వైసీపీ శాసనసభ్యుల ఆగడాలు శ్రుతి మించిపోతున్నాయి

• కుళాయి కలెక్షన్లకు కూడా ఎమ్మెల్యే అనుమతి కావాలా?
• ప్రశ్నిస్తే గంజాయి కేసులు పెడుతున్నారు
• పచ్చటి గ్రామాల్లో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు
• వైసీపీ అరాచకాలను తిప్పికొట్టాలి
• సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఓట్లు రాలవు
• మండల స్థాయిలో సమస్యలపై పోరాటం చేయండి
• జనసేన తూర్పుగోదావరి జిల్లా స్థాయి సమావేశంలో పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యేల దౌర్జన్యాలు రానురాను శ్రుతి మించిపోతున్నాయని.. కుళాయి కనెక్షన్లకు కూడా శాసనసభ్యుల వద్దకు వెళ్లి నిలబడాల్సి రావడం పరిస్థితులకు అద్దంపడుతోందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. మున్సిపల్ అధికారులే ఎమ్మెల్యేలతో ఫోన్ చేయించమనడం దారుణమన్నారు. రాష్ట్రంలో ఇంత దారుణ పరిస్థితులు ఏర్పడడానికి వైసీపీ నాయకత్వమే కారణమన్నారు. ప్రశ్నించే గొంతులు నొక్కే ఆలోచనతో అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం పరిధిలోని కడియపులంకలోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్ అధ్యక్షతన జరిగిన నియోజక వర్గ ఇంఛార్జులు, జిల్లా కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ప్రతి నెల 5వ తేదీ పార్టీ జిల్లా విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకుంటున్న ఈ కార్యక్రమాన్ని అభినందించారు. ఈ సందర్భంగా శ్రీ మనోహర్ గారు మాట్లాడుతూ “వైసీపీ ప్రభుత్వ అరాచకాలపై ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ పార్టీ నాయకుల ఆగడాలు రోజు రోజుకీ పెచ్చుమీరుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో గంజాయి దొరుకుతోంది. ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, సమస్యల మీద పోరాటం చేసినా అక్రమంగా గంజాయి కేసులు బనాయిస్తున్నారు. ఒంగోలులో సుబ్బారావు గుప్తాపై పెట్టిన కేసు అలాంటిదే. ఆయన స్కూటర్లో కిలో గంజాయి ఎలా వచ్చింది? అధికార యంత్రాంగం పాత్ర లేకపోతే అంత దూరం ప్రయాణించి ఎలా వస్తుంది? గత ఏడాది జనసేన ఆవిర్భావ సభ కోసం భూమి ఇచ్చి నిలబడినందుకు ఇప్పటం గ్రామం మీద కక్ష సాధిస్తున్నారు. గ్రామంలోకి వెళ్లడానికి 10 అడుగుల రోడ్డు లేదు. ఊరు మధ్య మాత్రం 120 అడుగుల రోడ్డు వేస్తామని ఇబ్బంది పెడుతున్నారు. పచ్చటి గ్రామంలో కులాల మధ్య గొడవలు పెడుతున్నారు. ఆ గ్రామానికి శ్రీ పవన్ కల్యాణ్ గారు ఎలా నిలబడ్డారో అంతా చూశారు. ఇప్పటం కోసమే కాదు రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా నిలబడింది.. పోరాటం చేసింది శ్రీ పవన్ కళ్యాణ్ గారే. ప్రతి కార్యక్రమానికి సొంత నిధులు వెచ్చిస్తూ ఆదర్శవంతంగా నిలబడ్డారు. పార్టీని ఎంతో పారదర్శకంగా 9 సంవత్సరాలు మోసుకొచ్చారు. అదే స్ఫూర్తితో మనమంతా ముందుకు వెళ్లాలి. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఓట్లు వస్తాయనుకోవద్దు. పార్టీ పక్షాన చేపట్టే ప్రతి కార్యక్రమం ప్రజల కోసం, రాష్ట్రం కోసం.. ఓ మార్పు కోసం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. పార్టీకి ఒక ప్రణాళిక ఉంటుంది. అది ప్రకటించే వరకు అంతా ఓపికగా ఉండండి. ముందుగా మీ మండలాల్లో సమస్యల మీద దృష్ణి సారించండి. క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లాను రాష్ట్రంలో నంబర్ వన్ స్థానంలో నిలబెట్టిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా అభినందనలు తెలియచేస్తున్నాం.
• కనీవినీ ఎరుగని రీతిలో మచిలీపట్నం ఆవిర్భావ సభ
మార్చి 14వ తేదీ మచిలీపట్నం వేదికగా నిర్వహించనున్న పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేద్దాం. దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించనున్న అద్భుత సభ ద్వారా జనసేన పార్టీ భవిష్యత్ ప్రణాళికలు, ప్రజల పక్షాన ఎలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్లబోతున్నాం అనే విషయాలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వివరిస్తారు. సభ కోసం తరలివచ్చే ఏ ఒక్కరికీ ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లా నాయకత్వం అంతా ఒకే మాట మీద ముందుకు వెళ్లి పార్టీ విజయానికి కృషి చేయాలి” అన్నారు.
• క్రియా వాలంటీర్లకు సత్కారం
అనంతరం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి అత్యధిక క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేసిన క్రియా వాలంటీర్లను పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ శాలువాతో సత్కరించారు. 500కు పైగా సభ్యత్వాలు నమోదు చేసిన వాలంటీర్లను నియోజకవర్గాల వారీగా పిలిచి అభినందించారు. వారి సేవలను పార్టీ గుర్తు పెట్టుకుంటుందని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో పార్టీ పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్, పితాని బాలకృష్ణ, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అన్ని నియోజకవర్గాల ఇంఛార్జులు, రాష్ట్ర, జిల్లా కమిటీల సభ్యులు, మండలాధ్యక్షులు పాల్గొన్నారు.