పట్టాభికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు

సిఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయిన టిడిపి అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌కు శనివారం హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ప్రస్తుతం పట్టాభి రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో ఉన్నాడు. రెండ్రోజుల క్రితం సిఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ విజయవాడ గవర్నరు పేట పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో విజయవాడ పటమటలోని ఆయన ఇంటి వద్ద పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో పట్టాభి తరుపు న్యాయవాదులు బెయిల్‌ నిమిత్తం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. బెయిల్‌ విషయంలో శనివారం హైకోర్టులో పట్టాభి తరుపున న్యాయవాదులకు, ప్రభుత్వ తరుపున న్యాయవాదులకు మధ్య వాదోపవాదనలు జరిగాయి. ఈ నేపధ్యంలో కొన్ని కీలకమైన బాధ్యతలు పాటిచలేదంటూ పట్టాభి చేసిన విమర్శల సీడీలను న్యాయవాదులు కోర్టుకు సమర్పించారు. అరెస్టు విషయంలో పోలీసులు నిబంధనలు అనుసరించలేదని కోర్టు అభిప్రాయ పడింది. పోలీసులు దూకుడును కొంత తగ్గించుకోవాలని కోర్టు సూచించింది. అయితే థర్డ్‌ క్లాస్‌ మెజీస్ట్రేట్‌ ఎలా రిమాండ్‌ ఇచ్చారో చెప్పాలని హైకోర్టు వివరణ కోరింది. ఇరుపక్షాల వాదనలు విన్న ఏపి హైకోర్టు పట్టాభికి బెయిల్‌ మంజూరు చేసింది.