‘అప్పు రత్న’ సీఎంగా ఉన్నంత కాలం అభివృద్ధి అనే మాట మరచిపోవచ్చు

•ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పింఛన్లు ఇవ్వకుండా ఇబ్బందుల పాల్జేస్తున్నారు
•రోజుకి రూ.205.759 కోట్లు అప్పు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు?
•రోజుకి రూ.65 కోట్లు వడ్డీ చెల్లిస్తున్నారు
•రుణాలు, రాబడులు, వ్యయంపై కాగ్ లెక్కలు బహిర్గతం చేయాలి

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సగటున రోజుకి రూ.205.759 కోట్లు అప్పు తీసుకొస్తున్న మాట వాస్తవం. ఈ లెక్క కూడా బహిరంగ మార్కెట్ రుణం మాత్రమే. కార్పొరేషన్ల ద్వారా తెస్తున్న అప్పులు, ప్రభుత్వ గ్యారెంటీతో వచ్చే అప్పులు కూడా కలిపి లెక్కవేస్తే ఆ మొత్తం రూ.500 కోట్లు దాటిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. ప్రతి రోజు వందల కోట్లు అప్పులు చేస్తున్నారు, వందల కోట్లు రాబడులు చూపిస్తున్నారు… అయినా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వకుండా ఇబ్బందుల పాల్జేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకూ ఏ నెలలోనూ ఒకటో తేదీన జీతం అందుకోలేకపోయారు. ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు సకాలంలో అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రి గారు ఉద్యోగుల విషయంలో ఒకటి గ్రహించాలి. అందరూ మీ విధంగా సంపన్నులు కారు. వివిధ ఖాతాలు, కంపెనీలు తెరిచి వేల కోట్లు సంపాదించుకోలేదు. నెల జీతం మీద ఆధారపడే బతుకుతారు. మీ ప్రభుత్వ ఆర్థిక నిర్వాకం వల్ల ఉద్యోగుల నెల బడ్జెట్ తలకిందులవుతోంది. పెన్షనర్లు సైతం ఆరోగ్యపరమైన ఖర్చులకు అప్పులు చేస్తున్నారు. పోలీసులకు జీతాలే కాదు టి.ఏ., సరెండర్ లీవులు కూడా బకాయి పెట్టారు. భారీగా చేస్తున్న అప్పులు, రాబడులను ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది? ఆ మొత్తాలను ఎటు మళ్లిస్తున్నారు? కనీసం అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన ఉందా అంటే అదీ లేదు. అప్పు రత్నగా మారిపోయిన శ్రీ జగన్ రెడ్డి పాలనలో అభివృద్ధి అనే మాట మరచిపోవచ్చు. ఏ ప్రభుత్వ పని చేసినా బిల్లులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్లు కనీసం టెండర్ కూడా వేయడం లేదు. రోడ్లు పనులు చేయరు, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆగిపోయాయి, రైతులకు పెట్టుబడి రాయితీ ఇవ్వరు, విద్యార్థుల ఫీజు రీ ఎంబర్స్మెంట్ సక్రమంగా అమలు కాదు. అభివృద్ధి పనులు లేవు, సంక్షేమ కార్యక్రమాలు అమలు కావు. మరి రోజుకి వందల కోట్లు అప్పు, కోట్ల సొంత రాబడి రాష్ట్ర ఆర్థిక శాఖ లెక్కల్లో కనిపిస్తోంది. ఈ మొత్తాలు ఎటు మళ్లుతున్నాయి. రోజుకి రూ.65 కోట్లు వడ్డీ కడుతున్న రాష్ట్రం ఏదైనా ఉందీ అంటే అది మన ఏపీ మాత్రమే కావచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాలపై కాగ్ ఇచ్చిన నివేదికను బహిర్గతం చేయాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.