ఎస్సీ కులాలపై వైసీపీది కపట ప్రేమ

•ఎస్సీల గురించి ఎప్పుడూ కన్వీనెంట్ గా మాట్లాడుతుంది
•చిత్రావతి ముంపు పరిహారం ఎస్సీ కులాలకే ఎందుకు ఎగ్గొట్టారు?
•ఎస్సీ యువత దీన్ని గమనించాలి
•జనవాణి – జనసేన కార్యక్రమంలో చిత్రావతి ముంపు బాధితులతో పవన్ కళ్యాణ్

యువతకు ఉపాధి లేదు.. పరిశ్రమలు రావు.. ఎమ్మెల్యేల దగ్గర మాత్రం వందల కోట్ల డబ్బుంటుంది.. భూములు లాక్కుంటారు.. రోడ్లు వెయ్యరు.. బ్రిడ్జిలు కట్టరని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. జనవాణి – జనసేన భరోసా కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లా, ధర్మవరం నియోజకవర్గానికి చెందిన ఎస్సీ యువత చిత్రావతి రిజర్వాయర్ ముంపు పరిహారం వ్యవహారంలో తమకు జరిగిన అన్యాయాన్ని పవన్ కళ్యాణ్ గారికి అర్జీ రూపంలో సమర్పించింది. మిగతా కులాలకు పరిహారం ఇచ్చి ఎస్సీలకు పరిహారం ఇవ్వలేదన్న విషయాన్ని వివరించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ.. వైసీపీ ఎస్సీ కులాల మీద చూపేదంతా కపట ప్రేమే. చిత్రావతి రిజర్వాయర్ ముంపు ప్రాంతంలోని గ్రామాల్లో అన్ని కులాల వారు ఉన్నారు. ముంపు ప్రాంతం అని వారిని ఖాళీ చేయించారు. ముందుగా ఎస్సీ కులస్థులను, తర్వాత మిగిలిన కులాలను బయటకు పంపారు. పరిహారం మాత్రం అన్ని కులాలకు ఇచ్చి ఎస్సీ కులాలకు ఇవ్వలేదు. ఎస్సీల గురించి మాట్లాడేప్పుడు వైసీపీ ప్రభుత్వం చాలా కన్వినెంట్ గా మాట్లాడుతుంది. ఎస్సీ యువత దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మీరు ఒక్కసారి మీ నాయకుల్ని పరిశీలించండి. మన కులానికి మంచి చేస్తున్నారా? లేదా? పరిశీలించి మీ భవిష్యత్తు పై మీరు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. జనసేన పార్టీ మాత్రం మీకు ఎప్పటికీ అండగా ఉంటుందని అన్నారు.
• చిలకం మధుసూదన్ రెడ్డికి అభినందనలు
రాయలసీమ ప్రాంతంలో, ముఖ్యంగా ధర్మవరం ప్రాంతంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా బలంగా పోరాటం చేస్తున్న పార్టీ ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డిని ఈ సందర్భంగా అభినందించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల వైపు ఆయన బలంగా నిలబడుతున్నారని కితాబిచ్చారు.
•మహిళా ఆటో డ్రైవర్ల స్టాండ్ కు స్థలం కేటాయించాలి
వైసీపీ నాయకుడు మహిళల్ని ప్రత్యేకంగా గౌరవిస్తానని పదే పదే చెబుతున్నారు.. ఆ మాటల్ని స్వీకరించి తిరుపతి కార్పోరేషన్ అధికారులు సాయినగర్ ప్రాంతంలో 14 మంది మహిళా ఆటో డ్రైవర్లకు స్టాండ్ ఏర్పాటు చేసుకునేందుకు ప్రత్యేక స్థలం కేటాయించాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కోరారు. జనవాణి – జనసేన భరోసా కార్యక్రమంలో అమరావతి అనే మహిళా ఆటో డ్రైవర్ ప్రత్యేక స్టాండ్ లేక తాము పడుతున్న ఇబ్బందులను జనసేన అధినేత ముందుంచారు. పురుష ఆటో డ్రైవర్ల నుంచి ఎదురౌతున్న అవమానాలను వివరించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ.. మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు ఉండాలని కోరుకునే వాడిని. శ్రీమతి అమరావతితో పాటు సాయి నగర్ ప్రాంతంలో ఉన్న 14 మంది మహిళా ఆటో డ్రైవర్లు స్వశక్తి మీద బతికే ప్రయత్నంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారు ఆటోలు నిలుపుకోవడానికి స్టాండు పెట్టుకుందామంటే రూ. లక్ష అడుగుతున్నారు. ఆటో యూనియన్ పెద్దలకు ఈ వేదిక నుంచి నా విన్నపం.. ఆ 14 మందికి ఆటో పార్క్ చేసుకునే అవకాశం కల్పించండి అని అన్నారు.
•చెరకు బకాయిల కోసం మంత్రి శ్రీమతి రోజాకి విన్నవించినా ఫలితం లేదు
2019-2020 సీజన్ లో నగిరి నియోజకవర్గం, నిండ్ర మండలంలోని నేత్ర షుగర్ ఫ్యాక్టరీకి రూ. 37 కోట్ల విలువ చేసే చెరుకు తోలాం. 8 మండలాల పరిధిలో 3 వేల మంది రైతులు, 50 వేల ఎకరాల్లో పండించిన చెరుకు ఫ్యాక్టరీకి సరఫరా చేశాం. మూడేళ్లుగా బకాయిలు చెల్లించకుండా తిప్పుకుంటున్నారు. సమస్యను మంత్రి శ్రీమతి రోజా దృష్టికి తీసుకువెళ్లాం. కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాం. మా బకాయిలు ఇప్పించే నాధుడు కనబడడం లేదు. ఫ్యాక్టరీ వేలం వేశారు. ఆ మొత్తం రైతులకు చెల్లిస్తామన్నారు. యాజమాన్యం స్టే తెచ్చుకుందని మళ్లీ నిలిపివేశారు. మీ దగ్గరకు వస్తే న్యాయం జరుగుతుందని వచ్చాం. మా సమస్యపై మాట్లాండి సర్.. జనవాణి – జనసేన భరోసా కార్యక్రమంలో నగరి నియోజకవర్గం పరిధిలోని నేత్ర షుగర్ ఫ్యాక్టరీ బాధిత రైతులు నేతాజీ చెరుకు రైతు సంఘం ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కలసి తమ సమస్యలపై అర్జీ సమర్పించారు. జిల్లాలో ఆరు షుగర్ ఫ్యాక్టరీలు మూత పడడంతో పక్క రాష్ట్రాలతో పోలిస్తే టన్నుకు రూ. వెయ్యి నష్టపోతున్నామన్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. చెరుకు రైతులకు రావాల్సిన బకాయిల సమస్యపై జనసేన పార్టీ తరఫున మాట్లాడుతానని జనసేనాని హామీ ఇచ్చారు.
•సుబేదార్ చెరువును వైసీపీ మంత్రి కబ్జా చేసేశారు
అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గం పరిధిలోని 92 ఎకరాల సుబేదార్ చెరువును మంత్రి శ్రీమతి ఉషశ్రీ చరణ్ కబ్జా చేసేశారని, చెరువు మొత్తం పూడ్చేసి రియల్ ఎస్టేట్ వెంచర్ గా మార్చి అమ్మేసుకునే ప్రయత్నం చేస్తున్నారన్న విషయాన్ని ఆ నియోజకవర్గానికి చెందిన కొంత మంది శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువచ్చారు.
నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం తీర ప్రాంతంలోని మత్స్యకారులు తాము జనసేన పార్టీ మద్దతుదారులుగా ఉండడం వల్ల ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ గారికి విన్నవించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *