తన ఆఫీసులో ఫోర్జరీలు.. డేటా దుర్వినియోగానికి సీఎం బాధ్యత వహించాలి

* సీఎం సంతకం ఫోర్జరీ చేసింది ఎవరు? సంతకాలు చేసిన ఫైల్స్ ఏమిటీ?…. సమాధానం చెప్పాలి
* 225 ఫైల్స్ ముఖ్యమంత్రి డిజిటల్ సంతకం ఫోర్జరీ చేసి బయటకు పంపించినట్లు తెలిసింది
* బయటికి వెళ్లిన ఫైల్స్ లో అత్యంత కీలకమైన అంశాలు
* ఇంత పెద్ద విషయం జరిగినా సీఎంఓ స్పందించకపోవడానికి కారణం ఏంటి?
* అసలు ఏం జరిగిందో ముఖ్యమంత్రి బయటకు ఎందుకు చెప్పడం లేదు?
* ఆయన కార్యాలయంలో ఆయన సంతకానికే రక్షణ లేకపోతే సామాన్యుడి పరిస్థితి ఏంటి?
* వాలంటీర్లు సేకరిస్తున్న సున్నితమైన సమాచారం కూడా పక్కదారి పడుతోందనేదే జనసేన లేవనెత్తిన అంశం
* ముఖ్యమంత్రి సంతకానికే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి?
* గుంటూరు విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

‘రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియకుండా, ఆయన ప్రమేయం లేకుండా 225 ఫైల్స్ మీద సీఎం డిజిటల్ సంతకాలు ఆయన పేషీలోనే ఫోర్జరీ అయ్యాయి అనే వార్తలు ఆందోళన కలిగిస్తోంది. అసలు సీఎం పేషీలోకి వచ్చే ఫైల్స్ చాలా కీలకంగా ఉంటాయి. అలాంటి ఫైల్స్ మీద సీఎంకే తెలియకుండా సంతకాలు ఫోర్జరీ చేశారు అంటే వెనక ఏదో తతంగం ఉండే ఉంటుంది. అలా చేసింది ఎవరు..? ఫోర్జరీ చేసిన ఫైల్స్ ఏమిటి? రెవెన్యూ శాఖకు సంబంధించినవా.. గనులు శాఖవా? బదిలీలు, నియామకాలకు చెందినవా? ఇంకా ఇతర ముఖ్య ఫైల్స్ దీనిలో ఉన్నాయా..? అనేది అంతు పట్టకుండా ఉంది’ అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. సీఎం పేషీలో ఇంత పెద్ద తప్పు జరిగినా విషయం బయటకు పొక్కకుండా ఎందుకు అంత రహస్యంగా ఉంచుతున్నారు..? దీని వెనుక ఉన్న శక్తులు.. వ్యక్తులు ఎవరు?? వారిని వెనకేసుకొస్తుంది ఎవరు?? ఏ ఫైల్స్ విషయంలో తప్పు జరిగిందో వెంటనే సీఎంఓ ప్రజలకు వెల్లడించాలి అని డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం గుంటూరు నగర పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “సాక్షాత్తు తాడేపల్లి ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఫైల్స్ కే రక్షణ లేకుండా పోతే వాలంటీర్లు సేకరిస్తున్న సామాన్యుడి కీలకమైన సమాచారానికి భద్రత ఎక్కడుంటుంది. 360 డిగ్రీల సమాచారం సేకరణ పేరుతో ప్రజల వ్యక్తిగత అంశాలు, అత్యంత సున్నితమైన అంశాలను సైతం వాలంటీర్లు తీసుకుంటున్నారు. ఆ సమాచారం అంతా ఎవరు సేకరిస్తున్నారు.. ఎక్కడికి వెళ్తుంది… ఆ సమాచారంతో ఏం చేయబోతున్నారు? అని శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దానికి సమాధానం చెప్పకుండా ఆయన మీద వ్యక్తిగతంగా మంత్రులు మాట్లాడడానికే ప్రాధాన్యం ఇవ్వడం చూస్తుంటే ఈ ప్రభుత్వం అసలు విషయాన్ని కావాలనే పక్కదారి పట్టిస్తోందని అర్థమవుతోంది. ప్రజలకు సంబంధించిన కీలకమైన అంశాలు, సమాచారం ప్రైవేటు ఏజెన్సీల వద్ద ఎందుకు ఉంటోంది. హైదరాబాదులోని నానక్ రాంగూడ కేంద్రంగా ఉన్న కార్యాలయంలో ఏం జరుగుతుందో ప్రభుత్వం ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయంలోనే డిజిటల్ దొంగతనం జరిగితే, దాన్ని కూడా తొక్కిపెట్టేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నించడం అత్యంత శోచనీయం. ఓ ప్రభుత్వాన్ని నడిపించే పెద్దదిక్కు లాంటి ముఖ్యమంత్రి సంతకానికే రక్షణ లేకపోతే, సామాన్యుడు ఈ ప్రభుత్వంలో బతుకు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
* ఆ రోజు ఆర్థిక శాఖ ఉద్యోగులను సస్పెండ్ చేశారు.. మరి ఇప్పుడు..?
నియంత మాదిరి వ్యవహరించే ముఖ్యమంత్రి తన కార్యాలయంలో జరిగిన విషయాన్ని దాచిపెట్టడం చూస్తే, ఏదో పెద్ద తప్పే జరిగింది అని అర్థమవుతుంది. అన్ని దాపరికం, అంతా దాపరికం అన్నట్లు సాగుతున్న వైసీపీ పాలనలో బటన్లు నొక్కడం తప్ప చేసిందేమీ లేదు. గతంలో ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఆర్థిక వ్యవస్థ ఎంత ఘోరంగా ఉందో, ఎలా అప్పులు చేస్తున్నారో పత్రికల్లో వార్తలు వస్తే అప్పటికప్పుడు ముగ్గురు నలుగురు ఉద్యోగుల్ని సస్పెండ్ చేశారు. మరి ముఖ్యమంత్రి డిజిటల్ సంతకం పక్కదారి పట్టి , భారీగా ఫైల్స్ బైటికి వెళ్లి పోయినా ఇప్పటివరకు చర్యలు చేపట్టకపోవడం చూస్తే దాని వెనుక కీలకమైన ప్రభుత్వ పెద్దలు ఉన్నారా అన్న అనుమానం వస్తోంది. ఇప్పుడు ఎవర్ని బాధ్యులని చేస్తారు?
* నిజం చెబితే కేసులు అని గోల చేశారు
వాలంటరీ వ్యవస్థను ఉపయోగించుకొని వైసీపీ నడిపిస్తున్న సమాంతర ప్రభుత్వం గురించి, ప్రజల నుంచి సేకరిస్తున్న వ్యక్తిగత సమాచారం గురించి పవన్ కళ్యాణ్ గారు సూటిగా ప్రశ్నించారు. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ, వైసీపీ ప్రభుత్వం పార్టీ అవసరాల కోసం సమాంతర వ్యవస్థను ప్రజా ధనంతో నడుపుతున్న తీరు మీద ఎలాంటి భయాలు లేకుండా మాట్లాడారు. దానికి స్పందించాల్సిన ప్రభుత్వ పెద్దలు దానిని పూర్తిగా పక్కనపెట్టి, శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు పెట్టేందుకు హడావిడిగా జీవోలు తెచ్చారు. కోర్టులో కేసులు వేయించేందుకు ప్రయత్నించారు. అవేవీ పారకపోవడంతో ఏం సమాధానం చెప్పలేక సైలెంట్ అయ్యారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వానికి ఎలాంటి భయం లేకుండా వేసిన ప్రశ్న అలాంటిది.. భయం లేనప్పుడు, నిజం మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఏ వ్యవస్థయినా మనకు సమాధానం చెప్పి తీరాలి. వైసీపీ బెదిరింపులకు భయపడే వ్యక్తులు జనసేన పార్టీలో ఎవరూ లేరు. సమాంతర వ్యవస్థల ద్వారా సర్పంచుల అధికారాలను సైతం కాలరాస్తున్నారు. మొన్న నిర్వహించిన సర్పంచుల సమావేశంలో అందరి ఆవేదన ఇదే. బయటకు మాత్రం పారదర్శకత ప్రభుత్వం అని చెప్పకుంటున్న వైసీపీ పెద్దలు తమ కళ్ళముందే అత్యంత దారుణంగా అవినీతి జరుగుతున్నా దానిని పట్టించుకోవడం లేదు. ఈ ప్రభుత్వంలో ప్రతి చిన్న పోస్టులకు డబ్బులు బహిరంగంగా వసూలు చేస్తున్నారు. ఇక పెద్ద స్థాయిలో అవకతవకలు అవినీతి ఊహించని విధంగా జరుగుతోంది. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఆయన అనుచర గణానికి మాత్రమే ఆర్థికంగా లబ్ది చేకూరుతోంది. వారు మాత్రమే ఆర్థికంగా రాను రాను బలోపేతం అవుతున్నారు. మంత్రులు చేయాల్సిన పనులన్నీ ముఖ్యమంత్రి చక్కబెడుతున్నారు. కనీసం మంత్రులకు చేయాల్సిన పనులు కూడా ఉండడం లేదు. తమ శాఖల్లో ఏం జరుగుతుందో తెలియని మంత్రులు సైతం వైసీపీ ప్రభుత్వంలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. కేవలం శ్రీ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడానికి మాత్రమే మంత్రులకు శాఖలు ఇచ్చినట్లుగా ఉంది. ప్రజలు ఎంతో నమ్మకంతో వైసీపీకి 151 సీట్లు ఇస్తే ఈ మంత్రులు మాత్రం శ్రీ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించి ఆనందపడుతున్నారు. ఇసుక దోపిడీని విచ్చలవిడిగా చేస్తున్నారు. చాలాచోట్ల కోర్టు ఆదేశాలు బేఖాతరు చేసి మరీ వ్యవస్థలు ఏర్పాటు చేసుకొని కోట్ల రూపాయలు ఇసుకలో వెనకేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వంలో రైతుల ఈతి బాధలు రెట్టింపు అవుతున్నాయి. సామాన్యుడు చితికిపోతున్నాడు.
* టీటీడీలో పారదర్శకత పెరగాలి
తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న ప్రతి అంశానికి పారదర్శకత పెరగాలి. ప్రజల ద్వారా అందించే విరాళాలు టికెట్లు ఇతరత్రా ఆర్థిక లావాదేవీలకు కచ్చితంగా ప్రజలకు వివరాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. టీటీడీ చైర్మన్ గా ఎవరు ఉన్నా పాలకమండలి ఎవరూ వచ్చినా టీటీడీలో భక్తులకు ప్రాధాన్యం ఇచ్చే పనులు చేయాలి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించిన శ్రీవాణి ట్రస్ట్ నిధులు విషయంలో అసలు విషయం ప్రజలకు తెలియజెప్పాలి. శ్రీవాణి ట్రస్టు ద్వారా రూ.10 వేలు చెల్లిస్తే, దర్శనమిస్తున్న టీటీడీ దానికి రసీదు ఎందుకు ఇవ్వడం లేదు. ఆ నిధులు ఎక్కడ కు వెళ్తున్నాయనే విషయాల మీద టీటీడీ దృష్టి పెట్టాలి. తిరుమల తిరుపతి దేవస్థానం హిందువుల మనోభావాలకు అత్యంత ప్రాధాన్యమిచ్చి, అన్ని విషయాలను ప్రజలకు తెలియజేయాలి. సామాన్య భక్తుల కోసం పని చేయాలి.
* ఓటర్ల జాబితాల పరిశీలనపై ప్రత్యేక దృష్టి
వచ్చే ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో ఇష్టానుసారం అవకతవకలు చేసేందుకు వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నం చేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితా పరిశీలనకు జనసేన పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల జాబితాను పరిశీలించేలా జిల్లా కార్యకర్తలకు ప్రత్యేక వర్క్ షాప్ త్వరలో నిర్వహిస్తాం. ప్రతి జిల్లా నుంచి 25 మంది చొప్పున తీసుకుని, వారికి ఓటర్ల జాబితా తనిఖీ మీద, కొత్త ఓట్ల రిజిస్ట్రేషన్ మీద ప్రత్యేకంగా సూచనలు ఇస్తాం. ఈ ప్రత్యేక శిబిరాన్ని త్వరలోనే పార్టీ కార్యాలయంలో ప్రారంభించే ఏర్పాటు చేస్తాం. ఓటర్ల జాబితాలో అవకతవకలు నిరోధించేందుకు జనసేన పార్టీ కచ్చితంగా కృషి చేస్తుంది. జనసేన పార్టీకి అన్ని విధాలా అన్ని వర్గాల ప్రజలు సహకరిస్తున్నారు. వారి శక్తి మేరకు పార్టీ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. నిన్న గుంటూరులో లాలుపురంలో ప్రారంభించిన జనసేన పార్టీ కార్యాలయానికి సైతం ఆరు సెంట్ల స్థలం ఇచ్చిన దాతలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జనసేన పార్టీ ప్రస్థానంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవడం శుభ పరిణామం” అన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ కన్వీనర్ కళ్యాణం శివ శ్రీనివాస్, పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు నేరెళ్ల సురేష్, పార్టీ నాయకులు నయుబ్ కమల్, సయ్యద్ జిలానీ, వి. మార్కండేయ బాబు, బండారు రవికాంత్, ఇస్మాయిల్ బేగ్, శ్రీమతి బోని పార్వతి నాయుడు, ఆళ్ళ హరి, పెంటేల బాలాజీ తదితరులు పాల్గొన్నారు.