25న యూపీ నిర్భంధం..

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తీవ్రస్థాయిలో ఉద్యమిస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్ హర్యానాకు చెందిన రైతులు ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నారు. మొదట ఆ రెండు రాష్ట్రాలకే పరిమితమైన ఉద్యమం చిన్నగా మిగిలిన రాష్ట్రాలకు పాకింది. అయితే ఇప్పటికే పలు దఫాలుగా కేంద్రం చర్చలు జరిపినప్పటికీ రైతులు శాంతించలేదు. ‘చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందే’ అని వాళ్లు ఏకైక డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం రైతుల ఉద్యమంపై ఎదురుదాడికి దిగింది. ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అని ఆరోపిస్తున్నది. ఏకంగా ప్రధాని నరేంద్రమోదీ ఈ విషయంపై మాట్లాడుతూ.. కొన్నిరైతు సంఘాలు రాజకీయపార్టీలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ రైతులకు ఓ లేఖ రాశారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలు మంచివే అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను రైతులు రైతుసంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే ఇప్పుడు ప్రధానమంత్రి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వాజ్ పేయి జయంతి సందర్భంగా ఈ నెల 25న ప్రధాని నరేంద్ర మోదీ రైతులతో సమావేశం కానున్నారు. ఈ సందర్బంగా ఆయన రైతు చట్టాలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. ఉత్తరప్రదేశ్లోని 2500కిపైగా ప్రదేశాల్లో ‘కిసాన్ సంవాద్’ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు బీజేపీ పేర్కొన్నది. ఈ మేరకు యూపీ బీజేపీ చీఫ్ స్వతంత్ర దేవ్సింగ్ పార్టీ నేత రాధామోహన్ సింగ్ ఓ ప్రకటన విడుదలచేశారు.

అయితే బీజేపీ నిర్ణయంపై రైతు సంఘాలు మరింత మండిపడుతున్నాయి. కేంద్రం తమ సమస్యను పరిష్కరించకుండా సమస్యను తప్పుదోవ పట్టిస్తున్నదని రైతులు ఆరోపించారు. 25న ప్రధాని నిర్వహించబోయే కిసాన్ సంవాద్ పైనా ఆగ్రహం వెళ్లగక్కాయి. అదేరోజు ఉత్తరప్రదేశ్-ఢిల్లీ సరిహద్దు(ఘాజీపూర్ బోర్డర్)ను పూర్తిగా స్తంభింపజేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. అయితే ఆ రోజు యూపీలో ఉద్రిక్తపరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నది.