చురుకైన ఏజెంట్లను ఎంపిక చేయాలి: కేటీఆర్‌

గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ వేళ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అప్రమత్తమయ్యారు. శుక్రవారం ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ముఖ్య నాయకులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిగిన నేపథ్యంలో కౌంటింగ్ లో పాల్గొనే ఏజెంట్లు అప్రమత్తంగా ఉండే చురుకైన వారు ఉండేలా చూసుకోవాలని.. లేకపోతే ఓట్ల లెక్కింపు ఫలితాల్లో తేడా కొట్టే అవకాశం ఉంటుందని కేటీఆర్ దిశానిర్ధేశం చేశారు. ప్రతి ఓటు విలువైనదిగా కౌంటింగ్‌ ఏజెంట్లు భావించాలని చెప్పారు. పోలింగ్‌ బూత్‌లవారీగా ఎంపిక చేసిన కౌంటింగ్‌ ఏజెంట్లకు తగిన సూచనలు ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, టీఎస్‌ఐఐసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ పాల్గొన్నారు.