వైసీపీ హామీలన్నీ పొంజీ స్కీములే

• ప్రజల ఆశలతో ఆడుకుంటున్నారు
• సంక్షేమం పేరుతో అభివృద్ధిని విస్మరిస్తున్నారు
• రాష్ట్రంలో శ్రీలంక పరిస్థితులు రావొచ్చు?
• మళ్ళీ వైసీపీకి ఓటు వేస్తే ప్రమాదం
• యువ శక్తికి తోడ్పాటు అందించే ప్రభుత్వ ఏర్పాటే జనసేన లక్ష్యం
• రాష్ట్రంలో ఐటీ సంబంధిత రంగాల అభివృద్ధి…. యువత ఉపాధికీ జనసేన కట్టుబడి ఉంది
• మంగళగిరిలో నిర్వహించిన జనసేన ఐ.టి. సదస్సులో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్

అప్పులు తెచ్చి అభివృద్ధి అనడం… సంక్షేమ పథకాలతో ప్రజలను మభ్యపెట్టడం అంటే ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడమేనని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలకు జనసేన పార్టీ వ్యతిరేకం కాదని, సంక్షేమ పేరుతో అభివృద్ధిని విస్మరించడాన్ని మాత్రం వ్యతిరేకిస్తుందని అన్నారు. అతి త్వరలో రాష్ట్రంలో శ్రీలంక పరిస్థితులు రావొచ్చని, అలా రాకూడదనే కోరుకుంటున్నానని తెలిపారు. ప్రజలు ఆగ్రహంతో రోడ్ల మీదకు వస్తే ఎంతటి బలమైన నాయకుడైనా నేలకొరగాల్సిందేనని హెచ్చరించారు. జనసేన పార్టీ ఐ.టి. విభాగం రాష్ట్ర స్థాయి సదస్సు ఆదివారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “ఒక తరానికి బాధ్యత గుర్తు చేయడానికి, మరో తరాన్ని మేల్కొలపడానికి జనసేన పార్టీ స్థాపించాను. జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి వచ్చే నాయకులకు ఓ విషయం స్పష్టంగా చెబుతాను.. ఒక ఎలక్షన్ కోసమైతే పార్టీలోకి రావొద్దని చెబుతాను. విలువలు లేని వ్యక్తులతో పార్టీ నడిపితే అది విచ్ఛిన్నానికి దారి తీస్తుంది. మనం సమాజానికి మంచి చేయకపోయినా ఫర్వా లేదుగానీ చెడు మాత్రం చేయకూడదు.
• ఆ పుస్తకం నాపై తీవ్ర ప్రభావం చూపింది
జనసేన పార్టీ పెట్టడానికి కారణం కేవలం సమాజం నుంచి తీసుకోవడం కాదు.. ఎంతో కొంత ఇవ్వాలి అన్నటువంటి ఆలోచనలు. 18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఫ్రెంచ్ రచయిత డొమినిక్ లాపెర్, అమెరికన్ రచయిత లారీ కొలిన్స్ రాసిన ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్’ పుస్తకం చదివాను. చిన్న వయసులో చదవడం వల్ల ఆ పుస్తకం నన్ను చాలా కుదిపేసింది. స్వాతంత్ర్య దినోత్సవం అనగానే స్కూల్లో చాక్లెట్లు పంచుతారు.. జెండా ఆవిష్కరణ చేస్తాం.. మన నాయకుల గురించి మాట్లాడుకుని వెళ్లిపోతాం. అయితే ఆ పుస్తకంలో స్వాతంత్ర్యం కోసం కలసి ఉమ్మడి పోరాటం చేసి.. అది సిద్ధించినప్పుడు మత ప్రాతిపదికన విడిపోయిన విషయాన్ని రాసిన విధానం నన్ను కదిలించింది. మన స్వాతంత్ర్య దినోత్సవాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటాం. అది ఎప్పటి నుంచో వస్తుంది కాబట్టి. అయితే ఫ్రీడం ఎట్ మిడ్ నైట్ పుస్తకాలు చదవడం వల్ల బాధ్యత కలిగింది. మనం ఎప్పుడూ తీసుకోవడం కాదు ఇవ్వడానికి కూడా ఉన్నామనిపించింది. భారత దేశంలో ఈ రోజు మనమంతా ఇలా కూర్చుని మాట్లాడుకుంటున్నామంటే అందు కోసం ఎంత రక్తపాతం జరిగింది.. ఎంత మంది ప్రాణాలు కోల్పోయారు… ఎంతో మంది తరాలుగా ఉన్న ఊళ్లు వదిలి దేశాలు దాటి తరలిపోవాల్సి వచ్చింది… ఇవన్నీ చదువుతున్నప్పుడు ప్రతి తరం బాధ్యతతో ముందుకు వెళ్లాలన్న విషయం తెలుస్తుంది. 1980ల్లో ఖలిస్థాన్ ఉద్యమాలు, ఉగ్రవాద ఉద్యమాలు, 1990ల్లో జిహదీ ఉద్యమాలు, కులపోరాటాలు చూస్తే భయం వేస్తుంది. ఎలాంటి స్వార్ధం లేకుండా తమ జీవితాలు పణంగా పెట్టిన వ్యక్తుల త్యాగం ఏం చేస్తున్నామన్న బాధ కలిగింది.
• బెలుచిస్థాన్ లో శివరాత్రి… కరాచీలో దసరా చేసేవాళ్లు
భారతదేశం నుంచి పాకిస్థాన్ విడిపోయినప్పుడు జరిగిన వలసలు ప్రపంచంలో ఎప్పుడు జరగలేదు. కోటి 80 లక్షల నుంచి రెండున్నర కోట్ల మంది ప్రజలు ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి… ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వలస పోయారు. సొంత ఇళ్లు, భూమి, బంధుత్వాలు, బంధాలు వదులుకొని వచ్చేశారు. 15 లక్షల మందికిపైగా దారుణంగా హత్యకు గురయ్యారు. 75 వేల మంది మహిళలు మానభంగానికి గురయ్యారు. చంపేయబడ్డవారిలో 3 నుంచి 4 లక్షల మంది వరకు ముస్లింలు కాగా… మిగతా వారు హిందువులు, సిక్కులు. భారతదేశం నుంచి పాకిస్థాన్ వెళ్లే ట్రైన్ లో … అటు నుంచి ఇటు వచ్చే ట్రైన్ లో శవాల గుట్టలు. ఇంత దారుణంగా, రక్తపాతంతో జరిగింది దేశ విభజన. అంతకుముందు బెలుచిస్థాన్ లో శివరాత్రి ఘనంగా చేసుకునే వాళ్లం. కరాచీలో దసరా ఉత్సవాలు చేసేవాళ్లం. సింధు ప్రాంతమంతా మెజార్టీ హిందువులే ఉండేవారు. ఇప్పడా పరిస్థితులు లేవు. జోగేంద్రనాథ్ మండల్ పాకిస్థాన్ ను నమ్మి భారతదేశం నుంచి విడిపోయారు. ఆయన కళ్ల ముందే ఆయన నియోజకవర్గంలోని ప్రజలను 10 వేల మందికి పైగా చంపేశారు. దాదాపు 3 లక్షల మంది అణగారిన వర్గాలను ఇస్లాంలోకి మార్చేశారు. ఇదే విషయాన్ని ఇటీవల పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా చెప్పారు.
• భారతదేశం డీఎన్ఏలోనే సంస్కారం ఉంది
మనం మాట్లాడే ముందు నమాజ్ వినిపిస్తే కాసేపు మాట్లాడకుండా ఆగిపోతాం. మంగళగిరి కార్యాలయ ప్రాంగణంలో ఓసారి ప్రసంగిస్తుండగా నమాజ్ వినిపించింది. ఆ నమాజ్ అయ్యేవరకూ మాట్లాడటం ఆపేశాం. అదీ మనం ఇతర మతాలకు ఇచ్చే గౌరవం. ఈ మట్టిపై జీవించే మనుషుల మంచితనం, గుణమే చూస్తాం తప్ప మతం చూడం. ఇతర మతాలను గౌరవించడం మన దేశ డీఎన్ఏలోనే ఉంది. ఈ దేశం తాలుకు మూల సిద్ధాంతమే అందరినీ సమానంగా చూడటం. పాకిస్థాన్ లో ఒక హిందూ క్రికెట్ ప్లేయర్ అయితే పెద్ద న్యూస్. ఈ మధ్య ఒక హిందూ మహిళ పోలీస్ అధికారి అయితే పెద్ద న్యూస్ అయింది. అదే మనదేశం ఒక ముస్లింను రాష్ట్రపతిని చేసింది. శ్రీకృష్ణదేవరాయలవారి కాలంలో ముస్లీంల కోసం ప్రత్యేకంగా మసీదులు కట్టారు. అలాగే చత్రపతి శివాజీ బీజపూర్ ను ఆక్రమించుకున్నప్పుడు అక్కడున్న మహిళలను గౌరవంగా సాగనంపాడు. జాతీయ సమగ్రతను కోల్పోయి మతానికి ప్రాధాన్యత ఇస్తే దేశం విచ్ఛిన్నం అయిపోతుంది.
• వైసీపీవి అన్నీ పొంజీ స్కీములే
పది రూపాయలు పెట్టుబడి పెడితే 48 గంటల్లో రూ.40 అయిపోతాయి… ఐదు రోజుల్లో రూ.100 అయిపోతాయని మనుషుల్ని అత్యాశకు గురి చేసి ముంచడం చేస్తే వాటిని పొంజీ స్కీమ్ లు అంటారు. ఉదాహరణకు అగ్రి గోల్డ్ లాంటివి. ఇలాంటివి వ్యక్తులు చేస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు అదే పని చేస్తోంది. ఈ రోజు వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చేందుకు ఇచ్చిన హామీలు పొంజీ స్కీమ్స్ తరహాలోనివే. అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధం చేస్తామని, వారం రోజుల్లో సీపీఎస్ విధానం రద్దు చేస్తామని, యువతకు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ఉచితంగా ఇసుక అందిస్తామని హామీలు గుప్పించి ప్రజల ఆశలతో ఆటలాడుకున్నారు. ఏదో అద్భుతాలు జరిగిపోతాయని పార్టీ పెట్టలేదు. దెబ్బలు తిన్నా ప్రజల కోసం నిలబడాలని రాజకీయాల్లోకి వచ్చాను. కిందమీద పడితే అధికారం ఎలాగోలా వచ్చేస్తుంది. కానీ అనుభవం లేకుండా అధికారం వచ్చేస్తే అది వైసీపీ పాలనలా ఉంటుంది. మనల్ని వెతుక్కుంటూ పదవి రావాలి తప్ప… దాని వెంట మనం పడకూడదు. స్వాతంత్ర్య ఉద్యమం స్ఫూర్తితో పొంజీ స్కీమ్ నడిపిస్తోన్న వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేయాలి.
• సంక్షేమ పథకాలకు జనసేన వ్యతిరేకం కాదు
సంక్షేమ పథకాలకు జనసేన పార్టీ వ్యతిరేకం కాదు. కానీ సంక్షేమ పథకాల మీదే వ్యవస్థను నడుపుతామంటే ఎలా? లక్షల కోట్లు అప్పులు తెచ్చి అదే అభివృద్ధి అంటే ఎలా? సంపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చు చేయలేం. అలాగే పండించిన పంట కంటే ఎక్కువ పంచలేం. అప్పులు తీసుకొచ్చి సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుంది. ఒక వైపు సుప్రీం కోర్టు, ఇంకోవైపు కాగ్ చెబుతున్నా పట్టించుకోవడం లేదు. అతి త్వరలో ఏపీలో శ్రీలంక పరిస్థితులు రావొచ్చు. అక్కడ వరకు రాకూడదనే కోరుకుంటున్నాను. లక్షల కోట్ల డబ్బు, వేల కొలదీ రౌడీలు ఉన్నారు… మేము ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటే పొరపాటే… ప్రజలు కోపంతో రోడ్ల మీదకు వస్తే తట్టుకోలేరు. శ్రీలంకలో అధ్యక్షుణ్ణి దేశం నుంచి పంపించేశారు. అతని భవనాన్ని ప్రజలు స్వాధీనం చేసుకున్నారు. గడాఫీ వంటి నియంతలను కొట్టి చంపేశారు. మోసం చేసే నాయకులు, మభ్యపెట్టే నాయకులు కావాలి? కష్టం వస్తే భుజం కాసే నాయకులు కావాలా? అనేది ప్రజలే నిర్ణయించుకోవాలి.
• ఐటీ రంగం అభివృద్ధి జనసేన సంకల్పం
రాష్ట్ర విభజన అనంతరం రాయలసీమ యువత హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు వలసపోతున్నారు. ఈ రోజు మాట ఇస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి వస్తే.. ఏ ఒక్కరు బయటకు వలస వెళ్లే పరిస్థితే ఉండదు. పక్క రాష్ట్రాలతో ఆరోగ్యకరమైన పోటీ ఉండేలా ఐ.టి పరిశ్రమను ఇక్కడే అభివృద్ధి చేస్తాం. యాప్ డెవలప్ చేసే సమర్థత, స్థాయి ఉన్న వ్యక్తులను గుర్తించి వారికి రూ. 10 లక్షలు ప్రభుత్వం తరఫున సాయం అందిస్తాం. సొంత ఆఫీసులు పెట్టి ఓ పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి తీసుకెళ్తాం. నా భవిష్యత్తుపై నాకు బెంగలేదు. వచ్చే తరాలకు కాలుష్యం లేని ప్రకృతి వనరులు అందించాలనే తపన తప్ప. పంచాయతీల నిధులు పంచాయతీలకే ఖర్చు చేయాలి. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలి. జనసేన పార్టీకి ఒక్క ఎంపీ సీటు ఉన్నా పార్లమెంటులో దీనిపై ప్రైవేటు బిల్లు ప్రవేశ పెట్టేవాడిని.
• వచ్చే ఎన్నికల్లో బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించండి
2019లో వైసీపీ నాయకుల గురించి ప్రజలు చాలా గొప్పగా ఆలోచించారేమో ఓట్లు వేశారు.. వాళ్లు ప్రజలకు మొండి చెయ్యి చూపించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు భిన్నంగా ఆలోచించి ఓటు వేసే ముందు వారి బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే అది ఎటు దారి తీస్తుందో చెప్పలేం. ఈసారి ప్రతి ఓటు జాగ్రత్తగా వేయండి. జనసేన పార్టీ రాష్ట్రానికి, దేశానికి మంచి చేయగలదన్న నమ్మకంతో మద్దతివ్వండి, నా మీద పెట్టిన నమ్మకాన్ని త్రికరణ శుద్దిగా ముందుకు తీసుకువెళ్తాను. ఒక రాజకీయ పార్టీని నడపడం చాలా కష్టసాధ్యమైన విషయం. ఎదుటివాడితో యుద్ధం చేద్దామంటే మన పక్కవాడు మనల్ని పట్టుకుని లాగుతూ ఉంటాడు. ఏదైనా మాట్లాడితే అది జరుగుతుందా? అంటూ నిరుత్సాహపరుస్తారు. సినిమాల్లోకి రాకపోయి ఉంటే ఏమయ్యేవాడిని అంటే ఏం చెబుతాం. ఒకరి స్థాయిని మనం ఎప్పుడూ నిర్ణయించలేము. మానవుడు మహనీయుడు. అలాంటి మానవుడ్ని ఇంతే అని నేనెప్పుడూ చెప్పను. నేను కోరుకుంటుంది ఒకటే మన దేశానికి ఒక బలమైన యువశక్తి ఉండాలి. అలాంటి యువశక్తికి తోడ్పాటు అందించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నదే జనసేన ముఖ్య ఉద్దేశం. దీంతో పాటు ముఖ్యంగా దివ్యాంగుల్ని ప్రత్యేకంగా చూడాలి. వారి కాళ్ల మీద వారు నిలబడే స్థాయికి తీసుకురావాలి. వారిలో ఒక స్టీఫెన్ హాకింగ్స్ ఉండొచ్చు. వీరితో పాటు మహిళా శక్తికి అవకాశం ఇస్తే వారు ఒక స్థాయిలో ఉంటారు. అందుకే సమర్ధత, ఇంటిగ్రిటీ ఉన్న వ్యక్తులు ఎదగడానికి అనుకూలమైన రాజకీయ వాతావరణం కల్పించాలన్నదే నా ఆలోచన.
• జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే ఇది కాదు
మాట్లాడితే చాలా మంది నాయకులు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని చెబుతారు. నేనెప్పుడూ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని చెప్పలేదు. ఓట్లు కొనకూడని రాజకీయం కావాలి అని మాత్రమే చెప్పాను. నేనసలు రూపాయి కూడా ఖర్చు పెట్టని రాజకీయం అని ఎప్పుడూ చెప్పలేదు. కొంతమంది ఎంత కన్వీనెంట్ గా అయిపోయారంటే గత ఎన్నికల్లో రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. రూపాయి పెట్టి ఓట్లు కొనమని నేను చెప్పను. పక్కన తిరిగే వారికి కాఫీలు, టీలు కూడా ఇవ్వలేదు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే మిమ్మల్ని నాయకుల్ని చేయడానికి మేమే కష్టపడి, మేమే చమటోడిస్తే నువ్వేం చేస్తావ్. మీకు జనం ఓట్లు వేస్తారా? చాలా మంది పెద్ద స్థాయి వ్యక్తులు మీరే కదా సర్ డబ్బు ఖర్చు పెట్టవద్దన్నారు అని అడిగారు. మీకు అలా అర్ధం అయ్యిందా అనిపించింది. కష్టపడకుండా నాయకులుగా ఎదిగేద్దాం అనుకునే వారికి మీ స్థాయిలో మీరు అర్థమయ్యేలా చెప్పండి” అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *