మీరంతా మా కుటుంబం… మీకు అండగా ఉండటం మా బాధ్యత

* నా గురించి నేను ఎప్పుడూ ఆలోచించుకోలేదు.
* నాకు హెల్త్ ఇన్స్యూరెన్స్ కూడా లేదు
* ప్రమాదవశాత్తు మరణించిన క్రియాశీలక సభ్యుల కుటుంబాలతో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమావేశం

‘మీరంతా మా కుటుంబం… మీకు అండగా నిలబడటం మా బాధ్యత… కుటుంబంలో ఒక వ్యక్తి మరణిస్తే అది తీరని లోటు… దానిని ఎవరూ తీర్చలేం కానీ మీకు ఏ కష్టం వచ్చినా మేమున్నామని ఆదుకునేందుకు అతి పెద్ద జనసేన కుటుంబం అండగా ఉంటుంది. చనిపోయిన మీ కుటుంబ సభ్యులు ఏ ఆశయం కోసం చివరి వరకు జనసేన పార్టీ కోసం అండగా నిలిచారో… వారి ఆశయాన్ని గౌరవించి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉంద’ని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రమాదవశాత్తు మరణించిన 48 క్రియాశీలక సభ్యుల కుటుంబాలతో పవన్ కళ్యాణ్ శనివారం సాయంత్రం సమావేశమయ్యారు. ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన ముగ్గురు జనసైనికుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున బీమా చెక్కులు అందించారు. తొలుత ప్రమాదవశాత్తు చనిపోయిన క్రియాశీలక సభ్యుల చిత్రపటానికి జ్యోతిప్రజ్వలన చేసి, పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… “ఖజానాలో లక్షల కోట్లున్న రాష్ట్ర ప్రభుత్వం చేయలేని పని- ఏ అధికారం లేకపోయినా జనసేన పార్టీ సమర్ధవంతంగా చేస్తోంది. పార్టీ క్రియాశీలక సభ్యులను సొంత కుటుంబ సభ్యులుగా భావించి ఆపత్కాలంలో ఆర్థికంగా ఆ కుటుంబాలకు అండగా నిలుస్తోంది. పోయిన ప్రాణాలను తీసుకురాలేము కానీ… వారి కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకోవడం ద్వారా భరోసా ఇవ్వడం మన కనీస బాధ్యత. పోరాట యాత్ర సమయంలో ఫ్లెక్సీలు కడుతూ ఇద్దరు అభిమానులు కరెంటు షాకుతో మృత్యువాతపడ్డారు. దిగువ మధ్యతరగతికి చెందిన ఆ కుటుంబాలను ఆదుకోవాలని ఆనాడే సొంత నిధుల నుంచి చెరో రూ. 5 లక్షల చొప్పున ఇచ్చాం. అయితే సంఖ్యా బలం పెరుగుతున్న కొద్ది వ్యక్తిగత సాయం చేసే ప్రక్రియ కష్టమవుతుంది. అయినా ప్రతి ఒక్కరికీ సాయం అందాలనే ఆలోచన మాత్రం నా మనసులో ఉంది. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడే కార్యకర్తలకు ప్రమాద బీమా చేపడదామని చాలా మంది మేధావులతో మాట్లాడాను. చివరకు రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ఇన్సురెన్స్ ఆలోచన తీసుకొచ్చారు. మనోహర్ ఆలోచనను కోశాధికారి శ్రీ రత్నం, మిగిలిన జనసేన నాయకులు ఇన్సురెన్స్ కంపెనీలతో మాట్లాడి నిర్దుష్ట విధానాన్ని తీసుకొచ్చారు. ప్రమాదవశాత్తు ఏ క్రియాశీలక సభ్యుడు చనిపోయినా, గాయపడినా తక్కువ సమయంలో ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకున్నారు.
* జన సైనికులు తమ స్థాయిలో చక్కగా సేవ చేస్తున్నారు
నాకు ఇంతవరకు హెల్త్ ఇన్సురెన్స్ గానీ, ప్రమాద బీమా గానీ ఏవీ లేవు. నేను ఎప్పుడూ నా గురించి ఆలోచించుకోలేదు. నేను సగటు సామాన్యుడి క్షేమం గురించి ఎక్కువగా ఆలోచిస్తాను. నేను కోటి మందికి ఆర్థికపరమైన అండ ఇవ్వలేకపోవచ్చుగానీ

వారిలో ఒక స్ఫూర్తి రగిలించగలను. నా పరిధిలో నేను చేస్తున్న సేవా కార్యక్రమాలు స్ఫూర్తితో జన సైనికులు తమ తమ స్థాయిలో ఆపదలో ఉన్నవారికీ, అభాగ్యులకు అండగా ఉంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో దివ్యాంగులైన జంటకు జన సైనికులు సాయపడ్డ తీరు కదిలించింది. ఆ దంపతులకు ఏం సాయం చేయాలి అడిగితే జీవనోపాధిగా చిన్న టిఫిన్ సెంటర్ పెట్టుకుంటాం అన్నారు.
క్రియాశీలక సభ్యులు 50 వేల మంది ఉంటే చాలు అనుకున్నాను కానీ పార్టీ బలపడుతున్న కొద్దీ సంఖ్య నేటికి 6.76 లక్షల మందికి చేరింది. మనకోసం ఆలోచించే సభ్యులకు మానవతా 

దృక్పథంతో అండగా నిలబడటం మన బాధ్యత. అందుకే ప్రమాద బీమా చెక్ స్వయంగా శ్రీ మనోహర్ ఎంత దూరమైనా వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మీకు మేము అండగా ఉంటామని భరోసా ఇచ్చి వస్తున్నారు. ఈ విధానం వల్ల బంధం మరింత బలపడుతుంది. చనిపోయిన వ్యక్తుల ఆశయం ఒక్కటే. సమాజం మారాలి… పరివర్తన రావాలని జనసేన పార్టీలోకి వచ్చారు. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం మనందరి బాధ్యత” అన్నారు.
* ప్రమాద బీమా మానవత్వపు ఆలోచన : నాదెండ్ల మనోహర్
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ… “పార్టీ క్రియాశీల సభ్యులకు ప్రమాద బీమా చేయించే ఆలోచన ఉన్నతమైనది. మానవత్వంతో నిండిన గొప్ప విషయం. మొదటిసారి 90 వేల మంది క్రియాశీలక సభ్యులుగా చేరితే, ఈ ఏడాది ఆ సంఖ్య 6.76 లక్షలకు చేరింది. ఇంట్లో ఒకరిని కోల్పోయి పూర్తి దుఃఖంలో ఉన్న జనసేన కుటుంబాలకు క్రియాశీలక సభ్యత్వ బీమా సొమ్ము సాంత్వన చేకూరుస్తోంది. దేశంలోనే ఏ రాజకీయ పార్టీ చేయని అతి గొప్ప పనిని జనసేన పార్టీ బాధ్యతగా చేస్తోంది. శ్రీ పవన్ కళ్యాణ్ కష్టించిన సొమ్మును తనను నమ్ముకున్న కార్యకర్తల ప్రమాద బీమాకు వెచ్చించడం అందరికీ గర్వకారణం” అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్, పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్, పితాని బాలకృష్ణ, పార్టీ నాయకులు మేడా గురుదత్తప్రసాద్, బండారు శ్రీనివాస్, తుమ్మల బాబు, మాకినీడు శేషుకుమారి, పోలిశెట్టి చంద్ర శేఖర్,శ్రీ సంగిశెట్టి అశోక్, వరుపుల తమ్మయ్యబాబు, శ్రీపాటంశెట్టి సూర్యచంద్ర, వై.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
* మూడు కుటుంబాలకు బీమా చెక్కులు ప్రదానం

ఇటీవల వేర్వేరు ప్రమాదాల్లో మృతి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు రూ.5 లక్షల చెక్కులను పవన్ కళ్యాణ్ అందచేశారు. రాజోలు నియోజకవర్గం మోరిపోడు గ్రామానికి చెందిన చోడిశెట్టి సుబ్బరాజు, మలికిపురం గ్రామానికి చెందిన కల్వకొలను నాగరాజు, రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి చెందిన అంబటి వెంకటరమణ కుటుంబాలు ఈ చెక్కులు అందుకున్నాయి.