RBI: కీలక వడ్డీరేట్లు యధాతథం
ఒమిక్రాన్ వేరియంట్ విజృంభణ, ఆర్థిక అసమానతల నేపథ్యంలో కీలక వడ్డీరేట్లను యధాతథంగా ఉంచుతున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) ప్రకటించింది. కీలక వడ్డీ రేట్లను ఆర్‌బిఐ మార్చకుండా ఉండటం వరుసగా ఇది తొమ్మిదవ సారి. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం వెల్లడించారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తితో పాటు అధిక ద్రవ్యోల్బణం వంటి భయాల కారణంగా ఈసారి కూడా కీలక రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదని అన్నారు. రెపో రేటుని 4శాతంగా ఉంచగా.. రివర్స్ రెపో రేటును 3.35 శాతంగా కొనసాగించనున్నట్లు శక్తికాంత దాస్ తెలిపారు. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు 4.25 శాతంగానే ఉండనుంది. ఈ ఏడాది అక్టోబరులో జరిగిన సమావేశంలోనూ వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. కరోనా సంక్షోభం నుండి ఆర్థిక వ్యవస్థకు ఉపశమనం కల్పించేందుకు చివరిసారిగా 2020 మే 4న రెపోరేటును 4 శాతానికి కుదించింది. అప్పటి నుండి ఆ 4 శాతాన్ని కొనసాగిస్తోంది. 2021-2022 ఆర్థిక సంవత్సరానికి స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) వృద్ధి లక్ష్యాన్ని 9.5 శాతంగా నిలిపివుంచినట్లు గవర్నర్ పేర్కొన్నారు. అలాగే ఆర్థిక సంవత్సరం 2022కి వినియోగ ధరల సూచీ (సిపిఐ) ఆధారంగా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని రెండు శాతం మార్జిన్‌తో 4 శాతంగా ఉండేలా చూడాలని ప్రభుత్వం ఆర్‌బిఐని కోరింది. దీంతో రిటైల్ ద్రవ్యోల్బణం 5.3 శాతంగా అంచనా వేయబడిందని శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు.