మన బడి నాడు-నేడు’లో రూ.2,253 కోట్ల భారీ స్కామ్

• కేంద్రం, నాబార్డ్, ప్రపంచ బ్యాంక్, సర్వశిక్ష అభియాన్ నుంచి రూ.6 వేల కోట్లు వచ్చాయి
• విద్యారంగంలో అద్భుతాలు చేస్తున్నామని వైసీపీ వాళ్ళు వేల కోట్ల అవినీతి చేశారు
• ప్రారంభించి రెండేళ్లు దాటినా పదిశాతం పనులు కూడా పూర్తి చేయలేదు
• పాఠశాల అభివృద్ధి పేరుతో ప్రతి తల్లి నుంచి రూ.వెయ్యి వసూలు చేస్తున్నారు…
ఆ సొమ్ములు పాఠశాల అభివృద్ధికి ఇవ్వడం లేదు
• అమ్మ ఒడి నుంచి వసూలు చేసిన రూ.కోట్లు ఏం చేశారు?
• కేంద్ర ప్రభుత్వం నుంచి సమగ్ర శిక్ష పథకానికి రూ.4409.67 కోట్లు వచ్చాయి… రూ.1855.81 కోట్లు దుర్వినియోగం
• సమగ్ర శిక్ష ఉద్యోగులకు నాలుగు నెలలుగా జీతాల్లేవు
• ఏపీ ప్రభుత్వ విద్యా వ్యవస్థలో అవినీతిపై కేంద్రం దృష్టిసారించాలి
• సమగ్ర విచారణ జరిపించి అవినీతిపరులను కఠినంగా శిక్షించాలి
• మంగళగిరి కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో జనసేన పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

‘వైసీపీ ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లుగా విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొస్తాం.. పాఠశాలల రూపురేఖలు మార్చేస్తాం.. ఇంగ్లీషు మాధ్యమాన్ని తీసుకొచ్చి ప్రతి విద్యార్థిని గ్లోబల్ సిటిజన్ గా మార్చేస్తామని ఊదరగొడుతూ ‘మన బడి నాడు- నేడు’ పథకంలో రూ.2,253 కోట్ల భారీ అవినీతికి పాల్పడింద’ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. విద్యా రంగం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వంతోపాటు ఇతర సంస్థలు కేటాయించిన రూ. 6 వేల కోట్లలో రూ.2,253 కోట్లు దారి మళ్లాయని, దీనిపై ముఖ్యమంత్రి సమగ్ర విచారణ జరిపించి అవినీతికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే టోఫెల్, పాల వెల్లువ, ఇండోసోల్ సంస్థకు అనుచిత లబ్ధి, జగనన్న విద్యా కానుక పథకం, పేదల గృహ నిర్మాణంలో అవినీతిని ఆధారాలతో సహా బయటపెట్టిన శ్రీ నాదెండ్ల మనోహర్ గారు… తాజాగా విద్యా శాఖకు సంబంధించి నాడు- నేడు పథకంలో జరిగిన అవినీతిని గణాంకాలతో సహా బహిర్గతం చేశారు. మంగళగిరి కేంద్ర కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ… “విద్యారంగంలో అద్భుతమైన మార్పు తీసుకొస్తాం. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతాం. డిజిటల్ క్లాసులు, ఇతర మౌలిక సదుపాయలు ఏర్పాటు చేసి విద్యారంగంలోనే నెంబర్ వన్ స్టేట్ గా రాష్ట్రాన్ని మార్చేస్తామని నాలుగున్నరేళ్లుగా నాయకులు చేసిన వాగ్ధానాలు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయి. నాడు-నేడు పథకంపై ప్రతిపక్షాలు ఏదన్నా మాట్లాడితే… పేద విద్యార్థులకు మంచి చేస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నారని ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఈ నాలుగున్నరేళ్లలో పేద విద్యార్థుల కోసం ఖర్చు చేయాల్సిన వేల కోట్ల సొమ్మును అడ్డగోలుగా దోచుకుని ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారు.
