విధానం నేపథ్యంలో పవన్ కల్యాణ్ కు, ఏపీ మంత్రులకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. సాయితేజ్ నటించిన రిపబ్లిక్ చిత్రం ప్రీరిలీజ్ వేడుకలో పవన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ మంత్రులను రెచ్చగొట్టాయి. వెల్లంపల్లి నుంచి మొదలుకుని బొత్స, అనిల్ కుమార్, పేర్ని నాని, అవంతి వరకు పవన్ కల్యాణ్ ను తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ స్పందించారు.

‘తుమ్మెదల ఝుంకారాలు, నెమళ్ల క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు, వైసీపీ గ్రామసింహాల గోంకారాలు సహజమే’ అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ఈ సందర్భంగా కరీబియన్ మ్యూజిక్ బ్యాండ్ ‘బహా మెన్’ ఆలపించిన “హూ లెట్స్ ద డాగ్స్ అవుట్ (ఈ కుక్కలను బయటికి వదిలింది ఎవరు?)” అనే పాటను కూడా పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో పంచుకున్నారు. ఈ పాట తనకెంతో ఇష్టమైన పాటల్లో ఒకటని తెలిపారు.