జగ్గుభాయ్ అంటే భయం వదిలేయండి

• వ్యవస్థల్లో తప్పు జరిగితే కచ్చితంగా అడగాల్సిందే
• యువశక్తిని నిర్వీర్యం చేస్తున్న జగన్
• జనసేన ప్రభుత్వంలో యువతను స్వయంశక్తి సాధకులుగా తయారుచేస్తాం
• అవినీతి జలగల మీదనే నా పోరాటం
• తణుకు నియోజకవర్గ పార్టీ శ్రేణుల సమావేశంలో శ్రీ పవన్ కళ్యాణ్

ఏ యువకుడిలో ఏ ప్రతిభ ఉందో.. ఏ నైపుణ్యం దాగి ఉందో మనకు తెలియదు. మన ఇంటి పక్కనే ఉండే యువకుడిలో ఓ ఎలాన్ మస్క్ దాగి ఉండొచ్చు. రోజూ మనకు కనిపించే యువకుడి ఆలోచనల్లో ఓ అద్భుతమైన స్టార్టప్ ఆలోచన దాగి ఉండొచ్చు. అలాంటి వారిని వెలికి తీయాలి. యువశక్తిని వెలిగించాలి. నేనే కనుక వాలంటీర్లు వ్యవస్థను నడిపించి ఉంటే కచ్చితంగా ప్రతి గ్రామంలోనూ, ప్రతి వీధిలోను ఉన్న యువతలో ఎలాంటి శక్తి ఉంది..? వారి ప్రతిభా పాటవాలు, శక్తిసామర్థ్యాలు ఎంత..? ఏ రంగం అంటే వారికి ఇష్టం..? సమాజానికి ఉపయోగపడే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలు పరిశీలిస్తామ’ని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. గురువారం రాత్రి తణుకులోని భోగవల్లి బాపయ్య అన్నపూర్ణ కళ్యాణ మండపంలో తణుకు నియోజకవర్గ నాయకులు, జనసైనికులు, వీర మహిళలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… “యువతలో దాగున్న శక్తిని వెలికి తీస్తే అవి దేశానికి ఉపయోగపడతాయి. జగ్గు భాయ్ కులాలను విభజించి పాలిస్తున్నాడు కదా..! అలా యువతలోని ప్రతిభ, వారి నైపుణ్యం ఆధారంగా విభజిస్తే వారికి మెండుగా ఉపాధి అవకాశాలు, మానవ వనరుల లభ్యతకు ఆంధ్రప్రదేశ్ హబ్ గా మారుతుంది. యువత సామర్థ్యాన్ని జగ్గు భాయ్ చంపేస్తున్నాడు. వారికి కేవలం రోజువారీ రూ.164.33 పైసలు కూలీ ఇచ్చి, వారిని బావిలో కప్పలుగా మార్చేస్తున్నాడు. తన సొంత అవసరాలకు సంబంధించి పనులకు వినియోగించుకుంటున్నాడు. జనసేన ప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గంలో నుంచి 500 మంది యువతీ యువకులను ప్రతి ఏటా అద్భుతమైన స్వయం శక్తి సాధకులుగా తయారు చేస్తాం. వారికి మూలధనంగా రూ. 10 లక్షలు మళ్లీ కట్టాల్సిన అవసరం లేని డబ్బును అందజేస్తాం. వారు పదిమందికి ఉపాధి చూపేలా మార్గం చూపుతాం. అంతేగాని యువతను వాలంటీర్లుగా చేసి, వారిలో ఉన్న శక్తి సామర్ధ్యాలను తగ్గించాలని మాత్రం చూడను.
* మార్పు కోసమే జనసేన పార్టీ స్థాపించాను
జనసేన పార్టీ వాలంటీర్లకు వ్యతిరేకం కాదు. కొంతమంది వాలంటీర్లు చేస్తున్న పనులు ఆమోదయోగ్యంగా లేవు. అర్హులకు సంక్షేమ పథకాలు ఇవ్వడానికి లంచాలు తీసుకుంటున్నారు. అభం శుభం తెలియని పసిబిడ్డలపై అత్యాచారాలు చేస్తున్నారు. వాలంటీర్లు ప్రభుత్వ అధికారులు కానప్పుడు వ్యక్తిగత సమాచారం వాళ్లకు ఎందుకు ఇవ్వాలి? ఆ సమాచారం ఎక్కడికి వెళ్తుంది? గతంలో వాలంటీర్ల వ్యవస్థ లేనప్పుడు రాష్ట్రం నడవలేదా? ప్రజలకు పెన్షన్లు, రేషన్ కార్డులు రాలేదా? వాలంటీర్ వ్యవస్థను ప్రారంభించింది ప్రజల సేవ చేయాడానికే అని చెప్పినా… అంతిమంగా లక్ష్యం మాత్రం వైసీపీ పార్టీ కోసం పనిచేయడం మాత్రమే. జనసేన పార్టీ స్థాపించింది రాష్ట్రంలో స్పష్టమైన రాజకీయ మార్పు కోసమే. సామాన్యుడికి కూడా రాజకీయాలు అందుబాటులోకి తీసుకురావాలనే పార్టీ పెట్టాను.
* కమిట్మెంట్ ఉన్నోడిని కనుకే ప్రధాని పిలుస్తారు
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రితో సమానంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని కలవడానికి ఎందుకు పిలుస్తారు? ప్రజలకు ఏదో చేయాలనే తపన, కమిట్మెంట్, నిబద్ధత చూసే ఆయన స్వయంగా కలవడానికి పిలుపించుకుంటారు. మోదీ గారిని కలిసినప్పుడు ఏం మాట్లాడారని వైసీపీ నాయకులు అడుగుతుంటారు. ఆయనతో ఏం మాట్లాడానో మీకెందుకు చెబుతాం. అయితే ఒకటి మాత్రం చెబుతాం జగన్ మీద ఫిర్యాదు అయితే చేయను.
* జగన్ రౌడీ పిల్లాడు
జగన్ మా ఏరియాలో తిరిగే చిన్న రౌడీ పిల్లాడు. జగ్గుభాయ్, అతని గ్యాంగ్ ను ఎలా హ్యాండిల్ చేయాలో జనసేనకు బాగా తెలుసు. ప్రకృతి వనరులైన నేల, నీరు, గనులు.. ఇలా ఏదీ ఎవడి సొత్తు కాదు. ముఖ్యంగా జగన్ సొత్తు అసలే కాదు. వాళ్ల నాన్న గారు ఆయనకు వారసత్వంగా ఇవ్వలేదు. కష్టపడి సంపాదించుకునే హక్కు, నచ్చినట్టు బతికే హక్కు అందరికీ ఉన్నాయి. అవినీతి అనేది మన జీవితంలో ఒక భాగమైపోయింది. ప్రతి చిన్న పనికి ఎంతో కొంత చేయి తడపాల్సి వస్తుంది. రాష్ట్రంలో ప్రభుత్వ అధికారుల అవినీతి రాజకీయ నాయకులు చేసిన అవినీతితో పోల్చితే దిగదుడుపే. ఒక్క తణుకు టీడీఆర్ కుంభకోణమే రూ. 309 కోట్లు. రూ. 300 తీసుకున్న ప్రభుత్వ ఉద్యోగిది అవినీతి అయితే… రూ. 300 కోట్లు దోచేసి దర్జాగా తిరుగుతున్న రాజకీయ నాయకులను ఏమంటారు? వైసీపీ నాయకులు వందల కోట్లు దోచేశారని కాగ్ కూడా చెప్పింది. అడ్డగోలుగా దోచేసే ఈ వైసీపీ నాయకులను ఎదుర్కోవడమే జనసేన లక్ష్యం.
* ఉదాసీనతను వీడండి
ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే మనకు సంబంధం లేదు అనుకోకండి.. వైసీపీ ప్రభుత్వం వల్ల ఓ కుటుంబానికి అన్యాయం జరిగితే మనకు అవసరం లేదు అనుకోకండి. కచ్చితంగా మన ఇంట్లో వారికి కూడా రేపొద్దున్న అలాంటి పరిస్థితి రావచ్చు. సమాజంలో ఏ సమస్య వచ్చినా కచ్చితంగా స్పందించే గుణం అందరిలో ఉండాలి. ఎవరికి అన్యాయం జరిగినా వెంటనే నిలబడే స్వభావం రావాలి. మన ఆడబిడ్డల్ని మనం రక్షించుకోవాలి. రాష్ట్రంలో చాలామందికి ఉదాసీనత పెరిగిపోయింది. పక్క వాడికి కష్టం వస్తే మనది కాదు అని వదిలేసే గుణం తప్పు. వరంగల్ లో స్వప్నిక అనే యువతి పై యాసిడ్ దాడి జరిగినప్పుడు ఆ యువతి నాతో ‘అన్నా.. ఆడపిల్లలకి ఇలా జరగకుండా చూడన్నా’ అన్న మాట నా కళ్ళలో నీళ్ళు తెప్పించింది. సుగాలి ప్రీతీ అనే 14 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురై ఫ్యాన్ కు వేలాడుతుంటే చూసిన ఆ దివ్యాంగురాలైన తల్లి మనసు ఎంత వేదనకు గురి అయి ఉంటుందో ఆలోచించండి. పదో తరగతి చదివిన ఆ తల్లి కూతురిని హత్య చేసిన వారికి కచ్చితంగా న్యాయం జరగాలి అని లా సెక్షన్లు కూడా తెలుసుకోవడం గొప్పగా అనిపించింది. ఆ తల్లి పోరాటానికి అండగా నిలవాలని భావించాను. ఓడిపోయినప్పటికీ ఆ తల్లికి మద్దతుగా నిలిచాం. కచ్చితంగా జనసేన ప్రభుత్వం రాగానే ఆ తల్లికి సరైన న్యాయం చేసే దిశగా చర్యలు ఉంటాయి.
* అరాచకాన్ని తీవ్ర దశకు తీసుకువెళ్లిన జగన్
నా పోరాటం జగన్ మీద మాత్రమే కాదు. జగన్ లాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తుల మీద పోరాడుతాను. సమాజంలో ఇంకెవరూ బతకకూడదు.. నేనొక్కడినే ఉండాలి అనుకునే మనస్తత్వం చాలా చెడ్డది. జగన్ తన పాలనలో అవినీతిని, అరాచకత్వాన్ని తీవ్ర దశకు తీసుకెళ్లాడు. నా పోరాటం పరివర్తన మీద.. నా పోరాటం పూర్తిస్థాయి రాజకీయ మార్పు మీద ఉంటుంది. భారతదేశంలో గతంలో ఉన్న అనైక్యత అనే ఆయుధాన్ని ఉపయోగించుకొని ఈస్టిండియా కంపెనీ కేవలం 3000 మందితో భారతదేశంలోకి ప్రవేశించి మొత్తం దేశాన్ని తమ ఆధిపత్యంలోకి తీసుకుంది. ఏదైనా సరే మొదట చిన్నగా మొదలై తర్వాత విస్తృత రూపం దాల్చుతుంది. వ్యవస్థలను పట్టి పీడిస్తూ సొంత వ్యవస్థలను నెలకొల్పే జలగల మీద మాత్రమే నా పోరాటం. ఆంధ్రప్రదేశ్ ను పట్టి పీడిస్తున్న జలగ జగన్ మీద ఇప్పుడు పోరాడుతున్నాం. భవిష్యత్తులో జగన్ పోతే మరో వ్యక్తి రాడు అని అనుకోవడానికి లేదు. జగన్ లాంటి వ్యక్తి వచ్చినప్పుడు కచ్చితంగా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రావాలన్నదే నా అంతిమ లక్ష్యం. దానికోసమే మిమ్మల్ని చైతన్యవంతులుగా తీర్చిదిద్దుతున్నా.
* మిమ్మల్ని ప్రశ్నించుకోండి
నా జీవితం ఎందుకు ఇలా ఉండిపోయింది అనే ప్రశ్న నిత్యం వస్తే కచ్చితంగా దానికి సమాధానం వెతికే ప్రక్రియలో భాగంగా మీకు రకరకాల దారులు కనిపిస్తాయి. ఆ దారుల్లో ముందుకు వెళ్లే తెలివితేటలు, జ్ఞానం వస్తుంది. బతికే హక్కును దేవుడిచ్చాడు. దానిని ఎవరు హరించినా పోరాటం చేసే హక్కు ప్రతి మనిషికి ఉంది. బతికే హక్కును సంపూర్ణంగా సాధించడమే మానవ జన్మ లక్ష్యం. మధ్యతరగతి కుటుంబం నుంచి నేను వచ్చాను. ఒకరికి పెట్టే వాళ్ళమే తప్ప దోచుకునే మనస్తత్వం మధ్యతరగతికి ఉండదు. నేను కచ్చితంగా మధ్యతరగతి మనస్తత్వంతోనే నిత్యం ఉంటాను. ఇక్కడ తణుకులో విషయాలు మళ్లీ మాట్లాడుకుందాం. పార్టీ కోసం శ్రీ విడివాడ రామచంద్రరావు బలంగా నిలిచారు. గత ఎన్నికలలో సీటు పొందిన వ్యక్తి ఆ తరవాత పార్టీ వదిలి వెళ్ళిపోయారు. శ్రీ రామచంద్రరావు నిబద్ధతతో నిలిచారు.
* ఏడు సిద్ధాంతాలే భవిష్యత్తు రాజకీయాలను నిర్దేశిస్తాయి
తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిల గారు పార్టీ పెడితే మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపాను. ఎక్కువ మంది రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించాను. ఆమె తన పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నారని కొందరు మాట్లాడుకుంటుంటే విన్నాను. అది ఎంత వరకు నిజమో మనకు తెలియదు. ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే పార్టీ నడపడం చిన్న విషయం కాదు. ముఖ్యమంత్రి బిడ్డలు అయినా, వేల కోట్లు ఉన్నా పార్టీ నడపడం కష్టం. పార్టీ నడపాలంటే కావాల్సింది బలమైన భావజాలం, సైద్ధాంతిక బలం, రాజ్యాంగంపై సంపూర్ణ అవగాహన కావాలి. మనం దేని కోసం రాజకీయాల్లోకి వచ్చామో దానిపై పూర్తి అవగాహన ఉండాలి. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా రూపాంతరం చెందింది. తెలంగాణ సాధనకే పుట్టామని చెప్పుకున్న ఆ పార్టీ ఇప్పుడు భారతదేశానికి పనిచేసేలా ఐడియాలజీ మార్చుకుంది. జనసేన పార్టీ ఏడు మూల సిద్ధాంతాలు చాలా బలమైనవి. భవిష్యత్తులో భారతదేశ రాజకీయాలను ఆ సిద్ధాంతాలు నిర్దేశిస్తాయి” అని అన్నారు.
* అధికారాన్ని అడ్డుపెట్టుకుని వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తున్నారు : శ్రీ నాదెండ్ల మనోహర్
జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “మన పార్టీ కార్యక్రమాలకు వస్తున్న జనాలను, వారి నిబద్ధత చూసి తట్టుకోలేకే ముఖ్యమంత్రి ఒక సభలో ఇది జనసేన కాదు రౌడీ సేన అన్నారు. మనది రౌడీ సేనో.. ఏ సేనో జగన్ రెడ్డికి చూపిద్దాం.. రాష్ట్రంలో పరిపాలన చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రి జగన్. ఈ రోజున శాసన సభ్యులుగా, ప్రజాప్రతినిధులుగా మీ ముందుకు వచ్చిన వారు సమాజానికి ఉపయోగపడాల్సింది పోయి యథేచ్చగా దోచుకుంటున్నారు. రాష్ట్రంలో మొట్టమొదటి సారి టీడీఆర్ బాండ్ల చర్చ ఇక్కడి నుంచే మొదలయ్యింది. స్థానిక మంత్రి పార్కు స్థలానికి కూడా టీడీఆర్ బాండ్లు సృష్టించి దోచుకునే ప్రయత్నం చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. రోడ్ల వెంట తిరిగి ఒక్క ఛాన్స్ అంటే 151 స్థానాలు ఇచ్చారు. తండ్రిలా పాలిస్తాడని ప్రజలు మనస్ఫూర్తిగా దీవిస్తే.. వీళ్లు రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారు. అధికారాన్ని స్వార్ధ రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నారు. కనీసం కేబినెట్ సమావేశంలో తీర్మానాలు, నిర్ణయాలు కూడా ప్రజలకు చెప్పే పరిస్థితి లేదు. కేబినెట్ సమావేశం ముగిశాక అక్కడ ఏం చర్చ జరిగింది? ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనే అంశాల మీద సంబంధిత మంత్రి మీడియా సమావేశం పెట్టి ప్రజలకు తెలియ చేయాలి. ఈ ముఖ్యమంత్రి అయితే నాలుగున్నర సంవత్సరాల్లో ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ప్రెస్ మీట్ పెడితే మీడియా మిత్రులు ఎక్కడ ప్రశ్నలు అడుగుతారోనన్న భయం. టిడ్కో గృహాలు నిర్మాణం పూర్తయి ఐదేళ్లు గడుస్తున్నా లబ్దిదారులకు ఇచ్చింది లేదు. ఇప్పుడు రూ.1361 కోట్ల కోసం టిడ్కో గృహాలకు కేటాయించిన భూములు అమ్మేయాలని తీర్మానం చేశారు. నాలుగు సంవత్సరాలుగా రాజధాని లేకుండా చేశారు. రాజధాని లేకుండా పాలన, అభివృద్ధి ఎలా సాధ్యం. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి ప్రతి కుటుంబానికి చేస్తున్న మోసాన్ని లెక్కలతో సహా వివరిస్తున్నారు. అంతా అర్ధం చేసుకోవాలి. క్రియాశీలక సభ్యులుగా మీరంతా ప్రతి గడప తొక్కి శ్రీ పవన్ కళ్యాణ్ గారి భావజాలం, జనసేన సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకువెళ్లండి. ఎవరూ ఎవరికీ తలదించవద్దు. బలమైన ఆలోచనతో కష్టపడి పని చేయండి. శ్రీ సాయి అనే జనసైనికుడు శ్రీకాళహస్తిలో శాంతియుతంగా నిరసన తెలిపే ప్రయత్నం చేస్తే ఓ మహిళా పోలీసు అధికారి దుర్మార్గంగా ప్రవర్తించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామన్న భయంతో ఎట్టి పరిస్థితుల్లో ఆ కార్యక్రమాన్ని ఆపాలన్న ఉద్దేశంతోనే శ్రీ సాయి మీద దాడి చేశారు. మనం నిలబడుతోంది మన ప్రజల కోసం. అదే ధైర్యం స్ఫూర్తితో ప్రతి గ్రామంలో జనసేన జెండా ఎగురవేయండి. జనసేన ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తారు” అన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు ఆధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ పీఏసీ సభ్యులు కనకరాజు సూరి, తణుకు ఇంఛార్జ్ విడివాడ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.