దెయ్యలకే పిచ్చి పట్టేలా వైసీపీ పాలన

• మ్యాగ్జిమమ్ కరప్షన్.. మినిమమ్ సీఎం
• వైసీపీ పాలనలో అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి
• రైతుల ఆత్మహత్యల్లో మూడో స్థానం.. కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉన్నాం
• ప్రతి గింజ కొనుగోలు చేస్తామన్న ముఖ్యమంత్రి ఏమయ్యారు?
• పంట నష్టపోయిన రైతులపై పగ సాధిస్తారా?
• పార్టీ రంగులు పులమడానికే రైతు భరోసా కేంద్రాలు
• కరోనా కష్టాల్లో ఉన్న ప్రజల్ని వన్ టైమ్ సెటిల్మెంట్ అని వేధిస్తున్నారు
• వన్ టైమ్ సెటిల్మెంట్ గురించి మాట్లాడితే అరెస్టు చేస్తారంట… ఇక్కడ ఆ విషయమే మాట్లాడుతున్నాం
• చెరుకుపల్లి జనసేన ప్రజా సభలో శ్రీ నాదెండ్ల మనోహర్

వైసీపీ ప్రభుత్వ పాలన చూస్తే దెయ్యానికే పిచ్చి పట్టేలా ఉందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. ఈ పరిపాలన మ్యాగ్జిమమ్ కరప్షన్.. మినిమమ్ సీఎం అనే విధంగా ఉందన్నారు. పైశాచికత్వంతో కూడిన పాలన.. జమిందారీ వ్యవస్థ లాంటి నాయకత్వం.. ఎక్కడికి పోయినా లంచాలు.. ఈ దుర్మార్గపు పాలన తీరుతో అన్ని వర్గాల ప్రజలను నానా ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల కోసం ఈ సభ ఏర్పాటు చేశామని, రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేసే వరకు జనసేన పార్టీ తరఫున పోరాటం చేస్తామన్నారు. గుంటూరు జిల్లా రేపల్లె యోజకవర్గంలోని చెరుకుపల్లిలో ఏర్పాటు చేసిన జనసేన ప్రజా సభలో పాల్గొన్నారు. పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు శ్రీ గాదె వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సభను ఉద్దేశించి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “వైసీపీ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మత్స్యకారులను ఈ పాలకులు ఏ విధంగా వేధిస్తున్నారో అందరికీ తెలుసు. 217 జీవోతో మత్స్యకారుల జీవనాన్ని దెబ్బ తీసే నిర్ణయం తీసుకున్నారు. వాన్ పిక్ పేరు చెప్పి ఈ ప్రాంతంలో 15 వేల ఎకరాలు దోచేశారు. ఒక్క ఉద్యోగం ఇచ్చింది లేదు. రాష్ట్రంలో మత్స్యకారులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. బీటెక్ చదువుకున్న మత్స్యకార యువకులు మార్కెట్లో చేపలు అమ్ముకుంటున్న పరిస్థితి. మత్స్యకారుల ప్రయోజనాలకు ఉపయోగపడాల్సిన గంగవరం పోర్టులో వాటాలను ఈ ప్రభుత్వం స్వార్థం కోసం అమ్మేసుకున్నారు. రూ. 600 కోట్లకు 10 శాతం వాటా అమ్మేశారు. మత్స్య కారుల అభివృద్ధికి వినియోగించాల్సిన ఆ నిధులను దుర్వినియోగం చేసి ఇతర పథకాలకు మళ్లించుకున్నారు.
మత్స్యకారుల సంక్షేమం కోసం జనసేన పార్టీ పక్షాన శ్రీ పవన్ కళ్యాణ్ గారు మత్స్యకార వికాస విభాగాన్ని ఏర్పాటు చేశారు. చేనేతల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. జాతి కోసం కష్టపడిన వర్గాలు ఇవి. క్షేత్ర స్థాయి నుంచి బయటకు వస్తున్న ఆ వర్గాల కోసం మనమంతా నిజాయతీగా పని చేయాలి.

• ఎన్ని లక్షల కోట్లు దోచుకొంటే వైసీపీ ధన దాహం తీరుతుంది?

రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా కృత్రిమ ఇసుక కొరత సృష్టించి ప్రజలను అడ్డంగా దోచుకునే కార్యక్రమానికి అధికారంలోకి రాగానే తెరతీసింది. ఆనాడు ప్రభుత్వ విధానాల కారణంగా ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు అండగా నిలబడింది శ్రీ పవన్ కళ్యాణ్ గారే. విశాఖలో వారి కోసం భారీ కవాతు నిర్వహించి పోరాటం చేశారు. గతంలో రూ.2 వేలకు వచ్చిన ట్రక్కు ఇసుక ఇఫ్పుడు రూ.50 వేలు దాటి పోయింది. తమకు నచ్చిన ప్రవేటు సంస్థకు ఇసుక తవ్వకాలు అప్పగించి ఇష్టారాజ్యంగా అమ్ముకుంటుంటే సామాన్యులు ఇళ్లు ఎలా కట్టుకోగలరు. మొన్న కోనసీమ ప్రాంతంలో పర్యటిస్తే ట్రక్కు ఇసుక రూ.70 వేలకు అమ్ముతున్నట్టు ప్రజలు చెబుతున్నారు. ఈ పరిపాలనను తిప్పికొడదాం. ప్రభుత్వం ఉచిత ఇసుక ఇవ్వాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేద్దాం. పేద ప్రజల గృహ నిర్మాణానికి ఇసుక ఉచితంగా ఇవ్వాలని ఈ వేదిక మీద నుంచి డిమాండ్ చేస్తున్నాం. జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి పేద కుటుంబానికి, ప్రతి పంచాయతీ కార్యాలయానికి, ప్రభుత్వ నిర్మాణాలకు ఇసుక ఉచితంగా ఇస్తుంది. గతంలో ఉన్న వనరులన్నీ దోచుకున్నారు. ఇంకా ఎన్ని లక్షల కోట్లు దోచుకుంటే వైసీపీ వాళ్ళ ధనదాహం తీరుతుంది?

• ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఏమైపోయాయి


ఈ ముఖ్యమంత్రి గారికి సమాజం కోసం స్పందించే హృదయం లేదు. ఎన్నికల ముందు దళిత, గిరిజనులకు అండగా నిలబడుతామని చెబుతూ గ్రామాల్లోముద్దులు పెట్టుకుంటూ తిరిగారు. గెలిచిన తర్వాత సబ్ ప్లాన్ గురించి మాట్లాడరు.. సబ్ ప్లాన్ నిధుల గురించి మాట్లాడరు. వారి అభివృద్ధి కోసం ఆ నిధులు ఎందుకు ఖర్చు చేయడం లేదు. ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి లేదు. దళిత, బహుజనుల కోసం మొదటి నుంచి నిలబడిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. మాజీ ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్య గారు చేసిన త్యాగాలు ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించే విధంగా ఒక చక్కటి నిర్మాణం చేపట్టాలని ఆయన భావించారు. అందుకోసం రూ.కోటి విరాళం ఇచ్చారు.

• కళ్ల ముందు పంట నష్టం కనిపిస్తున్నా పరిహారం ఇవ్వరు


రైతుల కోసం ఈ సభ ఏర్పాటు చేశాం. అకాల వర్షాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నోటి దాక వచ్చిన పంట నష్టపోయారు. ఈ ప్రభుత్వం ఎందుకు వారికి సహకరించదు. మీరు ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు దేని కోసం. రాష్ట్రవ్యాప్తంగా 10 వేల రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అవి ఎవరికి ఉపయోగపడుతున్నాయి. మూడు రంగులు పులమడానికి, మీ కాంట్రాక్టర్ల కోసమే వాటిని కట్టారు. రైతుల గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించడం లేదు. పంట నష్టంపై సర్వేలు చేయడం లేదు. ప్రతి గింజ కొంటామన్న ముఖ్యమంత్రి ఏమయ్యాడు. దేశంలో 70 శాతం ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం. మన రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం రాజ్యమేలుతోంది. దేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉండమే అందుకు నిదర్శనం. కౌలు రైతుల ఆత్మహత్యల్లోరెండో స్థానంలో ఉన్నాం. దీని కోసమేనా మీ పరిపాలన? దీని కోసమేనా ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేస్తుంది?

• పెన్షన్ ఇస్తూ రూ.200 కమిషన్ + చెత్త పన్ను


పంట చేతికి వస్తుందన్న సమయంలో నష్టం జరిగితే రైతుల్ని పట్టించుకోకుండా పగ సాధిస్తున్నారు. ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రానికి తెస్తేనే కొంటామని అధికారులు చెబుతున్నారు. అష్టకష్టాలు పడి అక్కడికి తీసుకువెళ్తే ఈ క్రాఫ్ లో నమోదు కాలేదని చెప్పి వెనక్కి పంపుతున్నారు. గుంటూరు జిల్లావ్యాప్తంగా అకాల వర్షాలకు పంటలు తడిసిపోతే ఆరు రోజుల తర్వాత అధికారులు చీకట్లో వచ్చి ఫోటోలు తీసుకువెళ్లారు. పరిహారం విషయంలోనూ పక్షపాతం. కొంతమందికే ఇస్తున్నారు. మిగిలిన రైతుల్ని అసలు లెక్కలోకి తీసుకోవడం లేదు. జొన్నల కొనుగోళ్లలో ఏ స్థాయిలో అవినీతి జరిగిందో జిల్లా మొత్తం తెలుసు. ప్రతి గింజా కొనుగోలు చేసే విధంగా కలెక్టరేట్ కి వెళ్లి పోరాటం చేద్దాం. రైతు భరోసా కేంద్రంలో పేరు నమోదుకు రైతుల నుంచి రూ. 3 వేల లంచం అడుగుతున్నారు. ఫించన్లు ఇచ్చే సమయంలో రూ.200 కమిషన్ ముందే తీసేసుకుంటున్నారు. దానికి తోడు చెత్తపన్ను రూ. 60 ముందు వసూలు చేస్తున్నారు. అసలు మీలో మానవత్వం ఉందా? కరోనా వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఉపాధి కోల్పోయి, అయిన వారిని కోల్పోయి కష్టాల్లో ఉంటే ఈ ముఖ్యమంత్రిగారు వాలంటీర్లను ఇంటికి పంపి వన్ టైమ్ సెటిల్మెంట్అం టూ పైశాచికానందం పొందుతున్నారు. వన్ టైమ్ సెటిల్మెంట్ గురించిమాట్లాడితే అరెస్టులు చేస్తారంట. చెరుకుపల్లినుంచి మాట్లాడుతున్నాం… వచ్చి అరెస్టు చేయండి. ముఖ్యమంత్రి గారికే
ధైర్యంగా బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇంట్లోనుంచి కదలరు. ప్రతి విషయంలో ప్రకటనలకే పరిమితం అవుతారు. ఈ రోజు వన్ టైమ్ సెటిల్మెంట్ గురించి పెద్ద ప్రకటన చేశారు. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం కట్టుకున్న ఇళ్లకు ఇప్పుడు పట్టాలు ఇవ్వమని ఎవరు అడిగారు. అధికారులకు టార్గెట్లు పెట్టి మరీ ప్రజల నుంచి వసూలు చేయిస్తున్నారు. గుంటూరు జిల్లా కలెక్టర్ గారు ఏదో ఘనకార్యం చేసినట్టు రూ.14 కోట్లు వసూలు చేశామని ప్రకటనలు చేస్తున్నారు. రైతులు ఇబ్బందులు పడుతుంటే ఈ దోపిడి దేని కోసం. ఖజానాలో డబ్బు లేదు. సంక్షేమ పథకాలు కొనసాగించలేని పరిస్థితి. నెల నెలా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. దాని కోసమే ఈ దోపిడి. సభకు వస్తుంటే జనసైనికులు దారి పొడుగునా ఆపి ప్రతి గుంత చూపించారు. రెండడుగుల లోతు గోతులు పడ్డాయి. అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాల కాలంలో రోడ్డు మీద ఒక్క గంప మట్టి వేయలేదు. రూ. 13,708 కోట్లు రోడ్ల కోసం బడ్జెట్ లో ప్రవేశ పెట్టారు. నిధులు ఎక్కడికి పోయాయో తెలియదు.

• సినిమా టిక్కెట్ల కోసమే శాసన సభ సమావేశాలు


శాసనసభను దేని కోసం ఉపయోగించుకుంటున్నారు. మీరు మాట్లాడే భాష సమాజానికి ఉపయోగపడుతుందా? సభలో ప్రజా ప్రతినిధులు ప్రజా సమస్యలపై చర్చించి సభ సజావుగా జరిగితే క్షేత్ర స్థాయిలో యంత్రాంగం కూడా సజావుగా పని చేస్తుంది. మీరు బూతులు తిట్టుకుంటుంటే వాళ్లుమాత్రం ఏం చేస్తారు. ఈ సమావేశాల్లో శ్రీ జగన్ రెడ్డి గారి ప్రభుత్వం అత్యధిక సమయం చర్చకు కేటాయించిన అంశం సినిమా టిక్కెట్లు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను అవమాన పరిచారు. వారిని రాష్ట్ర వ్యాప్తంగా నడిపించే స్థితికి తెచ్చారు. రైతులు, మహిళలు రాజధాని కోసం త్యాగాలు చేసి భూములు ఇచ్చారు. అమరావతికి 5 కిలోమీటర్ల దూరంలో ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉంటానని చెప్పిన ముఖ్యమంత్రి గారు, వారిని పిలిపించి పది నిమిషాలు మాట్లాడలేరా?

• డ్వాక్రా మహిళల నుంచి రూ.2వేల కోట్లు లాగేశారు

తడిచిన ధాన్యాన్ని ఎంతకు కొంటారో చెప్పమని అడుగుతున్నారు. ఇప్పటి వరకు నష్టపోయిన పంటపై సర్వేలు లేవు. గుంటూరు జిల్లా రైతాంగం కోసం జనసేన పార్టీ తరఫున పోరాటం చేస్తాం. ప్రతి గింజా కొనే వరకు అండగా ఉంటాం. విత్తు విత్తిన దగ్గర నుంచి మార్కెట్ కి చేరే వరకు రైతుకి తోడుంటామన్నారు. వేల కోట్లు ఖర్చు చేశారు. రైతులకు న్యాయం చేయలేకపోతున్నారు. రోడ్లు వేయకుండా దుర్మార్గంగా హింసిస్తున్నారు. జనసేన పార్టీని గెలిపించిన పాపానికి పెసర్లంక గ్రామానికి రక్షిత మంచినీటి పథకం కూడా నిలిపివేశారు. గ్రామ పంచాయితీల నిధులు దోచేశారు. 15వ ఆర్ధిక సంఘం నిధులు సర్పంచ్ లకు అందలేదు. గెలిచిన తర్వాత లైట్లు వేయాలంటే సొంత డబ్బులతో కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితి. డ్వాక్రా మహిళా సంఘాల నుంచి రూ.2 వేల కోట్లు లాగేసుకున్నారు. గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాలకు కూడా నీరివ్వడం లేదు. చెరుకుపల్లి ప్రజలకు రక్షిత మంచినీటి పథకాలు లేవు. కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన నిధులు తెచ్చుకోలేకపోతున్నారు. ఏ మాత్రం పాలన చేయలేని, ఆలోచన లేని ముఖ్యమంత్రి. సమాజం కోసం స్పందించలేని వ్యక్తి. మీకు ఆ పదవి దేనికి. ఇంటి నుంచి బయటకు వచ్చే ఆలోచన లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ అని అందుకే అన్నాం. సొంత జిల్లాలో వరదలు వచ్చి 72 మంది చనిపోతే 16 రోజులకుగాని వెళ్లి పరామర్శించే తీరిక దొరకలేదు.

• వైసీపీది ఆధునిక జమిందారీ పాలన

ప్రభుత్వ ఉద్యోగులను పీఆర్సీ ఇవ్వకుండా రోడ్డు మీదకు తెచ్చారు. పోలీసులకు టీఏలు, డీఏలు ఇవ్వలేని పరిస్థితి. ఉద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బ తీస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామన్నారు. ఇప్పుడు ఏమైపోయారు. మన ఎమ్మెల్యేతో కలిపి 152 మందిని పెట్టుకుని ఏం పరిపాలన అందిస్తున్నారు. ఇసుక దోపిడి, లిక్కర్ అమ్మకాలు, డబుల్ రిజిస్ట్రేషన్లు, కబ్జాలు, ఎస్సీలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు. ప్రస్తుం ఓ కొత్త తరహా రాజకీయ వ్యవస్థలో ఆధునిక జమిందార్ల తరహాలో పాలన సాగుతోంది. నాయకులు గీత గీసుకుని ఇది నా రాజ్యం అన్న చందంగా పని చేస్తున్నారు. ప్రజస్వామ్యం ఏమైపోయింది రాష్ట్రంలో చెరుకుపల్లి వేదిక మీద నుంచి చెబుతున్నా వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఖచ్చితంగా వైసీపీని తరిమికొడతారు. ఈ ప్రభుత్వ పాలన ఎక్కడ చూసినా అవినీతితో నిండిపోయింది. మీరు తప్పుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ పరిపాలన మారాల్సిందే.. జనసేన పార్టీ అధికారంలోకి రావాల్సిందే.. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాల్సిందే. నిజాయతీతో కూడిన రాజకీయం కోసం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మనందరినీ ముందుకు తీసుకువెళ్తున్నారు. పోస్టర్లు, సోషల్ మీడియాలో కాదు మనం పని చేయాల్సింది. శ్రీ పవన్ కళ్యాణ్ గారి కోసం పని చేద్దాం. జనసేన పార్టీ కోసం పని చేద్దాం. నాయకత్వం కోరుకుంటే రాదు. ప్రజల దగ్గర నుంచి
రావాలి. మార్పు కోసం ధైర్యంగా ముందుకు వెళ్దాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు పెద్దన్న పాత్ర పోషించండి. అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్ళాలి. రైతులకు భరోసా కల్పించేందుకు ఈ రోజు చెరుకుపల్లిలో సభ పెట్టాం. శ్రీ జగన్ రెడ్డి గారికి చెబుతున్నాం భరోసా అంటే ప్రకటనలు కాదు బాధ్యత. శ్రీ పవన్ కళ్యాణ్ గారు నివర్ తఫాను వచ్చినప్పుడు వర్షంలోనూ రైతుల కోసం నిలబడ్డారు” అన్నారు.

• నారా కోడూరులో ఘనస్వాగతం.. చెరుకుపల్లి వరకు భారీ ర్యాలీ

చెరుకుపల్లి జనసేన ప్రజా సభ కోసం తెనాలి నుంచి బయలుదేరిన శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి నారా కోడూరులో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ గాదె వెంకటేశ్వరరావుల ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. భారీ గజ మాలలు, పూల వర్షంతో ముంచెత్తారు. నారా కోడూరు ప్రధాన కూడలి జనసైనికులతో నిండిపోయింది. అక్కడి నుంచి వందలాది బైకులు, కార్లతో ర్యాలీగా చెరుకుపల్లి బయలుదేరారు. కట్టెంపూడి మీదుగా పొన్నూరు చేరుకున్నారు. పొన్నూరులో స్వాగతం పలికారు. పొన్నూరు నుంచి చేబ్రోలు, చందోలు మీదుగా ర్యాలీగా చెరుకుపల్లి చేరుకున్నారు. చెరుకుపల్లి సభలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు శ్రీ బోనబోయిన శ్రీనివాస్యా దవ్, శ్రీ పెదపూడి విజయ్ కుమార్, చేనేత వికాస విభాగం చైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్, కార్యక్రమాల విభాగం కన్వీనర్ శ్రీ కళ్యాణం శివశ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శులు శ్రీ నయూబ్క మాల్, శ్రీ వడ్రాణమ్ మార్కండేయబాబు, శ్రీ బేతపూడి విజయ శేఖర్, శ్రీ అమ్మిశెట్టి వాసు, పార్టీ నాయకులు శ్రీ మండలి దయాకర్, శ్రీమతి పార్వతీనాయుడు, శ్రీ మత్తి భాస్కరరావు, రాష్ట్ర, జిల్లా కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు.