రైతు చట్టాలపై పోరుకు అన్నాహజారే సిధ్ధం

రైతు చట్టాలపై పోరుకు అవినీతివ్యతిరేక ఉద్యమకారుడు, సోషల్ యాక్టివిస్ట్ అన్నాహజారే సిధ్దమయ్యారు. ఈ నెల 30 నుంచి నిరశనకు దిగుతానని తెలియజేస్తూ కేంద్రానికి లేఖ రాశారు. వివాదాస్పద చట్టాలు ప్రజాస్వామ్య అనుకూల వ్యతిరేకమైనవని, చట్టాల రూపకల్పనలో ప్రజల భాగస్వామ్యం అవసరమని ఆయన అన్నారు. ఇప్పటికే అన్నదాతలు చేస్తున్న ఆందోళనలు దాదాపు రెండు నెలలలకు చేరువవుతున్నాయని ఆయన చెప్పారు. గతంలో కూడా వీరి ప్రయోజనాలకోసం తాను దీక్ష చేసిన విషయాన్ని అన్నాహజారే గుర్తు చేశారు. వ్యవసాయంపై స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని ఆయన కోరారు. అటు-పూణెకి సుమారు 120 కి.మీ. దూరంలోని అహ్మద్ నగర్ లో గల రాలెగావ్ సిద్దిఖీ గ్రామంలో అన్నాహజారేను మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ కలిశారు. రైతు చట్టాలపై ఆయన డిమాండ్లను కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మీతో మాట్లాడవలసిందిగా తనను కోరారని, అన్నదాతల కోర్కెలపై సానుకూల పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారని ఆయనకు తెలిపారు.

అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ తను దీక్ష చేస్తానని అన్నాహజారే స్పష్టం చేశారు. ఈ నెల 30 లోగా అన్నదాతల డిమాండ్లకు పరిష్కారం లభించగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.