బీసీ కుల గణన వైసీపీ దురాలోచనలకు నిదర్శనం

  • జనసేన నేత గురాన అయ్యలు

విజయనగరం: కుల గణన చేపట్టడం వైసీపీ దురాలోచనలకు నిదర్శనమని జనసేన నేత గురాన అయ్యలు మండిపడ్డారు. శనివారం గురాన అయ్యలు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో చేపడుతున్న బీసీ కులాల గణన కేవలం ఎన్నికల ఎత్తుగడగా కనిపిస్తోందని ఆరోపించారు.. రాష్ట్ర ప్రభుత్వం సేకరించే బీసీ కులాల జనాభా వివరాలను కేంద్ర ప్రభుత్వంతోపాటు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తిస్తుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరం వుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇతర ఆర్థిక అంశాలతో కులగణనకు ముడిపెట్టకూడదన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కుల గణన చేపట్టడమే ప్రభుత్వ ఉద్దేశం అయితే ఆదాయం, భూముల వివరాలు, ఆస్తుల వివరాలు ఎందుకు తెలుసుకుంటున్నారని ప్రశ్నించారు. ఇష్టారాజ్యంగా రాజ్యాంగ వ్యతిరేకంగా కుల గణన పేరిట సర్వే చేయడం కరెక్ట్ కాదన్నారు. సర్వే చేయించుకొకపోతే పథకాలు రావు అని బెదిరింపులు చేయడం దారుణమన్నారు. కుల గణనకి సహకరించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పథకాలు రద్దు చేస్తే జనసేన తరుపున పోరాటం చేస్తామన్నారు. వలంటీర్లకు కుల గణన చేసేంత అర్హత, సామర్థ్యం లేవన్నారు. కుల గణన నిపుణులతో జరిపించాల్సిన అవసరం వుందన్నారు. కుల గణన చేపడితే ఆ వివరాలు దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉన్నాయని, అలా దుర్వినియోగం కాకుండా ఎటువంటి చర్యలు చేపడుతున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.