ప్రజాధనాన్ని దోచుకువటంలో పీ హెచ్ డీ చేసిన వైసీపీ నేతలు

  • ఇప్పటికే ప్రకటనల పేరుతో కోట్ల రూపాయల దుబారా చేస్తున్న ప్రభుత్వం
  • రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా హోర్డింగుల పేరుతో ప్రజాధనాన్ని దోచుకునే యత్నం
  • అసలే అరకొరగా ఉన్న కార్పొరేషన్ ఆదాయానికి గండికొట్టేలా కొంతమంది కార్పొరేటర్ల యత్నం
  • క్షేత్రస్థాయిలో కొంతమంది కార్పొరేటర్ల తీరుతో బెంబేలెత్తుతున్న ప్రజలు
  • కార్పొరేటర్ల ధనదాహానికి అంతేలేదా?
  • ఇలాగైతే నగరాభివృద్ధి, నగర సుందరీకరణ ఎలా సాధ్యం
  • అనధికార హోర్డింగులపై , వారికి సహకరిస్తున్న అధికారులపై కమీషనర్ ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి
  • జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

మాటతప్పను, మడమ తిప్పను అంటూ మాయమాటలు చెప్పి, అలవికాని హామీలిచ్చి అధికారంలోకి రావటంలోనూ, అధికారంలోకి వచ్చాక పరిపాలనను గాలికొదిలేసి ప్రజాధనాన్ని దోచుకోవటంలోనూ వైసీపీ నేతలు పీ హెచ్ డీ చేశారని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలో అనధికార ప్రకటనల హోర్డింగులను తొలగించాలి అంటూ కొంతమంది కార్పొరేటర్లు స్థానిక శాసనసభ్యులను, సంభందిత అధికారులను కోరటంపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ నగరంలో అనధికార హోర్డింగులను తొలగించమంటూ కొంతమంది కార్పొరేటర్లు చేసిన వినతి పట్ల తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, దీనికి సంభందించి అక్రమాలకు పాల్పడుతున్న ప్రకటనల ఏజెన్సీలపై, వారికి సహకరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సినదిగా కూడా జనసేన కోరుతుందన్నారు. అయితే ఈ క్రమంలో
ప్రభుత్వం చేపడుతున్న పధకాలను ప్రచారం చేసేందుకు నగరంలో ఉన్న ప్రతీ డివిజన్ కార్పొరేటర్ కు పది హోర్డింగులు కేటాయించాలని వారు కోరడాన్ని మాత్రం తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. నగరంలో ఉన్న 57 మంది కార్పొరేటర్లకు 570 హోర్డింగులు కేటాయిస్తే కార్పొరేషన్ కి రావాల్సిన ఆదాయానికి భారీగా గండిపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు భారణా కోడికి చారానా మసాలా అన్నట్లు పథకాల లబ్ది ఏమో కానీ ప్రకటనల పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని ధ్వజమెత్తారు. ఇక ప్రకటనల పేరుతో సొంత మీడియాకి ఎన్ని కోట్ల ప్రజాధనాన్ని కుమ్మరించారో ఇప్పటికీ లెక్కలేదని దుయ్యబట్టారు. అది చాలదు అన్నట్లు రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా ఇప్పుడు నగరపాలక సంస్థకు ఆదాయం వచ్చే హోర్డింగులపై కొంతమంది కార్పొరేటర్ల కన్నుపడిందని విమర్శించారు. మొదట ప్రకటనల పేరుతో హోర్డింగులు తీసుకొని ఆ తరువాత వాటిని వ్యాపార, వేడుకల ప్రకటనలకు కేటాయించరన్న గ్యారంటీ ఏముందని ప్రశ్నించారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో కొంతమంది కార్పొరేటర్ల ధనదాహానికి అంతే లేకుండా పోతుందని మండిపడ్డారు. తాము కోట్లు ఖర్చు పెట్టి గెలిచింది ప్రజలకు సేవ చేయటానికి కాదని కొందరు వ్యాఖ్యానించటం శోచనీయం అన్నారు. ఇంటిముందు ఇసుక కనిపిస్తే చాలు రాబందుల్లా వాలంటీర్లు, వార్డు సెక్రటరీలు వాలుతున్నారని విమర్శించారు. అన్ని అనుమతులతో కట్టడాలు జరుపుతున్నామని యజమానులు మొత్తుకుంటున్నా స్థానిక కార్పొరేటర్ కు లోకల్ టాక్స్ కట్టాల్సిందేనంటూ వారి దగ్గర నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అక్రమ వసూళ్ల వాటాల్లో తేడా వచ్చి ఈ మధ్య ఇద్దరి కార్పొరేటర్ల నడుమ వివాదం కూడా జరిగిందన్న విషయం ప్రజలందరికీ తెలిసిందేనన్నారు. ఈ క్రమంలో అసలే అరకొరగా ఉన్న కార్పొరేషన్ ఆదాయానికి గండికొట్టే ప్రమాదాన్ని గుర్తించి అక్రమ హోర్డింగుల నిర్వహణపై కమీషనర్ ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. నగరంలో ఉన్న ప్రతీ హోర్డింగుకు జియో ట్యాగ్, బార్ కోడ్ కేటాయిస్తే అనధికార హోర్డింగులను అరికట్టి కార్పొరేషన్ కు భారీ ఆదాయాన్ని సమకూర్చవచ్చని దానిద్వారా నగర అభివృద్ధి, సుందరీకరణ చేపట్టవచ్చని అన్నారు. ప్రతీ కార్పొరేటర్ కు పది హోర్డింగులను కేటాయించటాన్ని మాత్రం జనసేన పూర్తిగా వ్యతిరేకిస్తోందని ఆళ్ళ హరి అన్నారు.