• రూ.6 వేల కోట్లు వచ్చాయి… రూ.2,253 కోట్లు ఏం చేశారు?
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలికసదుపాయాల కల్పన కోసం రూ.7029 కోట్లు అవసరమని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ నిధులతో 48,626 పాఠశాలల్లో అదనపు గదులు నిర్మించడంతోపాటు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించవచ్చని కేంద్రానికి నివేదించింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం రూ. 2,500 కోట్లు, నాబార్డు నుంచి రూ. 1800 కోట్లు, ప్రపంచ బ్యాంకు రూ. 700 కోట్లు, సర్వశిక్ష అభియాన్ గ్రాంట్ కింద రూ. 1000 కోట్లు… ఇలా రూ. 6 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి అందాయి. అందిన రూ. 6 వేల కోట్లలో రూ. 3747 కోట్లు ఖర్చు చేసినట్లు చూపించిన ప్రభుత్వం… మిగిలిన రూ. 2,253 కోట్లు ఏమయ్యాయో చెప్పడం లేదు. కనీసం పనులు చేసిన కాంట్రాక్టర్లకు కూడా డబ్బులు ఇవ్వని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. నాడు-నేడు పనులు చేసిన కాంట్రాక్టర్లకు ఇప్పటికీ రూ. 1448 కోట్లు వైసీపీ ప్రభుత్వం బకాయి పడింది.
• చెప్పింది 13,860 గదులు… కట్టింది 612 గదులు
ప్రజాధనం రూ.5 కోట్లు ఖర్చు చేసి 2021 ఆగస్టు 16వ తేదీన నాడు- నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు… ఏడాదిలోగా పనులు పూర్తి చేస్తామని ప్రకటించారు. పనులు ప్రారంభమై 27 నెలలు గడుస్తున్నా నేటికీ 10 శాతం పనులు కూడా పూర్తి చేయలేకపోయారు. నాడు – నేడు పథకం రెండో విడతలో 13,860 అదనపు గదులు నిర్మిస్తామని చెప్పి 612 నిర్మించారు. 6001 పాఠశాలలకు ప్రహారి గోడల నిర్మాణానికి టెండర్లు పిలిపించి కేవలం 600 మాత్రమే పూర్తి చేశారు. 23,221 పాఠశాలల్లో ఫర్నిచర్ తో పాటు ఇతర మౌలిక సదుపాయాలు అవసరమని గుర్తించారు. 1174 పాఠశాలల్లో మాత్రమే పనులు పూర్తి చేశారు. స్వచ్ఛ విద్యాలయ కార్యక్రమం కింద మరుగు దొడ్ల నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన నిధులను కూడా మింగేశారు. 49,293 మరుగుదొడ్లను నిర్మించామని చెబుతున్న ప్రభుత్వం అందులో పదో వంతు కూడా పూర్తి చేయలేదు. పనులు అసంపూర్తిగా జరగడంతో కొన్ని చోట్ల చెట్ల కింద పాఠాలు బోధిస్తున్నారు. కాకినాడలో విద్యుత్ వైర్ తగిలి విద్యార్థి మృతి చెందాడు. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి.
• సమగ్ర శిక్ష ఉద్యోగులకు జీతాల్లేవు
నాలుగు నెలలుగా ప్రభుత్వం జీతాలు ఇవ్వకపోవడంతో 25 వేల మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆందోళనకు దిగారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని వాళ్లు డిమాండ్ చేస్తే – ‘మీరు కాంట్రాక్ట్ ఉద్యోగులు, మిమ్మల్ని ఔట్ సోర్సింగ్ ద్వారా తీసుకున్నాం.. ఎక్కువ మాట్లాడితే ఉద్యోగం తీసేస్తామంటూ బెదిరిస్తున్నార’ని వారు వాపోతున్నారు. వీరికి ఇస్తున్న వేతనంలో కేంద్ర ప్రభుత్వం 60 శాతం చెల్లిస్తుంటే… రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 40 శాతం చెల్లిస్తోంది. ఆ నలభై శాతం కూడా రాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలల నుంచి చెల్లించడం లేదు. మినిమమ్ టైమ్ స్కేల్ అమలు చేసి జీతాలు పెంచుతున్నట్లు రెండుసార్లు జీవోలు ఇచ్చారు తప్ప ఎక్కడా రూపాయి కూడా పెరిగిన దాఖలాలు లేవు. సమగ్ర శిక్ష పథకంలో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన రూ. 4409.67 కోట్లలో రూ. 1855.81 కోట్ల నిధులు దుర్వినియోగం అయినట్లు తేలింది.
• మెయింటెనెన్స్ ఫండ్ కూడా మింగేశారు
పాఠశాల మెయింటెనెన్స్ ఫండ్ పేరిట అమ్మ ఒడి పథకంలో ప్రతి ఒక్కరి దగ్గర రూ.1000 వసూలు చేస్తున్నారు. ఇలా వసూలు చేసిన సొమ్ము దాదాపు రూ. 400 కోట్లు. ఈ మొత్తాన్ని పాఠశాలల మెయింటెనెన్స్ కు ఇవ్వాల్సి ఉంది. ఇందులో ఇప్పటి వరకు రూ. 180 కోట్లు వరకు విద్యార్థుల తల్లితండ్రులతో కూడిన కమిటీలకు ప్రభుత్వం ఇవ్వలేదు. సకాలంలో బిల్లులు రావడం లేదు. ఇటీవల శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్తే నా దృష్టికి కొన్ని విషయాలు వచ్చాయి. శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు జెడ్పీ హైస్కూల్, కొలనూరు జెడ్పీ హైస్కూల్స్ పరిధిలో రూ. 20 లక్షల వరకు బిల్లులు రాలేదు. దాంతో పేరెంట్స్ కమిటీకి సంబంధించి ఇద్దరు మహిళలు ఆత్మహత్యాయత్నం చేశారు.
• విద్యాశాఖలో కుంభకోణాలపై సమగ్ర విచారణ జరిపించాలి
తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్న దానికంటే ఎక్కువ జీతాలు ఇస్తామని పాదయాత్ర సమయంలో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు జగన్ హామీ ఇచ్చారు. నాలుగున్నరేళ్లు అవుతున్నా ఆ హామీని అమలు చేయాలని దాదాపు 1.04 లక్షల మంది అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఇసుక, లిక్కర్ లోనే అవినీతి జరిగిందని అందరూ అనుకుంటున్నారు. పేద విద్యార్థులకు ఖర్చు చేయాల్సిన నిధుల్లో కూడా అవినీతి జరిగింది. జగనన్న విద్యా కానుకలో రూ.120 కోట్లు దారి మళ్లించారు. ఆ నిధులు తాడేపల్లి మీదుగా ఉత్తరాంధ్ర, రాయలసీమ తరలించారని ఈడీ అధికారులే చెప్పారు. అలాగే అమ్మఒడి పథకంలో రూ. 180 కోట్లు ఇప్పటి వరకు చెల్లించాలి. అలాగే నాడు నేడు పథకంలో రూ. 2253 కోట్లు అవినీతి జరిగింది. ఇలా విద్యాశాఖలో భారీగా నిధులు దారి మళ్లాయి. దీనిపై కేంద్ర దృష్టి సారించాలి. అలాగే ముఖ్యమంత్రి కూడా సమగ్ర విచారణ జరిపించి దీనికి కారకులైన వారిని శిక్షించాలి. లేని పక్షంలో విద్యాశాఖలో జరిగిన అవినీతిపై మా పార్టీ నాయకులు గ్రామ స్థాయిలో పర్యటించి నిజా నిజాలు వెలికితీసి ప్రజా క్షేత్రంలోనే ప్రభుత్వాన్ని ఎండగడతాం” అని హెచ్చరించారు. విలేకర్ల సమావేశంలో ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాకు చెందిన నాయకులు పాల్గొన్నారు.

Avatar