బుసక అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలి.. జనసేన డిమాండ్

అవనిగడ్డ నియోజకవర్గం, పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తూ సీ.ఆర్.జడ్ పరిధిలో అక్రమ బుసక తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ నాయకులు బాసు నాంచారయ్య నాయుడు, జనసేన జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ డిమాండ్ చేసారు. మోపిదేవి మండలం, ఉత్తర చిరవోలులంకలో ఇటీవల జరిగిన అక్రమ బుసక తవ్వకాలను జనసేన నాయకులు మోపిదేవి మండల జనసేన పార్టీ అధ్యక్షులు పూషడపు రత్నగోపాల్ ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్బంగా జనసేన నాయకులు బాసు నాంచారయ్య నాయుడు, రాయపూడి వేణుగోపాల్, బచ్చు వెంకటనాధ్, పూషడపు రత్నగోపాల్ మాట్లాడుతూ కృష్ణానది గర్భంలో సీ.ఆర్.జడ్ పరిధిలోని ప్రదేశంలో పర్యావరణానికి తీవ్రమైన విఘాతం కలిగిస్తూ బుసక తవ్వకాలకు పాల్పడి జీవ వైవిధ్యానికి విఘాతం కలిగించారన్నారు. నది పరివాహక చట్టాన్ని, వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి కృష్ణానది గర్భంలో అక్రమార్కులు పాల్పడిన ఈ నేరపూరిత చర్యపై అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఆర్.సీ అధికారులు ఈ తవ్వకాల గురించి రెవిన్యూ, పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకూ జాయింట్ ఇన్స్ పెక్షన్ చేయకపోవటం అధికార పార్టీకి కొమ్ము కాసినట్లు తెలుస్తోందన్నారు. అధికార పార్టీతో అధికారులు సాగిస్తున్న ఈ కుమ్మక్కు వ్యవహారంపై రాష్ట్ర హైకోర్టులో రిట్ దాఖలు చేస్తామని ప్రకటించారు.