కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సెప్టెంబర్ నుంచి పర్యాటకుల్ని ఆహ్వానిస్తున్న ఏపీ

కరోనా మహమ్మారి మిగిల్చిన అడ్డంకుల అన్నింటి నుండీ బయటపడేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సెప్టెంబర్ నుంచి పర్యాటకుల్ని అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పలు పర్యాటక ప్రాంతాల్నిఅభివృద్ధి చేసే నిర్ణయాలు తీసుకున్నారు.

పర్యాటక శాఖపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అధికార్లతో చర్చించారు. సమావేశంలో పర్యాటక విధానంపై చర్చ జరిగింది. 12 ప్రాంతాల్లో 7 స్టార్ హోటళ్లు, ఇంటర్నేషనల్ హోటళ్లు త్వరలోనే రానున్నాయని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల్ని కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా తెరుస్తామని…సెప్టెంబర్ నుంచి పర్యాటకుల్ని అనుమతిస్తామని మంత్రి శ్రీనివాస్ చెప్పారు.

ఎకో, టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్న హోటళ్లు, రిసార్ట్స్ కోవిడ్ వైరస్ కారణంగా నష్టపోయినట్టు..రాయితీ కోసం వినతి పత్రాలిచ్చారని మంత్రి అవంతి తెలిపారు. ముఖ్యమంత్రి దీనిపై సానుకూలంగా స్పందించారన్నారు. శిల్పారామంను పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తామన్నారు. ఇంకా పలు కీలకాంశాలపై నిర్ణయం తీసుకున్నారు. ఏపీ టూరిజం నూతన పాలసీలో మార్పులు చేర్పులకు సీఎం జగన్ సూచించారు. రాష్ట్రంలో 12-14 ప్రాంతాల్ని అభివృద్ధి చేయనున్నారు. రాజస్తాన్ తో దీటుగా ఏపీలోని పర్యాటక ప్రాంతాల్ని అభివృద్ది చేయాలని సూచించారు. అరుకులో ప్రపంచస్థాయి మౌళిక సదుపాయాల్ని కల్పించాలని…హాస్పటల్ మేనేజ్ మెంట్ లో మంచి కళాశాల స్థాపించాలని సీఎం ఆదేశించారు.  ఏపీ ఆన్ లైన్ ట్రేడ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు.