వైరస్‌పై పోరులో పై చేయి సాధించాం కానీ.. కొవిడ్-19 పూర్తిగా నాశనం కాలేదు: బైడెన్

కరోనా మహమ్మారిపై పూర్తిగా విజయం సాధించనప్పటికీ అమెరికా క్రమంగా కరోనా పూర్వ స్థితికి క్రమంగా చేరుకుంటోందని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అమెరికా 245వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా శ్వేతసౌధంలో సుమారు 1000 మంది అతిథిలతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. 1776లో బ్రిటిష్ సామాజ్రం నుంచి అమెరికా స్వాతంత్ర్యం పొందిన సమయంలో నెలకొన్న పరిస్థితులను.. అగ్రరాజ్య ప్రస్తుత స్థితితో బైడెన్ పోల్చారు. ‘245 సంవత్సరాల క్రితం బ్రిటిష్ సామాజ్రం నుంచి మనం స్వాతంత్ర్యం పొందాం. నేడు, మహమ్మారి నుంచి బయటపడేందుకు చేస్తున్న పోరాటంలో చివరి దశకు చేరుకున్నాం’ అని అన్నారు.

అంతేకాకుండా ‘వైరస్‌పై మనం పైచేయి సాధించాం. కానీ తప్పుగా అనుకోవద్దు.. కొవిడ్-19 పూర్తిగా నాశనం కాలేదు. రోజు రోజుకీ కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. డెల్టా వేరియంట్ మాదిరిగా శక్తివంతమైన వేరియంట్లు ఉద్భవించాయని మనందరికీ తెలుసు’ అని వ్యాఖ్యానించారు. గత ఏడాది చీకటి రోజులలో జీవించామన్న బైడెన్.. ఇకపై ప్రకాశవంతమైన భవిష్యత్తును చూడబోతున్నామని అమెరికన్లను ఉద్దేశించి బైడెన్ పేర్కొన్నారు. కాగా.. మహమ్మారి చేతిలో 6లక్షల మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల బైడెన్ విచారం వ్యక్తం చేశారు. కొవిడ్‌తో చేసిన పోరులో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు.