మీ బాధ్యతను నిజాయితీగా నిర్వర్తించండి.. నల్లపరెడ్డిపై ద్వజమెత్తిన సుధీర్ బద్దిపూడి

  • కోవూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు.. మీకు కోవూరు నియోజకవర్గం ప్రజలు ఇచ్చిన బాధ్యతను నిజాయితీగా నిర్వర్తించండి: నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు సుధీర్ బద్దిపూడి

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఈరోజు వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ మూడు ఏళ్లలో మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న కోవూరు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి లేదు. రోడ్ల దుస్థితి మరీ దారుణంగా ఉన్నాయి. ఆ రోడ్లను బాగుచేసే పరిస్థితి లేదు. రైతులు చెమటోడ్చి పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక సతమతమవుతున్నారు. మొదటి పంట డబ్బులు ఇంతవరకు కూడా రైతులకు అందని పరిస్థితి నెలకొంది. వరి వెయ్యడానికి సరిపడా నీరు ఉన్నాకూడా రైతులు పంట వెయ్యడానికి పెట్టుబడి లేక క్రాప్ హాలిడే తీసుకునే పరిస్థితి కోవూరు నియోజకవర్గం పరిధిలో ఏర్పడింది. దీనిమీద మీరు స్పందించి రైతులకు అండగా నిలబడాలి. కానీ ఆ పరిస్థితి లేదు. ప్రజలు ఇచ్చిన ఎమ్మెల్యే హోదాని అడ్డం పెట్టుకుని వ్యక్తిగత స్వలాభం పొందుతూ పబ్బం గడుపుతున్నారు. కోవూరు సహకార చక్కెర కర్మాగారం మూతపడడం మీద 2019 ఎన్నికల ముందు ఎన్నో ప్రసంగాలు, విన్యాసాలు చేసిన మీరు.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కోవూరు సహకార చక్కెర కర్మాగారాన్ని తిరిగి పునః ప్రారంభిస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చాక దాని ఊసే మర్చిపోయారు. పైగా ఆ సహకార చక్కెర కర్మాగార స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు కారు చౌకకు అమ్మేసే కుట్రకి తెరతీశారు. నియోజకవర్గ పరిధిలో పర్యావరణాన్ని పాడుచేస్తు..అక్రమార్కులు చేసే అక్రమ ఇసుక మాఫియా, అక్రమ గ్రావెల్ మాఫియా ముఠాని, ప్రభుత్వ భూముల కబ్జా చేసే రౌడీ మూకని పెంచి పోషిస్తున్నారు తప్ప నమ్మి ఒట్లేసిన ప్రజలకు ఎలాంటి న్యాయం చేయటంలేదు. కోవూరు నియోజకవర్గంలో నమ్ముకున్న ప్రజలను నట్టేట ముంచారు. కేవలం అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇస్తూ..ఇదే అభివృద్ధి అని మీరు భావించడం, ప్రజలను నమ్మించే ప్రయత్నం చెయ్యడం హాస్యాస్పదంగా ఉంది. 2019 లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల తరువాత అప్పటి ఇరిగేషన్ మంత్రి గారు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారితో కలిసి కోవూరులో ఒక సమావేశం నిర్వహించి కోవూరు నియోజకవర్గం ప్రజలకు మాట ఇచ్చిన ప్రకారం ఇరిగేషన్ పరిధిలోకి వచ్చే పనులను 300 కోట్ల రూపాయలుతో పనులు చేస్తామన్నారు. మరి ఆ పనులు ఏమయినాయి అని మేము జనసేన పార్టీ తరుపున ప్రశ్నిస్తున్నాము. 2022 మే నెలలో పంచాయితీ రాజ్ రోడ్లకు సంభందించి ప్రతిపాదనలు తెప్పించుకుని అప్పటి మార్కెటింగ్ శాఖా మంత్రి శ్రీ కన్నబాబు గారి ద్వారా మార్కెటింగ్ శాఖ నుంచి విడుదల చేయించుకున్న 32 కోట్ల 74 లక్షల రూపాయల నిధులు ఏమైనాయి అని మేము ప్రశ్నిస్తున్నాము. ఈరోజుకి ఆ రోడ్లు అలానే గుంతల మయంగానే ఉన్నాయి. చినుకు పడితే ప్రజలు ఆ రోడ్ల మీద ప్రయానించలేక నానా అవస్థలు పడుతున్నారు. కోవూరు నియోజకవర్గంలో ఇన్ని సమస్యలు ఉంటే వాటిని గాలికి వదిలేసి మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం పద్ధతి కాదు. మీరు మీ వైసీపీ ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం అని ప్రజలు గుర్తించారు. ఇచ్చిన పని చెయ్యడం చేతకాని కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు.. పని చేతకాకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి దిగిపోండి. అంతేకాని మా అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోము. మాకు ప్రతిపక్షం లేనేలేదు.. ఆంధ్ర రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాత్రమే అని మీరు తిరిగే గడప గడపకి కార్యక్రమంలో ప్రగల్బాలు పలుకుతున్నారు. మీకు ప్రతిపక్షం ప్రజలే..రాబోయే ఎన్నికలలో ప్రజలు తప్పకుండా మీ వైసీపీ పార్టీకి బుద్ధిచెప్తారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ప్రజలు జనసేన పార్టీని కోరుకుంటున్నారు.