స్వాతంత్ర్య అమృతోత్సవ శుభాకాంక్షలు

మన దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తయ్యాయి. దేశమంతా అమృతోత్సవ వేడుకలు జరుపుకొంటున్న ఈ శుభవేళ ప్రతి ఒక్కరికీ నా తరఫున, జనసేన పక్షాన శుభాకాంక్షలు తెలియచేస్తున్నానంటూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. దేశాన్ని పరాయి పాలన నుంచి విముక్తి చేయడానికి త్యాగాలు నెరిపిన పోరాటయోధులను మనస్ఫూర్తిగా స్మరించుకోవాలి. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్, అల్లూరి సీతారామరాజు, చంద్రశేఖర్ ఆజాద్, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, సర్వాయి పాపన్న గౌడ్, ద్వారబంధాల రామచంద్రయ్య నాయుడు, సాసుమాన వీరగున్నమ్మ వంటి వీరుల ప్రాణ త్యాగాలు… నేతాజీ సుభాష్ చంద్రబోస్ ధీరత్వం… మహాత్మా గాంధీజీ అహింసా మార్గాన సాగించిన పోరాటాలను సదా మననం చేసుకోడం భారతీయులుగా మన కర్తవ్యం. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను భావి తరాలకు తెలియ చెప్పవలసిన బాధ్యత మనందరిపై ఉంది. స్వాతంత్రం కోసం పోరాడినా వెలుగులోకి రాని అజ్ఞాత వీరులకు, గుర్తింపు కోరుకోని త్యాగధనులకు, వారి కుటుంబాలకు మనస్ఫూర్తిగా వందనాలు అర్పిస్తున్నాను. జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులకు పేరు పేరునా విజ్ఞప్తి చేస్తున్నా… ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని ఆనందోత్సాహాలతో ఊరూరా వాడవాడలా ఘనంగా నిర్వహించండి. మీమీ ప్రాంతాల్లో ఉన్న స్వతంత్ర సమర యోధులు, వారి కుటుంబాలను గౌరవించండి.. సత్కరించండి. త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేసి అమరులకు నివాళులు అర్పించండి అని శ్రీ పవన్ కళ్యాణ్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *