కాన్పూర్‌ వైమానిక దళంలో Zika virus కలకలం.. పెరుగుతున్న కేసులు

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ జిల్లాలో జికా వైరస్‌ కలవరం సృష్టిస్తోంది. కాన్పూర్‌ నగరంలోని వైమానిక దళానికి చెందిన స్టేషనులో పనిచేస్తున్న వాయుసేన సిబ్బంది 10 మందికి జికా వైరస్‌ పాజిటివ్‌ అని తాజాగా జరిపిన పరీక్షల్లో తేలింది. దీంతో వాయుసేన కేంద్రంలో హైఅలర్ట్‌ ప్రకటించారు. మరోవైపు నగరంలో కూడా 89 కేసులు వెలుగుచూడటంతో వైద్యశాఖ అప్రమత్తమైంది. ఈ 89 మందిలో 55 మంది పురుషులు, 34 మంది మహిళలు ఉన్నారని అధికారులు తెలిపారు. మరో 23 మంది 21 ఏళ్ల వయసు లోపు యువకులు ఉన్నట్లు తెలిపారు.

వైరస్‌ నివారణకు చర్యలు చేపట్టామని కాన్పూర్‌ జిల్లా మెజిస్ట్రేట్‌ విషాక్‌ జి అయ్యర్‌ చెప్పారు. జిల్లా వ్యాప్తంగా మూడు రోజుల పాటు 525 మంది రక్తనమూనాలను సేకరించి పరీక్ష కోసం లక్నోలోని కింగ్‌ జార్జ్‌ మెడికల్‌ యూనివర్శిటీ, పూణెలోని వైరాలజీ ల్యాబ్‌లకు తరలించామని జిల్లా మెజిస్ట్రేట్‌ చెప్పారు. వీరిలో మరో 23 మందికి జికా వైరస్‌ పాజిటివ్‌ అని పరీక్షల్లో తేలింది. దీంతోపాటు ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషనుకు 3 కిలోమీటర్ల దూరంలో నివశిస్తున్న వారికి జికా వైరస్‌ సోకిందని వెల్లడైంది. జికా వైరస్‌ మొదటి కేసు అక్టోబరు 23వతేదీన కాన్పూర్‌ వాయుసేన కేంద్రంలో వెలుగుచూసిందని అధికారులు తెలిపారు. కాగా, దోమల వల్ల వ్యాప్తి చెందుతున్న ఈ జికా వైరస్‌ ను నివారించేందుకు వీలుగా దోమలను అరికట్టేందుకు పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చి యాంటీ లార్వా స్ప్రేయింగ్‌ చేస్తున్నామని అధికారులు చెప్పారు. అలాగే ఇంటింటి సర్వే చేపట్టామని జిల్లా అధికారులు వివరించారు.