బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు… బ్యాక్ బోన్ క్లాస్

* ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలి
* జనసేన గెలుపు… బీసీల గెలుపు
* ఆర్థిక పరిపుష్ఠితోనే రాజకీయ సాధికారిత సిద్ధిస్తుంది
* బీసీలు, దళితులు, కాపులు కలిస్తే రాజ్యాధికారం తథ్యం
* తెలంగాణలో 26 కులాలకు బీసీ స్టేటస్ తొలగిస్తే ఒక్క నాయకుడూ మాట్లాడలేదు
* దీనిపై బీఆర్ఎస్ వివరణ ఇవ్వాలి
* బీసీ కార్పొరేషన్ల పదవులు స్టిక్కర్లకే పరిమితమయ్యాయి
* మంగళగిరిలో బీసీ సంక్షేమ సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్

బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు… బ్యాక్ బోన్ క్లాస్ అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. బీసీలు ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. బీసీలు తమ హక్కుల కన్నా ముందు ఐక్యత సాధించాలని, ఆర్థిక పరిపుష్ఠి సాధించిన రోజున రాజ్యాధికారం తప్పక సిద్ధిస్తుందని అన్నారు. బీసీలకు ఆర్థిక పరిపుష్ఠి, రాజ్యాధికార సాధన కోసం జనసేన కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. శనివారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో బీసీ సంక్షేమంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “ బీసీ కులాలు అంటే ఉత్పత్తి కులాలు. భారతదేశ సంస్కృతికి వెన్నెముక. అత్యధిక సంఖ్యా బలం ఉండి కూడా నేటికీ దేహీ అనే స్థితిలో ఉండటం బాధాకరం. అత్యధిక బీసీలు ఉన్న చోట మిగతా కులాలకు చెందిన వ్యక్తులు గెలుస్తున్నారు. బీసీల అనైక్యతే మిగతా వారికి బలం. బీసీలు హక్కుల కంటే ముందు ఐక్యత సాధించాలి. బీసీలకు సాధికారత రావాలంటూ ఇంత వరకు మాటలు చెప్పే నాయకులనే మీరు చూశారు. చేతలను చూపించే నాయకత్వాన్ని నేను చూపిస్తాను.
* 50 ఏళ్లు అయినా ఆ కాంబినేషన్ కుదరలేదు
రామ్ మనోహర్ లోహియా ‘క్యాస్ట్ ఇన్ ఇండియా’ అనే పుస్తకంలో ఆంధ్రప్రదేశ్ కుల రాజకీయాల గురించి ప్రస్తవించారు. బీసీలు, దళితులు, కాపులు కలిస్తే రాజ్యాధికారం ఇంక ఎవరికీ దక్కదని రాశారు. ఆ పుస్తకం1964లో రాశారు. ఇప్పటికి దాదాపు 50 ఏళ్లు పూర్తయ్యింది. అయినా ఆ కాంబినేషన్ నేటికీ కుదరలేదు. నిజంగా ఆ కాంబినేషన్ కుదిరితే మాత్రం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు.. దేహీ అనే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదుగుతారు. పోరాటం చేసినప్పుడు కలిసి వచ్చే 146 బీసీ కులాలు… బీసీ వ్యక్తిని గెలుపించుకోవడానికి ఎందుకు నిలబడలేకపోతున్నాయి? గత సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ సీటు పొత్తుల్లో భాగంగా వేరే పార్టీ అడిగితే … పట్టుబట్టి మరీ మన బీసీ సోదరుడు అయిన పోతిన మహేష్ కు ఇచ్చాను. ఆ సీటు కోసం అవసరమైతే పొత్తును కూడా వదులుకుందాం అనుకున్నాను. అదీ నేను బీసీలకు ఇచ్చే విలువ.
* 26 బీసీ కులాలను తొలగిస్తే ఎందుకు మాట్లాడలేదు?
నన్ను రాజకీయంగా విమర్శించాలంటే బీసీలు, దళితులతో తిట్టిస్తారు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో బీసీలు, కాపులు, దళితులు కొట్టుకోవాలని అలా చేస్తారు. ఈ పన్నాగం పన్నిన నాయకులు మాత్రం ఏ పార్టీలో ఉన్నా తిట్టుకోరు. విమర్శించుకోవడం కూడా చాలా చక్కగా విమర్శించుకుంటారు. తెలంగాణలో 26 బీసీ కులాలను బీసీ స్టేటస్ నుంచి తొలగించారు. అప్పుడు ఎందుకు బీసీలు ఉద్యమించలేదు? ఒక్క బీసీ నాయకుడైనా దీనిపై మాట్లాడారా? ఆ రోజు బలంగా మాట్లాడింది కేవలం జనసేన పార్టీ మాత్రమే. పోలినాటి వెలమ, తూర్పుకాపు, కాళింగులను బీసీ స్టేటస్ నుంచి తొలగించారు. పోలినాటి వెలమ సామాజికవర్గానికి చెందిన మంత్రి ధర్మాన ప్రసాదరావు కానీ, తూర్పు కాపు వర్గానికి చెందిన బొత్స సత్యనారాయణ కానీ, కాళింగ కమ్యూనిటికి చెందిన స్పీకర్ గానీ ఎందుకు మాట్లాడలేదు. దీనిపై ప్రతి పార్టీ స్పందించాలి. ఏపీ రాజకీయాల్లోకి వస్తున్న బీఆర్ఎస్ పార్టీ దీనిపై వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది.
* ఏడాదికి రూ. 10 వేలు ఇచ్చి కడుపు కొడుతున్నారు
బీసీల సంక్షేమానికి ఉపయోగించాల్సిన సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించారు. దాదాపు రూ. 34 వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లాయి. 56 బీసీ కార్పొరేషన్ల పదవులు స్టిక్కర్లకే పరిమితమయ్యాయి. 36 మంది టీటీడీ సభ్యులు ఉంటే అందులో ముగ్గురు బీసీలకు మాత్రమే చోటు కల్పించారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే టీటీడీ సభ్యుల్లో సగం మందిని బీసీలతో నింపుతాం. బీసీ సబ్ ప్లాన్ నిధులను ఒక్క రూపాయి కూడా దారి మళ్లించకుండా అట్టడుగు వ్యక్తికి చేరేలా కృషి చేస్తాం. బీసీలు రెండు కోట్ల మంది ఉంటే 4.37 లక్షల మందికి ఏడాదికి రూ. 10 వేలు ఇచ్చి వాళ్ల భవిష్యత్తును కొనేస్తున్నారు. జీవో నెం 217 తీసుకొచ్చి మత్స్యకారుల కడుపుకొట్టారు. మనకు న్యాయం చేయని జీవో చిత్తుకాగితంతో సమానమని ఆ రోజు ఆ జీవోను చింపేశాను. రూ. 20 కోట్లు పెట్టి మత్స్యకారులకు జెట్టీలు ఏర్పాటు చేస్తే వలసలను నిరోదించవచ్చు. దీనిపై ఎవరూ ఆలోచన చేయరు. దాదాపు 400 బ్యాక్ లాగ్ పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. బీసీలు గనుక ఉద్యమిస్తాను అంటే నేను అండగా ఉంటాను.ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వచ్చి ఒక రోజు దీక్షకు కూర్చుంటాను.
* తూర్పుగోదావరి జిల్లాలో సక్సెస్ అయ్యింది
నేను ఏ ఒక్క కులానికి చెందిన నాయకుడిని కాదు. అన్ని కులాలకు చెందిన నాయకుడిని. తూర్పుగోదావరి జిల్లాలో కాపులకు, శెట్టిబలిజలకు పడదన్నారు. 2 వారాలు అక్కడ కూర్చొని సయోధ్య చేశాను. దాని ఫలితంగా శెట్టిబలిజల పండగకు కాపులు శుభాకాంక్షలు చెప్పేలా పరిస్థితి మారింది. చాలా దూరదృష్టితో సోషల్ ఇంజనీరింగ్ చేశాను. నన్ను అన్ని కులాలకు చెందిన నాయకుడిగా చూస్తారు. నిజంగా నన్ను కాపులు ఓన్ చేసుకొని ఉంటే ఓడిపోయేవాడిని కాదు. గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీకి వచ్చిన ఓట్లలో సగానికి పైగా బీసీలు వేసినవే. ముఖ్యంగా మత్స్యకారులు అండగా నిలబడ్డారు. ఎప్పుడైతే బీసీలకు ఆర్థిక పరిపుష్ఠి వస్తుందో అప్పుడు రాజకీయ సాధికారిత వచ్చి తీరుతుంది. వైసీపీ, టీడీపీ నాయకులు ఆర్థికంగా పరిపుష్ఠిగా ఉంటారు కనుకే వాళ్లు బలంగా ఆటలాడుతారు. మనం ముందు ఆర్థిక పరిపుష్టి సాధించాలి. బీసీలకు రాజకీయ సాధికారిత ఎలా ఇవ్వాలి? ఆర్థిక పరిపుష్టికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? విద్య పరంగా ఎలాంటి మార్పులు తీసుకురావాలని జనసేన ముసాయిదా రూపొందిస్తోంది. బీసీల గెలుపు జనసేన గెలుపు. వాళ్లను అధికారంలోకి తీసుకురావాలని తపిస్తున్నాను” అన్నారు.