హెల్త్ యూనివర్సిటీ నిధులు తీసేసుకోవాలని ప్రభుత్వానికి ఎందుకంత ఆత్రం?: పవన్ కళ్యాణ్

హెల్త్ యూనివర్సిటీ నిధుల మళ్లింపు విషయం పై జనసేనాని స్పందించారు. విశ్వ విద్యాలయాలు మెరుగైన రీతిలో నడిచి ఉన్నత ప్రమాణాలతో అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వం ఆ విద్యాలయాల నిధులను మళ్లించుకోవడం దురదృష్టకరం. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తలమానికమైన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నిధులు ప్రభుత్వ అవసరాలకు తీసుకోవడానికి విశ్వ విద్యాలయం పాలక మండలిపై ఒత్తిళ్ళు తీసుకురావడం ఇకనైనా మానుకోవాలి. వైద్య విద్య ప్రమాణాలు మెరుగుపరచేందుకు మరిన్ని నిధులు సమకూర్చాల్సిన పాలకులు ఆ విద్యాలయం దగ్గర ఉన్న వాటినే గుంజుకోవాలనుకోవడాన్ని విద్యావేత్తలు, వైద్య నిపుణులు ముక్తకంఠంతో ఖండించాలి. హెల్త్ యూనివర్సిటీ దగ్గర మిగులు నిధులుగా ఉన్న రూ.450 కోట్లలో రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగంగా తెలంగాణా వాటా రూ.170 కోట్లు వెళ్లిపోతాయని, ఉన్నవాటిలో నుంచి ఏపీ ప్రభుత్వం రూ.250 కోట్లు తీసేసుకొంటే మిగిలేది రూ.30 కోట్లు మాత్రమే. ఈ రూ.30 కోట్లతో ఏం సాధిస్తారు. ఈ నిధులు మళ్లించాలని కీలక బాధ్యతల్లో ఉన్నవారే ప్రయత్నించడంతోనే అత్యవసరంగా పాలకమండలి సమావేశం అయినట్లు నా దృష్టికి వచ్చింది. ఈ రూ.250 కోట్ల కోసం ప్రభుత్వం ఎందుకింత ఆత్రపడుతోంది? ఈ సొమ్ములను ఏ ప్రయోజనం కోసం ఖర్చు చేస్తారో ప్రజలకు వివరణ ఇవ్వాలి. ఈ సొమ్ములను ఎస్.ఎఫ్.ఎస్.సి.లో డిపాజిట్ చేసినా తిరిగి ప్రభుత్వం చెల్లించగలదా అనే సందేహాలు హెల్త్ యూనివర్సిటీ వర్గాల్లో నెలకొన్నాయి. ప్రభుత్వ ఆర్థిక స్థితి వల్లే అందరికీ అనుమానాలు కలుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఈ సందేహాలను నివృతి చేయాలి.

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీతోపాటు రాష్ట్రంలోని విశ్వ విద్యాలయాలకు ఉన్న నిధులు, వాటి నిర్వహణపై జనసేన పార్టీ పరిశీలన చేస్తుంది. ఈ అంశంపై దృష్టి సారించి యూనివర్సిటీల నిధులను ప్రభుత్వం ఏ మేరకు మళ్లించుకొంది? తిరిగి చెల్లించిందా లేదా? మళ్లింపులో నిబంధనలు అనుసరించారా లేదా? లాంటి అన్ని విషయాలనూ సమగ్రంగా పరిశీలించాలని పార్టీ నాయకులకు ఇప్పటికే సూచనలు ఇచ్చాం.