పోలీసు ఆంక్షలు ఛేదించుకుంటూ…. ఇప్పటంలో జనసేనాని పర్యటన
•కార్యాలయం వెలుపలే అడ్డుకున్న పోలీసులు
•కొట్టుకోండి.. తిట్టుకోండి.. అడ్డుకోండి.. కావాలంటే అరెస్టులు చేసుకోండి
•ఇప్పటం వెళ్లి తీరాల్సిందేనన్న శ్రీ పవన్ కళ్యాణ్
•పోలీసులపైకి ఎగబడవద్దని శ్రేణులకు సూచించిన జనసేనాని
•మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లిన శ్రీ పవన్ కళ్యాణ్
•ఇప్పటం వరకు వాహనంపై ప్రయాణం
•పూల వర్షంతో ఇప్పటం ప్రజల ఆహ్వానం
•కూల్చి వేసిన ప్రతి ఇంటికీ వెళ్లి పలకరింపు
•అండగా ఉంటానంటూ భరోసా
‘కొట్టుకుంటే కొట్టుకోండి.. తిట్టుకుంటే తిట్టండి.. అడ్డుకుంటే అడ్డుకోండి.. కావాలంటే అరెస్టులు చేసుకున్నా సిద్ధం. ఎన్ కౌంటర్ చేస్తానన్నా భయపడేవాణ్ణి కాదు.. అరెస్టులకు భయపడతానా.. జన సైనికులకు ఒక్కటే విన్నవిస్తున్నా.. పోలీసు అధికారుల మీదకు ఎవరూ ఎగబడ వద్దు.. వారితో కలబడ వద్దు.
అరెస్టులు చేసుకున్నా.. అడ్డుకున్నా.. కేసులు పెట్టుకున్నా మనం మాత్రం ముందుకే వెళ్దాం రండి…’- ఇప్పటం గ్రామ సందర్శనకు బయలుదేరిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పార్టీ కార్యాలయం వెలుపల పోలీసులు అడ్డుకున్నప్పుడు తన వాహనం నుంచి దిగి నడుచుకుంటూ వెళ్తూ మాట్లాడిన మాటలివి. పోలీసులు వాహనాన్ని అడ్డుకోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు.. ప్రజల్ని కలవడానికి వెళ్లేందుకు ఆంక్షలు పెడతారా? హత్యలు చేసిన వారిని పోలీసులు కాపాడుతున్నారు. ప్రజల కోసం నిలబడుతున్న వారిని అడ్డుకుంటున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటం వెళ్లి తీరుతానన్న ఆయన.. నడుచుకుంటూ ముందుకు కదిలారు. పార్టీ కార్యాలయం నుంచి జాతీయ రహదారి మీదుగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నడుచుకుంటూ వెళ్లారు. ఇప్పటం చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అక్కడ ఆడపడుచులు పూల వర్షంతో స్వాగతం పలికారు. తమకు అండగా నిలిచేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రావడంతో ప్రభుత్వం తమ ఇళ్లు కూల్చిందన్న విషయాన్ని మరచి.. తమ కోసం వచ్చిన ఆయనకు హారతులు పట్టారు. ఇప్పటం గ్రామంలో ప్రవేశించిన వెంటనే శుక్రవారం వైసీపీ ప్రభుత్వం కూల్చిన మొదటి ఇంటి వద్ద కిందికి దిగి ధ్వంసమైన ఇంటిని పరిశీలించారు. రోడ్డు ఎంత ఉంది? ఎంత మేర ఇల్లు కూల్చారు అనే అంశాలను ఆరా తీశారు. జాతి నాయకుల విగ్రహాలను సైతం తీసివేసిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం చుట్టూ పోలీసు పహారా ఏర్పాటు చేయడం గురించి తెలుసుకొని ‘ప్రాణం ఉన్న మనుషులు నివసిస్తున్న ఇళ్లకు లేని విలువ.. ప్రాణం లేని విగ్రహానికి వైసీపీ ప్రభుత్వం ఇస్తుంద’ని వ్యాఖ్యానించారు.ఇప్పటం గ్రామంలో 53 ఇళ్లు కూల్చివేతకు గురి కాగా ఆ శిథిల ప్రదేశంలో నుంచే బాధితుల వద్దకు వెళ్లి పరామర్శించారు. మీకు జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఓ ఇంట్లో 8 నెలల గర్భిణి ఉంది.. కూల్చవద్దని ఆ కుటుంబ సభ్యులు వేడుకున్నా అధికారులు కనికరం చూపలేదని బాధితులు చెప్పగా విని ఆవేదన చెందారు. నాకు అండగా నిలిచినందుకు మీ మీద ప్రభుత్వ కక్ష సాధిస్తుందన్న విషయం తెలిసిన వెంటనే మనసు ఆగక వెంటనే వచ్చేసినట్టు బాధితులకు చెప్పారు. పోలీసులు అడ్డుకోవాలని చూసినా మీకు అండగా ఉండాలన్న లక్ష్యంతో వచ్చినట్టు చెప్పి ధైర్యం నింపారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి రాక నేపథ్యంలో ఇప్పటం గ్రామస్థులకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించి జనసేన పార్టీ తరఫున అండగా నిలవడానికి పార్టీ రాష్ట్ర నాయకత్వం, అన్ని జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి ఇప్పటం ప్రజలకు సంఘీభావం తెలిపారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన జనసైనికులతో ఇప్పటం జనసంద్రంగా మారింది.
•పూల రైతులు, కూలీలతో మాటామంతి
ఇప్పటం గ్రామ సందర్శన అనంతరం తిరుగు ప్రయాణంలో పెద వడ్లమూడి – ఇప్పటం మధ్య మల్లె తోటల్లో రైతులు, కూలీలను పలుకరించారు. తోటలోకి వెళ్లి వారి సాదకబాధకాలు అడిగి తెలుసుకున్నారు. మల్లెతోటల సాగు, పని చేస్తున్న కూలీలతో కాసేపు మాట కలిపారు. వారి ఇబ్బందులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకున్నారు. జనసేన పార్టీ అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా
తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్, పార్టీ ప్రధాన కార్యదర్శులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, చిలకం మధుసూదన్ రెడ్డి, పెదపూడి విజయ్ కుమార్, చేనేత వికాస విభాగం ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్, జిల్లాల అధ్యక్షులు షేక్ రియాజ్, టి.సి. వరుణ్, గాదె వెంకటేశ్వరరావు, పోతిన వెంకట మహేష్, చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి, పార్టీ కార్యక్రమాల విభాగం కన్వీనర్ కళ్యాణం శివశ్రీనివాస్, పార్టీ నాయకులు అక్కల రామ్మోహన్ రావు, సయ్యద్ జిలానీ, నయూబ్ కమాల్, అమ్మిశెట్టి వాసు, రవికాంత్, బేతపూడి విజయ్ శేఖర్, మండలి రాజేష్, శ్రీమతి రావి సౌజన్య తదితరులు పాల్గొన్నారు.