జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు యువ తెలంగాణ దూరం

జీహెచ్‌ఎంసీ కార్పొరేషన్‌ ఎన్నికల్లో యువ తెలంగాణ పార్టీ పోటీ చేయడం లేదని ఆపార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాణిరుద్రమ తెలిపారు. బుధవారం మీడియాతో ఆమె మాట్లాడుతూ ఆంధ్ర వలస పాలకులు హైదరాబాద్‌ నగర అస్థిత్వాన్ని-సంస్కృతిని ఆగం చేస్తున్నారని ఆందోళన చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి ఆరేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో పరిస్థితి ఎందుకు మారలేదని ప్రశ్నించారు. బస్తీ దవాఖానాలు ఎన్ని ప్రారంభించారు..? వాటిలో డాక్టర్‌లు, నర్సులు, సిబ్బంది ఉన్నారా…? ప్రజలకు వైద్యం అందుతుందా చర్చకు సిద్ధమా…? అని రాణి రుద్రమ సవాల్‌ విసిరారు.

వరదల్లో చిక్కుకున్న కుటుంబాలను పరామర్శించేందుకు పడవలో వచ్చిన ఎమ్మెల్యేను సహాయం అడిగితే అనుమతి లేకుండా ఎందుకు కట్టుకున్నారని ప్రజలను బెదిరింపులకు గురి చేసిన సంఘటనలు టీఆర్‌ఎస్‌ పనితీరుకు అద్దం పడుతుందన్నారు. యువ తెలంగాణ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ఎన్నికల్లో ప్రజల తరఫున నిలిచిన రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తుందన్నారు. ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలో పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి రాష్ట్ర కమిటీతో చర్చించి ప్రకటిస్తారని తెలిపారు.