రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా ఐక్య పోరాటం

• ఖూనీ అవుతున్న ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిన సమయం ఆసన్నమైంది
• ప్రజా సమస్యలపై మాట్లాడితే గొంతు నొక్కేస్తున్నారు
• వైసీపీపై పోరాట వ్యూహాలు మార్చబోతున్నాం
• శ్రీ చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్
• ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేకపోతే ప్రజా సమస్యలపై పోరాడేదెవరు?
• ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజకీయ పక్షాలన్నీ కలసి రావాలి
• ఉన్మాద పాలకుడు పైశాచిక పాలన చేస్తున్నారు
• శ్రీ పవన్ కళ్యాణ్ మీటింగులు పెట్టడం తప్పా?
• మీడియాతో టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు
• విశాఖ ఘటనపై శ్రీ పవన్ కళ్యాణ్ కి సంఘీభావం
• గంటన్నరసేపు చర్చించిన ఇరువురు నేతలు

రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిన సమయం ఆసన్నమైందని.. ఖూనీ అవుతున్న ప్రజాస్వామ్యాన్ని బతికించడంతో పాటు రాజకీయ పార్టీలుగా ప్రజలకు ఎలాంటి భరోసా ఇవ్వాలనే అంశం మీద ఆలోచన చేస్తున్నట్టు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యం మనుగడ సాధించాలంటే ముందుగా రాజకీయ పార్టీలు ఉండాలన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడితే గొంతు నొక్కేస్తున్న పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయనీ, వీటిపై కలసికట్టుగా పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఇప్పటి నుంచి వైసీపీపై పోరాటం చేసే వ్యూహాలు మార్చబోతున్నట్టు తెలిపారు. వైసీపీ పాలన ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఉందని.. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యమే లేదని మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం లేకపోతే రాజకీయ పార్టీలకు మనుగడ లేదని, రాజకీయ పార్టీలే లేకపోతే ప్రజా సమస్యల మీద ఎవరు పోరాటం చేస్తారని ప్రశ్నించారు. ముందుగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు కలసి పోరాటం చేయాలని అన్ని రాజకీయ పార్టీలను కోరుతున్నట్టు తెలిపారు. విశాఖలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యటనను వైసీపీ ప్రభుత్వం పోలీసుల సాయంతో అడ్డుకున్న నేపథ్యంలో మంగళవారం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని విజయవాడలో కలసి సంఘీభావం తెలిపారు. విశాఖలో జరిగిన పరిణామాలు, తదుపరి కార్యచరణ తదితర అంశాల మీద ఇరువురు నాయకులు సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం కలసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. విశాఖలో మా జనసైనికుల మీద అన్యాయంగా కేసులు పెట్టి జైళ్లలో పెట్టడం.. బైండోవర్ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్న సమయంలో అన్ని రాజకీయ పార్టీల పెద్దలు ఫోన్ ద్వారా మద్దతు తెలిపారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన శ్రీ జగ్గారెడ్డి , శ్రీ తీన్మార్ మల్లన్న, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీ రామకృష్ణ గారు, ఈ రోజు సంఘీభావం తెలిపేందుకు ఇక్కడికి వచ్చిన శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నా.
* ఢిల్లీ వెళ్లి లడ్డూలు ఇస్తారు…రాష్ట్రంలో కేసులు పెడతారు
ప్రజాస్వామ్యం బతకాలంటే రాజకీయ పార్టీలు ఉండాలి. ప్రజా సమస్యల్ని రాజకీయ పార్టీలు మాట్లాడి బయటకు తేవాలి. మా గొంతే నొక్కేస్తామంటే ఎలా? దీనిని ఒకటే విధంగా చూస్తున్నాం. మా సొంత మిత్ర పక్షం బీజేపీ నాయకుల మీద అన్యాయంగా కేసులు పెట్టారు. వారి నాయకుణ్ణి విజయనగరంలో పేగులు బయటకు వచ్చేలా పొడిచారు. ఇదే ముఖ్యమంత్రి పోయి ఢిల్లీలో అదే పార్టీ నేతలకు లడ్డూలు ఇస్తారు.. రాష్ట్రంలో అదే బీజేపీ నాయకుల మీద కేసులు పెడతారు. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు కలసికట్టుగా ముక్తకంఠంతో ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిన అవసరం ఉంది.
• ఎవరేంచేసినా ప్రజా పోరాటాలు ఆగవు
మా మీదే ఇలాంటి అడ్డగోలు కేసులు పెడుతుంటే రాష్ట్రంలో సగటు మనిషి పరిస్థితి ఏంటో అంతా ఆలోచించాలి. పెద్దలు శ్రీ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన సందర్భంలో ఒకటే నిర్ణయించుకున్నాం. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ప్రజలకు ఎలాంటి భరోసా ఇవ్వాలి? అకారణంగా ప్రజల ఆస్తులు దోచేస్తున్నారు. ఈ విషయంపై అవసరం అయితే పదిసార్లు మాట్లాడుకుంటాం. అందర్నీ కలుపుకుని వెళ్తాం. ఇది ఎన్నికల గురించి ఆలోచించాల్సిన సమయం కాదు. ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిన సమయం. ప్రజాస్వామ్యం బతికితే అప్పుడు ఎన్నికల గురించి ఆలోచించ వచ్చు. ఇది ఒక్క రోజులో తేలే వ్యవహారం కాదు. ఈ సమయంలో సంఘీభావం తెలిపేందుకు వచ్చిన శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు కూడా వచ్చి మద్దతు తెలిపారు. విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లే ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఎవరేం చేసినా ఆగేది లేదు. కచ్చితంగా ప్రజా సమస్యలపై పోరాటం చేసి వారికి అండగా నిలిచేందుకు ప్రజల్లోకి వెళ్తూనే ఉంటాం అని అన్నారు.
• శ్రీ పవన్ కళ్యాణ్ పట్ల దారుణంగా ప్రవర్తించారు: శ్రీ చంద్రబాబు నాయుడు
శ్రీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ.. “ఇటీవల విశాఖలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద ప్రభుత్వం వాళ్లు ప్రవర్తించిన తీరు పట్ల ఆవేదన కలిగి వారిని కలసి సంఘీభావం తెలిపేందుకు రావడం జరిగింది. విమానాశ్రయం నుంచి వస్తుండగా ఆయన ఇక్కడ ఉన్నారని తెలిసి వచ్చాను. విశాఖలో జరిగిన ఘటనల క్రమం చూస్తే మనం ఒక నాగరిక ప్రపంచంలో, ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతుంది. ముందుగా ప్రకటించిన కార్యక్రమం కోసమే శ్రీ పవన్ కళ్యాణ్ గారు విశాఖ వెళ్లారు. రాజకీయ పార్టీలు మీటింగులు పెట్టుకోవాలంటే.. పోలీసులు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలి. అది పోలీసుల బాధ్యత. ముఖ్యమంత్రి,, ప్రతిపక్ష నాయకులు ఒకే ప్రాంతానికి వచ్చినప్పుడు ఇద్దరు ఎదురుకాకుండా పోలీసులే ప్లాన్ చేస్తారు. అలాంటిది ఒక రాజకీయ పార్టీ అధ్యక్షులుగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు విశాఖ వెళ్తే దారుణంగా ప్రవర్తించారు. వారిని తిరగనీయకుండా చేయడం. దాడులు చేసి జనసేన కార్యకర్తల మీదే కేసులు పెట్టడం.. ఆయన దిగిన హోటల్ నుంచి వెళ్లే వరకు వేధించడం.. ఎంత చేయాలో అంత చేశారు. ఇదేనా ప్రజాస్వామ్యం? ర్యాలీ వెళ్తుంటే లైట్లు తీసేస్తారు. ఒక పోలీస్ అధికారి కారెక్కి ముందుకు వెళ్లకుండా నిలబడతారు.
• మీరే సమస్య సృష్టించి తప్పుడు కేసులు పెడతారా?
ఉన్మాద పాలకుడు తన పైశాచిక ఆనందం కోసం తప్పుడు కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. రాత్రంతా హోటల్ లో భయానక వాతావరణం సృష్టించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర పౌరుడు కాదా? విశాఖ పోవడానికి ఆయనకు అర్హత లేదా? చాలా దారుణంగా ప్రవర్తించారు. నోటీసులు ఇచ్చి విశాఖ నుంచి పంపేశారు. లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందంటారు. మీరే లా అండ్ ఆర్డర్ సమస్యను సృష్టిస్తారు. తప్పుడు కేసులు పెట్టి బెదిరిస్తారు.
• కేసులు పెట్టడం.. జైల్లో పెట్టడం.. నిందలు వేయడం..
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు. ప్రజాస్వామ్యం లేకపోతే రాజకీయ పార్టీలకు మనుగడ లేదు. రాజకీయ పార్టీ నాయకులకే రక్షణ లేకపోతే ప్రజలకు ఎక్కడ రక్షణ ఉంటుంది. దాడి చేయడం కేసులు పెట్టడం. జైల్లో పెట్టడం.. మన మీద నిందలు వేయడం.. వ్యక్తిత్వ హననం చేయడం… మనుషుల్ని నిర్వీర్యం చేయడం కోసం ఎన్ని రకాలుగా మాట్లాడాలో అన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు గాని, నేను గాని విమర్శలు చేస్తే ఇష్టానుసారం మాట్లాడడం జరగదు. మాకు పద్ధతి ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు.. మాట్లాడితే కేసులు పెట్టడం. రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు, ప్రజా సంఘాలకు, ప్రజలకు విజ్నప్తి చేస్తున్నా.. 40 ఏళ్లుగా ఎప్పుడూ చూడని రాజకీయాలు చూస్తున్నా.. ప్రజాస్వామ్యం అపహాస్యం అయిపోయింది. మీడియాకు, ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయింది. బాధలు తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఈ వ్యవహారంలో నా మనసు బాధ పడింది. సంఘీభావం తెలపాలని వచ్చాను.
• రాజకీయ పార్టీలుగా బాధ్యత తీసుకుందాం
వైసీపీ అంత నీచమైన పార్టీ, ఇంత దారుణమైన పార్టీని ఎప్పుడూ చూడలేదు. మా ఆఫీస్ మీద దాడి చేస్తే కేసు పెట్టలేదు. తిరిగి మా వాళ్ల మీద కేసు పెట్టే పరిస్థితికి వచ్చారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అని అడుగుతున్నా.. అన్ని రాజకీయ పార్టీలను కోరుతున్నాం. ముందు రాజకీయ పార్టీల మనుగడ కాపాడుదాం. తద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం. తర్వాత ప్రజా సమస్యల మీద పోరాడుదాం. ప్రజా సమస్యల మీద పోరాడినప్పుడు ఎవరికి ఓట్లు వేయాలన్న విషయాన్ని ప్రజలు నిర్ణయించుకుంటారు. రాజకీయ పార్టీల పరిస్థితే ఇలా ఉంటే ప్రభుత్వం తప్పు చేస్తుందన్న విషయం ఎవరికి చెప్పాలి.
• రాజకీయ పార్టీలుగా పోటీ అంశం ఎవరి నిర్ణయం వారిదే
శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టడం తప్పా? ప్రజలు వైసీపీ విన్యాసాలన్నీ చూస్తున్నారు. ఈ ముఖ్యమంత్రి మమ్మల్ని తిట్టించి పైశాచిక ఆనందం పొందుతున్నాడు. శారీరకంగా బాధపడితే ఆనందం పడుతున్నాడు. ఆ ఆనందం శాశ్వతం కాదని హెచ్చరిస్తున్నాం. ఈ విషయం మీద శ్రీ పవన్ కళ్యాణ్ గారితో పాటు అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడుతాం. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం మా కర్తవ్యం. అప్పుడే రాజకీయ పార్టీలు ఉంటాయి. రాజకీయ పార్టీలుగా బాధ్యత తీసుకుంటాం. కొంత మంది పోలీసు అధికారులకి ఒకటే చెబుతున్నాం. తప్పుడు పనులు చేసే వారిని వదిలిపెట్టం. వారిని కంట్రోల్ చేస్తాం. ఈ వ్యవహారంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్ధి సంఘాలు ఏకమవ్వాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారితో అదే మాట్లాడాం. ముందుగా మనం కార్యక్రమాలు చేయగలిగితే రాజకీయ పార్టీలుగా ఎలా పోటీ చేయాలి అనే అంశం వారే నిర్ణయించుకుంటారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటం కొనసాగుతుంది. ముందుకు వెళ్తాం. కౌలు రైతులకు ఆర్ధిక సాయం అందించే స్వేచ్ఛ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి లేదా? ఆయనకు జరిగిందని ఇంట్లో పడుకుంటే రేపటి రోజున మీకు జరిగినప్పుడు మాట్లాడే వారు ఉండరు. కాబట్టి అందరూ ఈ పాలకులను నిలదీయాలి” అన్నారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, పీఏసీ సభ్యులు శ్రీ నాగబాబు గారు పాల్గొన్నారు.