ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని వైసీపీ దుర్వినియోగం చేస్తోంది

*ప్రత్యర్ధులను వేధించడానికి చట్టాన్ని ఉపయోగిస్తోంది
*కుల దూషణ చేశారని పూతలపట్టులో 14 మంది యువకులపై అక్రమ కేసులు బనాయించారు
*వాళ్లను బేషరుతుగా విడుదల చేయాలి
*లేనిపక్షంలో తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం ముందు బైఠాయిస్తా
*తిరుపతి జనవాణి కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్

గడప గడపకు కార్యక్రమంలో సంక్షేమ పథకాలపై ప్రశ్నించిన యువకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం ఏమిటని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పూతలపట్టు నియోజకవర్గంలో అక్రమ కేసులు బనాయించి 14 మంది యువకులను 20 రోజులుగా జైల్లో పెట్టి హింసిస్తున్నారని, వారిని బేషరుతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పెద్దలు, పోలీసు ఉన్నాతాధికారులు దీనిపై స్పందించకపోతే తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం ముందు బైఠాయిస్తానని హెచ్చరించారు. ఆదివారం తిరుపతి వేదికగా నాలుగో విడత జనవాణి – జనసేన భరోసా కార్యక్రమం ప్రారంభమైంది. కార్యక్రమంలో పూతలపట్టు నియోజకవర్గం వేపనపల్లి నుంచి వచ్చిన బాధిత యువకుల తల్లిదండ్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కన్నీటితో తమ బాధను విన్నవించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… “ ఎస్సీ, ఎస్టీలను పరిరక్షించడానికి ఉపయోగించాల్సిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని … ప్రత్యర్ధులను వేధించడానికి వైసీపీ ప్రభుత్వం ఉపయోగిస్తోంది. చట్టాన్ని ఎవరు దుర్వినియోగం చేసినా అందరం ముక్తకంఠంతో ఖండించాలి. రాష్ట్ర డీజీపీ గారికి, చిత్తూరు ఎస్పీ గారికి జనసేన తరఫున ఒక్కటే విన్నవించుకుంటున్నాం. తక్షణమే 14 మంది యువకులను బేషరుతుగా విడుదల చేయాలి.
*అన్యాయం జరిగిందని నిలదీస్తే కేసులు పెడతారా?
ప్రజాప్రతినిధులను కులం పేరుతో దూషిస్తే కేసులు పెట్టాలి. కానీ మాకు అన్యాయం జరిగింది, సహాయం అందలేదు అని నిలదీస్తే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎలా పెడతారు? కోనసీమ జిల్లా గోపాలపురంలో కూడా అంబేద్కర్ గారి విగ్రహానికి అవమానం జరుగుతోందని పోలీసు స్టేషన్ కు వెళ్లిన తొమ్మిది మంది ఎస్సీ యువకులపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. ప్రభుత్వాన్ని నిలదీసిన అమరావతి ఎస్సీ రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. ఇలా తమ అసంతృప్తిని తెలియజేసిన వారిని వేధించడానికి వైసీపీ వాళ్లు అట్రాసిటీ యాక్టును ఉపయోగిస్తున్నారు. వైసీపీ నాయకులు ఇలానే ముందుకు వెళ్తే … మాకు సన్నిహితంగా ఉండే ఎస్సీ సన్నిహితులతో కలిసి దీనిపై చర్చించి, వారి సహాయ సహకారాలతో తాడేపల్లిని ముట్టడిస్తాను. మా పార్టీ కార్యాలయానికి తాడేపల్లి ఎంతో దూరంలో లేదని గుర్తుంచుకోవాలి.
*వైసీపీ గెలవదు…. పోలీసులు గుర్తుపెట్టుకోవాలి
పోలీస్ డిపార్టుమెంట్ అంటే నాకు చాలా గౌరవం. వైసీపీ ప్రోద్బలంతో అమాయకులపై అక్రమ కేసులు బనాయించిన పోలీసు అధికారులకు ఒకటే చెబుతున్నాను. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గెలవదు. వైసీపీ అధికారంలోకి రాకుండా మేము చూసుకుంటాం. వైసీపీ అధికారంలో ఉందని వారికి కొమ్ముకాయడం మానేయండి. ఇలా కొమ్ము కాసే అధికారులపై ప్రత్యేక దృష్టి పెడతాం. వైసీపీ నాయకుల దౌర్జన్యాలు చూసి విసిగిపోయాం. ఆత్మకూరు నియోజకవర్గం కొత్తపేట మండలంలో పంచాయతీ నిధులపై ప్రశ్నించిన పాపానికి ఒక రైతు తాలుకూ 95 మామిడి చెట్లు నరికేశారు. రెండు బోరు బావులను ధ్వంసం చేశారు. ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధిని ప్రశ్నించిన పాపానికి 14 మంది యువకులపై కేసులు పెట్టి 20 రోజులుగా జైల్లో ఉంచారు. అందులో దివ్యాంగులు కూడా ఉన్నారు. దివ్యాంగుల కోసం కేంద్రం ప్రత్యేక చట్టాన్ని రూపొందించినా వాటిని తుంగలో తొక్కారు. అరెస్టు చేసిన 14 మంది యువకులను తక్షణమే బయటకు తీసుకొచ్చేలా మా లీగల్ టీమ్ తో మాట్లాడతాను. అప్పటికీ వాళ్లు బయటకు రాకపోతే నేనే వస్తానని” అన్నారు.
*పరిహారం కోసం పోరాడుతుంటే అండమాన్ పంపుతామంటున్నారు
2008లో శ్రీ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు భూములు ఇచ్చారు. 11 నెలలకే ఇచ్చిన భూములు తిరిగి లాక్కున్నారు. మా దగ్గర లాక్కుని 294 ఎకరాలు కజారియా సిరామిక్ ఫ్యాక్టరీకి కట్టబెట్టారు. 13 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం. ఇప్పటి వరకు మాకు ఎలాంటి పరిహారం అందలేదు. ప్రభుత్వాలు మారాయి. నాయకులు మారారు. మాకు మాత్రం ఎలాంటి న్యాయం జరగలేదు. చిత్తూరు జిల్లా, శ్రీకాళహస్తి నియోజకవర్గం, తాటిపర్తి గ్రామం నుంచి వచ్చిన సిరామిక్ ఫ్యాక్టరీ నిర్వాసితుల గోడు ఇది. తిరుపతి జనవాణి – జనసేన భరోసా కార్యక్రమంలో వీరంతా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి అర్జీ సమర్పించారు. పరిహారం అందలేదని భూమి పూజ సమయంలో నిరసన తెలిపేందుకు వెళ్తే గన్నులు గురిపెట్టారని, పోలీసులతో కొట్టించి కేసులు పెట్టారని బాధితులు వాపోయారు. న్యాయం కోసం పోరాటం చేస్తుంటే అండమాన్ జైలుకు పంపుతామని బెదిరిస్తున్నారని తెలిపారు. పాదయాత్రలో ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి, ఎన్నికల ముందు ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీ బియ్యపు మధుసూదన్ రెడ్డిలు గెలవగానే మా సమస్య పరిష్కరిస్తామన్నారు. మూడేళ్లు గడచినా మా వైపు తొంగి చూసింది లేదని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు. తమకు ఎలాంటి ఆధారం లేదని తమ సమస్యపై పోరాటం చేయాలని వేడుకున్నారు. తాటిపర్తి కజారియా ఫ్యాక్టరీ నిర్వాసితుల సమస్యలపై గళం విప్పుతానని తప్పకుండా పార్టీ తరఫున పోరాటం చేస్తానని శ్రీ పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *