నేడు కలెక్టరేట్ల ఎదుట బీజేపీ ధర్నా

‘వానా కాలంలో రైతులు పండించిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని… కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఈనెల 11న అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట వేలాది మందితో ధర్నాలు నిర్వహించాలి… బీజేపీ నేతలతోపాటు మహిళ, యువ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కిసాన్ మోర్చాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనాలి… కేంద్రం వానాకాలంలో పండించిన ధాన్యాన్ని కొనేందుకు సిద్ధంగా ఉన్నా…రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సేకరించడం లేదో నిలదీయాలి..

రాష్ట్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు పడుతున్న ఇబ్బందులను వివరించాలి’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఇంచార్జులు, వివిధ మోర్చాల నేతలతో బుధవారం సమావేశం నిర్వహించారు.

పార్టీ సంస్థాగత పటిష్టత, ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై చర్చించారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ.. వానాకాలంలో పండించిన 60 లక్షల మెట్రిక్ ధాన్యాన్ని కొనేందుకు సిద్దమని కేంద్రం గత ఆగస్టులోనే లేఖ ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతూ ఆ తప్పును కేంద్రంపై నెట్టే యత్నం చేస్తుందన్నారు. దొంగే దొంగ అన్నట్లుగా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ధర్నాల పేరుతో రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తుందని ఆరోపించారు. ప్రజలకు వాస్తవాలు వివరించేందుకు, ధాన్యం తక్షణమే కొనుగోలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

పంట పొలాలు, కళ్లాల వద్ద, రోడ్లపై, మార్కెట్ల వద్ద ధాన్యాన్ని పోసి రోజుల తరబడి నిరీక్షిస్తూ రైతులు పడుతున్న గోసను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. పంట కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో ఎందుకు తెరవడం లేదో తెలంగాణ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.