తిరుపతిలో జనసేనానికి బ్రహ్మరథం

• భారీ ర్యాలీగా ఎస్పీ కార్యాలయనికి వెళ్లిన శ్రీ పవన్ కళ్యాణ్
• జనసేన అధినేత రాకతో కిక్కిరిసిన తిరుపతి పుర వీధులు
• శ్రీ కొట్టే సాయిపై పోలీసు అధికారిణి దాడి ఘటనపై ఫిర్యాదు

శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్త శ్రీ కొట్టే సాయిపై పోలీసు అధికారిణి శ్రీమతి అంజు యాదవ్ జరిపిన అమానుష దాడి ఘటనపై తిరుపతి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు సోమవారం తిరుపతి వచ్చిన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పార్టీ శ్రేణులు అడుగడుగునా బ్రహ్మరథం పట్టాయి. జనసేనాని రాకతో రేణిగుంట విమానాశ్రయం నుంచి ఎస్పీ కార్యాలయం వరకు రహదారులు జనంతో కిక్కిరిశాయి. జన సైనికులు వందలాది మంది ద్విచక్ర వాహనాలతో ర్యాలీ తీయగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు తిరుపతి ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోగా పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. శ్రీ పవన్ కళ్యాణ్ గారి రాక విషయం తెలుసుకున్న పార్టీ శ్రేణులు ఆయనకు మద్దతుగా ఉదయం నుంచే వేలాదిగా విమానాశ్రయానికి చేరుకున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పూల వర్షంతో ముంచెత్తారు.
• గజమాలల ఘన స్వాగతం
విమానాశ్రయం నుంచి బయలుదేరిన పవన్ కళ్యాణ్ గారికి సమస్యలు చెప్పుకునేందుకు ఎగబడ్డారు. ప్రజల నుంచి వచ్చిన వినతిపత్రాలు స్వీకరించి వాహనంపై నుంచే చదివి పరిశీలిస్తానని సైగ చేశారు. మరో వ్యక్తి వాహనానికి చేరువగా వచ్చి సమస్య చెప్పుకోవాలని కోరగా వాహనాన్ని ఆపి విన్నారు. రేణిగుంట విమానాశ్రయం వెలుపలికి రాగానే పార్టీ శ్రేణులు గజమాలలతో స్వాగతం పలికాయి. రేణిగుంట కూడలి, గాజుల మండ్యం కూడలి, పద్మావతి మహిళా వర్శిటీ మీదుగా బాలాజీ నగర్ సర్కిల్ కి చేరుకున్నారు. ప్రతి కూడలిలోనూ పార్టీ నాయకులు భారీ గజమాలలతో సత్కరించారు. నగరంలోని ప్రతి కూడలిలోనూ ఆడపడుచుల హారతులు స్వీకరించి వారితో కరచాలనం చేసి ఉత్సాహపరిచారు. బాలాజీ నగర్ సర్కిల్ మొత్తం వేలాది మంది జన సైనికులు, వీర మహిళలు, ప్రజలతో నిండిపోయింది. జనసేన శ్రేణులు లక్ష్యంగా పోలీసు అధికారిణి దాష్టికాన్ని వ్యతిరేకిస్తూ కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కార్యకర్తకు అండగా నిలిచేందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి జేజేలు పలికారు. తమ నియోజకవర్గానికి రావాలంటూ చిత్తూరు జిల్లాకు చెందిన పలు నియోజకవర్గాల కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించి అధినేతను కోరారు.

• తిరుపతి చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్
జన సైనికుడు శ్రీ కొట్టే సాయిపై పోలీసు అధికారిణి విచక్షణారహిత దాడి ఘటనపై తిరుపతి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, పార్టీ నేతలు చిలకం మధుసూదన్ రెడ్డి, కిరణ్ రాయల్, రాందాస్ చౌదరి , జె.రాజారెడ్డి, శ్రీమతి వినుత కోట, శ్రీమతి అకేపాటి సుభాషిణి, పొన్న యుగంధర్, తాతంశెట్టి నాగేంద్ర, ముకరం చాంద్, టి.సివరుణ్, తదితరులు అధినేతకు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి పార్టీ నాయకులు, జనసైనికులతో కలసి భారీ ర్యాలీగా పవన్ కళ్యాణ్ గారు తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయానికి బయలుదేరారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ తో పాటు ఉన్నారు. ఈ పర్యటన సందర్భంగా ఉదయం నుంచే పార్టీ నాయకులతో పాటు జనసైనికులు, వీరమహిళలు పెద్ద సంఖ్యలో తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నారు.