అన్నమయ్య డ్యాం ప్రమాదం మానవ తప్పిదమో? ప్రకృతి వైపరీత్యామో? సీఎంకు తెలుసు

* అన్నీ తెలిసే ఎంక్వైరీ రిపోర్టును తొక్కి పెట్టారు
* జల ప్రళయానికి ఏడాది పూర్తయినా బాధితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు
* సొంత జిల్లాకు ఇచ్చిన హామీలనే నెరవేర్చలేని శ్రీ జగన్ రెడ్డికి సీఎంగా కొనసాగే అర్హత లేదు
* రూ.కోటి ఖర్చు చేస్తే 44 మంది ప్రాణాలు నిలబడేవి
* ఏడాదైనా వరద బాధితుల కష్టాలు తీరలేదు
* బాధితులకు అండగా జనసేన పార్టీ ఉంటుంది
* నెల రోజుల్లో సమస్యలు పరిష్కరించకపోతే కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తాం
* తిరుపతి మీడియా సమావేశంలో మాట్లాడిన జనసేన పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

అన్నమయ్య డ్యాం ప్రమాదం జరిగి ఏడాది పూర్తయినా.. ప్రభుత్వం కనీసం బాధితులకు నిలువ నీడ ఏర్పాటు చేయలేకపోయిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఆవేదన వ్యక్తం చేశారు. మూడు నెలల్లో ఇళ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి… ఏడాదిగా కనిపించడం మానేశారని అన్నారు. సొంత జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీనే నిలబెట్టుకోలేని శ్రీ జగన్ రెడ్డి గారు… ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అర్హత కోల్పోయారని చెప్పారు. జల ప్రళయానికి కారణం తెలిసినా ముఖ్యమంత్రి ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఎంక్వైరీ రిపోర్టును ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. అన్నమయ్య డ్యాం ప్రమాదం మానవ తప్పిదమా? లేక ప్రకృతి వైపరీత్యామా? అనేది ముఖ్యమంత్రి గారికి తెలుసు అన్నారు. బాధితులకు నెల రోజుల్లో న్యాయం జరగకపోతే బాధితులతో కలిసి కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. శనివారం సాయంత్రం తిరుపతి విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “అన్నమయ్య డ్యాం ప్రమాదంలో 44 మంది మృత్యువాత పడ్డారు. పంటపొలాలు, పశువులు బలయ్యాయి. జళ ప్రళయానికి ఏడాది పూర్తయినా బాధితులకు ఇచ్చిన హామీలు ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రభుత్వం నెరవేర్చలేకపోయింది. స్వయంగా ముఖ్యమంత్రే ఈ ప్రాంతంలో పర్యటించి మూడు నెలల్లో ఇళ్లు కట్టించి ఇస్తాం.. నేనే వచ్చి తాళాలు అందిస్తానని చెప్పారు. ఘోరం జరిగి ఏడాది పూర్తయినా ముఖ్యమంత్రి కనిపించలేదు. కనీసం స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఆ ప్రాంతంలో పర్యటించి బాధితుల్లో భరోసా నింపలేదు. బాధిత ప్రాంతాల్లో ఏ గడప తొక్కినా అందరూ చెబుతున్న మాట ఒక్కటే… ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదు. దాతలే తమను ఆదుకున్నారని చెబుతున్నారు. బాధిత ప్రాంతాల్లో జనసేన పార్టీ పర్యటిస్తుందని తెలుసుకున్న జిల్లా హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ రాత్రికి రాత్రి ప్రకటన చేశారు. బాధితుల ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.లక్ష 40 వేలు వేస్తామని చెప్పారు. అయినా బాధితుల్లో మాత్రం నమ్మకం రాలేదు. ఇది కూడా మోసపూరిత ప్రకటనే అని వాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. 5 సెంట్ల ఇంటి స్థలం ఎక్కడో కొండ ప్రాంతంలో ఇచ్చి 434 ఇళ్లను ప్రభుత్వం కట్టిస్తోంది. రూ. 5 లక్షలు ఇస్తే తాము ఇక్కడే ఇళ్లు కట్టుకుంటామని బాధితులు వేడుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పురుగుపుట్ర మధ్యలో టెంట్లు, గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు. బాధితుల్లో నెలలు నిండిన గర్భిణీలు కూడా ఉన్నారు. త్వరలోనే బాధితులకు అవసరమైన నిత్యవసర వస్తువులు అందించడంతో పాటు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తాం.
* పనులు పునాదుల స్థాయి కూడా దాటలేదు
మూడు నెలల్లో బాధితులకు ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఏడాది పూర్తయినా ఇప్పటి వరకు పనులు పునాదుల స్థాయి కూడా దాటలేదంటే ప్రభుత్వం ఉండి ఏం ఉపయోగం? లక్షల కోట్ల బడ్జెట్ దేనికోసం? ఇంతకుముందే అన్నమయ్య ప్రాజెక్టులో పనిచేసిన లష్కర్ ను కలిశాం. కట్ట తెగిపోతుందని ఆయన ముందే చెప్పినా ఎవరూ కూడా పట్టించుకోలేదు. తెల్లవారుజాము 4 గంటలకు చుట్టుపక్కల గ్రామాలకు ఫోన్ చేసి హెచ్చరించడంతో చాలా మంది ప్రాణాలు కాపాడుకోగలిగారు. అలాంటి వ్యక్తికి కూడా ప్రభుత్వ సాయం అందలేదు. ఆయన్ను కూడా ప్రభుత్వ పెద్దలు భయపెట్టారు. అయినా సరే ఆయన ధైర్యంగా వచ్చి జరిగిన విషయాలు చెప్పాడు. బాధిత ప్రాంతాల్లో మహిళలకు పెన్షన్లు అందడం లేదు. 10 రోజుల్లో జాబ్ మేళా ఏర్పాటు చేసి యువతకు జాబ్ ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. యువతకు ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు లేవు. మాకు ప్రభుత్వం ఇచ్చే జాబ్ అవసరం లేదు మా పొలాల్లో ఇసుక మేటలు తొలగిస్తే మేమే వ్యవసాయం చేసుకుంటామని యువత చెబుతున్నారు. అయినా ప్రభుత్వం ఆ పనులు చేయడానికి కూడా ముందుకు రావడం లేదు. కరెంటు పోలు వేయమని అడిగితే నాలుగు వేలు లంచం అడుగుతున్నారు. సర్వం కోల్పోయిన వారి దగ్గర మళ్లీ దోపిడీ చేయడానికి సిగ్గుండాలి. జల ప్రళయంలో ఒక పూజారి కుటుంబంలోనే తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. అధికార యంత్రాంగం ఆ ప్రాంతంలో పర్యటించి వారికి న్యాయం జరిగే విధంగా పనిచేయలేకపోయింది. వీటన్నింటిని ప్రశ్నించడానికే ఆ ప్రాంతంలో పర్యటించాం.
* ఏడాదిలోనే అంచనా వ్యయం రూ. 300 కోట్లు పెంచేశారు
అన్నమయ్య డ్యాం ప్రమాదం మానవ తప్పిదమా? లేక ప్రకృతి వైపరీత్యామా? అనేది ముఖ్యమంత్రి గారికి తెలుసు. ఆయనకు తెలిసే ఎంక్వైరీ రిపోర్టు బయటకు రాకుండా తొక్కిపెడుతున్నారు. అసలు ప్రాజెక్ట్ ప్రమాదం మానవ తప్పిదం వల్ల జరిగిందని ఆయన ఎందుకు చెప్పలేకపోతున్నారు. గతంలో రూ. 468 కోట్ల వ్యయంతో డ్యామ్ నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. ఏడాదిగా పనులు ప్రారంభించలేదు. ఇప్పుడు అంచనా వ్యయం రూ. 757 కోట్లకు పెంచేశారు. ఒక్క ఏడాదిలోనే రూ. 300 కోట్లు ఎలా పెరిగింది? కొత్త జిల్లా ఏర్పాటు చేసి కలెక్టర్ గారికి భవనం కట్టారు కానీ ఒక్కటంటే ఒక్క ఇల్లు బాధితుల కోసం నిర్మించలేకపోయారు. దీనిపై మాట్లాడితే వాళ్లపై కేసులు పెట్టి బెదిరిస్తున్నారు. ప్రభుత్వ దుర్మార్గాన్ని సోషల్ మీడియాలో చూపిస్తున్నారని జనసైనికులపై కేసులు పెట్టి భయపెడుతున్నారు. దీనిపై నివేదిక తయారు చేసి మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందిస్తాం. ప్రజల తరఫున పోరాటం చేస్తాం. కేవలం కోటి రూపాయలు ఖర్చు చేసి ఉంటే 44 మంది ప్రాణాలను కాపాడగలిగే వాళ్లమని లష్కర్ చెబుతుంటే … కళ్లు చెమర్చాయి. కనీసం కోటి ఖర్చు చేయలేని ప్రభుత్వ నిర్లక్ష్యానికి 44 మంది బలయ్యారు. అన్నమయ్య డ్యాం బాధితులకు జనసేన పార్టీ అండగా ఉంటుంది. నెలలోగా వారి సమస్యలను పరిష్కరించకపోతే జిల్లా కలెక్టరేట్ వద్ద బాధితులతో కలిసి ధర్నా చేస్తామని” హెచ్చరించారు. ఈ సమావేశంలో డా.హరిప్రసాద్, కిరణ్ రాయల్, రాందాస్ చౌదరి, రాజారెడ్డి, మనుక్రాంత్ రెడ్డి, తాతంశెట్టి నాగేంద్ర, శ్రీమతి ఆకేపాటి సుభాషిణి, శ్రీమతి వినుత కోట, శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Tags: