అమూల్….ఆర్భాటమే అంతా!

*ప్రభుత్వం దన్నుగా ఉన్నా పాల సేకరణలో అథమం
*సహకార డెయిరీలకన్నా తక్కువ చెల్లిస్తున్న వైనం

పాడి రైతులకు లీటరుకు రూ.5 నుంచి రూ.10 అదనంగా చెల్లించేందుకే అమూల్ డెయిరీని ఏపీకి ఆహ్వానించాం…. సీఎం జగన్ రెడ్డి చెబుతున్న మాట ఇది. అయితే గడచిన 25 నెలలుగా ఏపీలో పాలు సేకరిస్తోన్న అమూల్ డెయిరీ రైతులకు సీఎం చెప్పిన విధంగా అదనంగా చెల్లిస్తోందా? అంటే లేదనే సమాధానం వస్తోంది. కనీసం సహకార సంఘాలు చెల్లిస్తున్న మాదిరి అమూల్ కూడా రైతులకు ఇస్తోందా? అంటే అది కూడా లేదనే సమాధానం వస్తోంది. సహకార డెయిరీల తరహాలో బోనస్ చెల్లిస్తుందా? అంటే అది కూడా లేదనే సమాధానం వస్తోంది. అందుకే ప్రభుత్వంతోపాటు వేలాది మంది అధికారుల నుంచి వాలంటీర్ల వరకు అమూల్ సేవలో తరిస్తున్నా వారి పాల సేకరణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది.
*అమూల్ పై ఎందుకంత ప్రేమ
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గుజరాత్ కు చెందిన అమూల్ డెయిరీని రాష్ట్రానికి ఆహ్వానించారు. అమూల్ కు పాలసేకరణ చేసి పెట్టే పనిలో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, పశు వైద్యులు, వాలంటీర్లు తరిస్తున్నారు. 9899 గ్రామాల్లో పాల సేకరణ కోసం మహిళా సహకార సంఘాలను ఏర్పాటు చేశారు. ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్లు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ల భవనాల నిర్మాణాల కోసం అప్పు చేసి మరీ ప్రభుత్వం రూ.3000 కోట్లు ఖర్చు చేసింది. పాల ఉత్పత్తుల అమ్మకానికి నగరాల్లో హబ్ ల ఏర్పాటుకు ఉచితంగా స్థలాలు ఇచ్చారు. 2020 డిసెంబరులో అమూల్ మొదటిసారిగా ఏపీలో పాల సేకరణ ప్రారంభించింది. పెద్ద ఎత్తున ప్రభుత్వ సహకారం అందిస్తున్నా, నేటికీ అమూల్ రోజువారీ పాల సేకరణ కేవలం 1.70 లక్షల లీటర్లు మాత్రమే. అమూల్ రావడం వల్లే డెయిరీల మధ్య పోటీ పెరిగి పాల సేకరణ ధర పెరిగిందని పాలకులు చెబుతున్నా అందులో పసలేదు.
*అప్పులు తెచ్చి మరీ అమూల్ కు సేవలు
అమూల్ సేవలో ప్రభుత్వం తరిస్తోంది. రూ.3000 కోట్లు అప్పుచేసి మరీ అమూల్ కోసం ఖర్చు చేయడమే కాకుండా, ఎన్నో విలువైన ప్రభుత్వ స్థలాలను ఆయాచితంగా కట్టబెట్టారు. పాలల్లో వెన్న శాతం, పాల నాణ్యత పరీక్షించేందుకు ఒక్కోటి రూ.12.81 లక్షల విలువైన యంత్రాలను 11,711 గ్రామాల్లో పంపిణీ చేశారు. పాల సేకరణ కేంద్రాల కోసం ఒక్కో దానికి 3.5 సెంట్ల చొప్పున స్థలం కేటాయించారు. పాలను శీతలీకరించి నిల్వ చేసేందుకు ఒక్కోటి రూ.20.42 లక్షల వ్యయంతో తొలి దశలో 4,796 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు ఏర్పాటు చేశారు. ఇందుకు ఒక్కో యూనిట్ కోసం 5 సెంట్ల స్థలం ఇచ్చారు. వీటి ఏర్పాటు కోసం ప్రభుత్వం రూ.2,500 కోట్లకు పైగా ఖర్చు చేసింది. ఈ మొత్తంలో రూ.1360 కోట్లను జాతీయ సహకార బ్యాంకు నుంచి అప్పుగా తీసుకున్నారు. డెయిరీలు, పాలు సేకరించే కేంద్రాల్లో ఇతరత్రా సౌకర్యాల కోసం చేసిన ఖర్చు కూడా కలుపుకొని చూస్తే ఈ మొత్తం రూ.3000 కోట్ల పై మాటే.
*ఎవరు ఎన్ని పాలు సేకరిస్తున్నారు
ఏపీలో రోజుకు 412 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోంది. ఇందులో చిరు వ్యాపారులు 220 లక్షల లీటర్లు, ప్రైవేటు డెయిరీలు 48.5 లక్షలు, సహకార డెయిరీలు 22 లక్షలు, అమూల్ 1.70 లక్షల లీటర్లు సేకరిస్తున్నాయి. మొత్తం 3108 గ్రామాల్లోని 2.55 లక్షల మంది రైతుల వద్ద నుంచి గడచిన 25 నెలలుగా అమూల్ పాలు సేకరిస్తోంది. అమూల్ రోజుకు సేకరిస్తున్నది కేవలం 1.70 లక్షల లీటర్లు మాత్రమే. అదే విజయా డెయిరీ రోజుకు 9 లక్షల లీటర్లు, సంగం డెయిరీ రోజుకు 6 లక్షల లీటర్లు, కృష్ణా మిల్క్ యూనియన్ 3.5 లక్షల లీటర్లు సేకరిస్తున్నాయి. ఎక్కడ ధర ఎక్కువ వస్తే వారికే రైతులు పాలు పోస్తారు. ఒత్తిడి తీసుకు వచ్చినంత మాత్రాన రైతులు తక్కువ ధర ఇచ్చే వారికి పాలు పోయరని ప్రభుత్వానికి, అధికారులకు తెలియదా….
*ఆయాచితంగా ఆస్తులు కట్టబెట్టారు
విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి పట్టణాలు, ఇతర నగరాలు, గ్రామాలు, రహదారి కూడళ్లలో అమూల్ పాల విక్రయ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం ఉచితంగా స్థలాలు కేటాయించింది. అమూల్ కు సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సహకార అభివృద్ధి బ్యాంకు నుంచి 6.5 శాతం వడ్డీకి అప్పు తీసుకువచ్చింది. ఇందులో వడ్డీ రాయితీ పోను 4 శాతం వడ్డీ చెల్లించాలి. చేయూత పథకం ద్వారా ప్రభుత్వం 3 దశల్లో పాడి రైతులకు రూ.6551 కోట్ల రుణాలిప్పించింది. ఈ రుణాలతో రైతులతో గేదెలు కొనిపించారు. ఆ పాలను అమూల్ కే పోయాలనే నిబంధన పెట్టారు. దీని ద్వారా 22 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి పెరుగుతుందని అంచనా వేశారు. అమూల్ డెయిరీకి ప్రభుత్వ ఆస్తులు కట్టబెట్టడమే కాక, పొదుపు సంఘాలపై అధికారులతో ఒత్తిడి తీసుకువచ్చి, బలవంతంగా అమూల్ కు పాలు పోయిస్తున్నారు. కొందరు కింది స్థాయి సిబ్బంది, అధికారుల ఒత్తిడి తట్టుకోలేక ఇతర డెయిరీల నుంచి కొనుగోలు చేసి మరీ అమూల్ డెయిరీలో పాలు పోస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు.
*అంతా మావల్లే….
అమూల్ డెయిరీ పెట్టడం వల్లే డెయిరీల మధ్య పోటీ పెరిగిందని, దీని వల్ల పాడి రైతులకు లీటరుకు రూ.5 నుంచి రూ.10 అదనంగా ఆదాయం వస్తోందని సీఎం జగన్ రెడ్డి సమావేశాల్లో చెబుతున్నారు. వెన్నశాతం 6.8, ఎస్ఎన్ఎఫ్ 8.7 శాతం ఉంటే లీటరుకు అమూల్ రూ.47.5 అందిస్తోంది. ప్రోత్సాహకాలు కలిపినా అది లీటరుకు రూ.49 మించదు. అదే కృష్ణా మిల్క్ యూనియన్ లీటరుకు రూ.53.04 ఇస్తోంది. దీనికి అదనంగా లీటరుకు రూ.5 బోనస్ కలిపి మొత్తంగా రూ.58పైనే చెల్లిస్తోంది. కృష్ణా జిల్లాలోని తేలప్రోలు సహకార సంఘం అదనంగా వచ్చే అదాయాన్ని రైతులకు బోనస్ గా ఇచ్చింది. ఇలా లీటరుకు రూ.5 అదనంగా వచ్చినట్టయింది. అంటే అమూల్ ఇచ్చే ధర కంటే తేలప్రోలు పాల సంఘం లీటరుకు అదనంగా రూ.15 చెల్లించింది. సహకార సంఘాలు లీటరుకు రూ.5 నుంచి రూ.15 వరకు అదనంగా చెల్లిస్తూ ఉంటే అమూల్ డెయిరీకి పాలు పోయమంటే ఎవరు పోస్తారు. అందుకే అధికారులు ఎంత ఒత్తిడి తెచ్చినా ఫలితం లేకుండా పోయింది.
*సహకార డెయిరీల సేవలు
రాష్ట్రంలో సహకార రంగంలో 5 దశాబ్దాలుగా డెయిరీలు పాడి రైతులకు సేవలు అందిస్తున్నాయి. పాడి గేదెలు కొనుగోలు చేసుకునేందుకు తక్కువ వడ్డీకే రుణాలిస్తున్నాయి. పశువులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. పాలు పోసే రైతులతో పాటు, పశువులకు ఉచిత బీమా అందిస్తున్నాయి. నాణ్యమైన పశువుల వీర్యం ఉచితంగా ఇస్తున్నారు. వీటికి అదనంగా పాడి రైతుల కుటుంబాల్లో చదువుకునే పిల్లలకు ఆర్థికసాయం, పెళ్లిళ్లకు సాయం చేస్తున్నారు. అమూల్ మాత్రం ఏడాదిలో 180 రోజులు పాలు పోసిన రైతులకు కేవలం ఇన్సెంటివ్ ఇచ్చి చేతులు దులిపేసుకుంటోంది.
*సౌకర్యాలు కల్పిస్తే లీటరుకు మరో రూ.10 అదనంగా ఇస్తాం
డెయిరీ వ్యాపారం ప్రారంభించాలంటే గ్రామాల్లో పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. వాటికి మిషనరీ, భవానాలు అవసరం అవుతాయి. ఇక పాల నిల్వకు బల్క్ మిల్క్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలి. ఇవన్నీ సమకూర్చుకోవాలంటే లీటరుకు నిర్వహణ వ్యయం రూ.10 అవుతుందని అంచనా. ఇవన్నీ ఏపీ ప్రభుత్వం భరిస్తూ మూతపడ్డ సహకార రంగంలోని డెయిరీలను, యంత్రాలను 99 సంవత్సరాలకు అతి తక్కువ ధరకు అమూల్ కు లీజుకు ఇచ్చారు. ఇన్ని చేసినా అమూల్ రైతులకు తక్కువ ధర చెల్లిస్తోంది. ఈ సౌకర్యాలన్నీ సహకార సంఘాలకే కల్పిస్తే ప్రస్తుతం ఇస్తున్న ధర కన్నా మరో రూ.10 అదనంగా చెల్లించగలమని సంఘాల నేతలు చెబుతున్నారు.
*సహకార డెయిరీలను దెబ్బతీసేందుకేనా….
ఏపీలో 5 దశాబ్దాలుగా సహకార రంగంలో పాల డెయిరీలు పాతుకు పోయాయి. రైతులకు సేవలందించడంలో సహకార డెయిరీలు చాలావరకు సఫలీకృతం అయ్యాయి. గతంలో వైఎస్ అధికారంలోకి వచ్చిన సమయంలో ఈ సహకార డెయిరీలను ప్రభుత్వపరం చేయాలని ప్రయత్నించి విఫలం అయ్యారు. వైఎస్ తనయుడు జగన్ రెడ్డి కూడా అదేబాటలో పయనిస్తున్నారు. సహకార డెయిరీలను స్వాధీనం చేసుకుని తీరుతామని మంత్రులు ఛాలెంజ్ చేస్తున్నారు. కోర్టులు మొట్టికాయలు వేసినా వారు మారడం లేదు. దీనికితోడు ప్రతిపక్ష నాయకుడి కుటుంబానికి చెందిన హెరిటేజ్ డెయిరీ వ్యాపారాన్ని దెబ్బతీసేందుకు అమూల్ డెయిరీ సేవలో ప్రభుత్వం తరిస్తోందనే వాదన వినిపిస్తోంది.