పరాజయంలో ఓదార్పే ఊపిరి

* ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదర్శనీయం
విజయాలు వరించినప్పుడు పొగడ్తలతో ముంచెత్తేవారు కొల్లలుగా ఉంటారు. అదే అపజయం వెంటాడినపుడు ఓదార్చేవారు అరుదుగా మాత్రమే కనిపిస్తారు. నిజానికి సత్ఫలితాలు వచ్చినప్పుడు చేసే సన్మానాల కంటే పరాజయంలో వెన్నంటి ఉన్నవారే గొప్పగా కనపడతారు. మన గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు అభినందనలు చెప్పడం, శుభాకాంక్షలు అందచేయడానికి మాత్రమే పరిమితం కావడం లేదు. దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తేవడానికో, దేశానికి విజయాలు సాధించిపెట్టడానికో పరితపిస్తూ.. పరిశ్రమిస్తూ త్రుటిలో విజయానికి దూరమైన వారికి భరోసాగా నిలవడం నన్నెంతో ఆకట్టుకుందని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో శ్లాఘించారు.
బ్రిటన్ లో జరుగుతున్న కామన్ వెల్త్ క్రీడా పోటీలలో మహిళా కుస్తీ పోటీలో బంగారు పతకం చేజారిపోయి కాంస్యం మాత్రమే దక్కించుకున్న పూజ గెహ్లట్ దేశానికి బంగారు పతకం అందించలేకపోయానని, దేశ ప్రజలు క్షమించాలని విలపిస్తున్న వీడియోను మోదీ గారు చూసి ఆమెను ఓదార్చిన తీరు మానవీయంగా ఉంది. “నీ విజయం దేశానికి వేడుకలను తీసుకొచ్చింది.. క్షమాపణలు కాదు. నీ విజయాన్ని చూసి ఉత్తేజితులమయ్యాము… నీ విజయం మాకో అద్భుతం ” అని ఆమెకు పంపిన సందేశం కదిలించేలా ఉంది.
ఈ సందర్భంలోనే కాదు పలు సంఘటనలలో ఆయన చూపిన ఇటువంటి ఓదార్పు మనసుకు స్వాంతన చేకూరుస్తుంది. టోక్యోలో జరిగిన ఒలింపిక్ క్రీడలలో మన దేశ హాకీ మహిళ టీం ఫైనల్ చేరుకోవడంలో విఫలమైనప్పుడు మన క్రీడాకారిణులు మైదానంలో విలపించిన తీరు చూపరులను సైతం కంటతడి పెట్టించింది. ఆ సందర్భంలో కూడా శ్రీ మోదీ గారు మన క్రీడాకారిణులను ఇలాగే ఓదార్చారు. వారికి ఫోన్ చేసి తండ్రిలా అనునయించారు. చంద్రయాన్-2 ప్రాజెక్ట్ విఫలమైన సందర్భాల్లోనూ శ్రీ మోదీ గారు మన శాస్త్రవేత్తలలో గుండెధైర్యాన్ని నింపారు. ఈ ప్రాజెక్టులోని విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై దిగడంలో విఫలమైనప్పుడు ప్రత్యర్ధులు సోషల్ మీడియా వేదికగా మన శాస్తవేత్తలను గేలి చేశారు.. అవమానించారు. అటువంటి క్లిష్ట సమయంలో ఇస్రో చీఫ్ శ్రీ శివన్ ను గుండెలకు హత్తుకుని పరాజయాన్ని మరిచిపోండి.. భవిష్యత్తుపై దృష్టి పెట్టండని చెప్పి శాస్త్రవేత్తలకు మనోధైర్యాన్ని ఇవ్వడం కుడా మనం మరిచిపోలేని సంఘటన. ఇదే స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో కలగాలని కోరుకుంటున్నాను. పూజ గెహ్లట్ తో పాటు కామన్ వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన విజేతలకు, పాల్గొన్న క్రీడాకారులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు.