ఆంధ్రలో పెట్రో ధరలు అదరహో!

* దేశం మొత్తం మీద ఇక్కడే అధికం
* కేంద్రాన్ని మించిపోయిన‌ రాష్ట్ర ప‌న్నులు
* పండుగ చేసుకుంటున్న సరిహద్దు రాష్ట్రాల బంకులు

జాతీయ స్థాయిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఈమ‌ధ్య రెండు అంశాల్లో ప్రథ‌మ స్థానంలో నిలిచింది!
అయితే అవి గ‌ర్వ‌ప‌డే సంగ‌తులు కావు…
సిగ్గుతో త‌ల‌దించుకోవ‌ల‌సిన విష‌యాలు…
1. మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న దాష్టీకాలు!
2. పెట్రో ఉత్ప‌త్తుల ధ‌ర‌లు!
ఇది జ‌గ‌న్ ప్ర‌భుత్వం సాధించిన ఘ‌న‌త‌!
అప్పుల్లో కూరుకుపోతూ… వ‌డ్డీలు క‌ట్ట‌డానికే స‌త‌మ‌త‌మ‌వుతూ… ప్ర‌తి నెలా జీతాలు చెల్లించ‌డానికి కూడా క‌ట‌క‌ట‌లాడుతూ… అంత‌కంత‌కు ఆర్థిక సంక్షోభంలో అణ‌గారుతున్న ప్ర‌భుత్వం ఇప్పుడు మ‌ద్యం, పెట్రోలు మీదే అధిక ఆదాయాన్ని పిండుకోవాల‌ని చూస్తోంది.
దానికి పర్య‌వ‌సాన‌మే దేశం మొత్తం మీద ఎక్క‌డా లేని విధంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు అత్య‌ధిక స్థాయికి చేరుకోవ‌డం.
ప్ర‌స్తుతం రాష్ట్రంలో లీట‌ర్ పెట్రోలు ధ‌ర రూ. 120 దాటిపోయింది!
డీజిల్ ధ‌ర లీట‌ర్ రూ. 106 రూపాయ‌లు అధిగ‌మించింది!
దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని ప‌రిస్థితి ఇక్క‌డే ఎందుకొచ్చింది? అని ఆశ్చ‌ర్యం క‌లిగితే దానికి స‌మాధానం ఒక‌టే…
రాష్ట్రంలో వీటిపై వ‌డ్డిస్తున్న అద‌న‌పు ప‌న్నులు!
ఈ ప‌న్నులు కేంద్ర ప్ర‌భుత్వం వేసే ఎక్సైజ్ సుంకాల‌ను మించిపోయాయి.
వ్యాట్‌, అద‌న‌పు వ్యాట్‌, రోడ్డు అభివృద్ధి సుంకం, తిరిగి దానిపై వ్యాట్… ఇలా పెంచుకుంటూ పోవ‌డమే ఇందుకు కార‌ణం!
అద‌న‌పు ఆదాయం కోసం అర్రులు చాస్తున్న జ‌గ‌న్ ప్ర‌భుత్వం, బండి తీసుకుని రోడ్డు మీద‌కి వ‌చ్చే ప్ర‌తి వినియోగ‌దారిడినీ ఈ ప‌న్నుల ప‌రంపరంతో చావ‌గొడుతోంది!
ఇలా పెట్రో ఉత్ప‌త్తుల‌పై ఎడాపెడా పెంచేసిన ప‌న్నుల ప్ర‌భావం ప‌రోక్షంగా అనేక వ్యాపారాల మీద ర‌వాణా భారాన్ని మోపుతోంది. తద్వారా అనేక స‌రుకుల ధ‌ర‌లు కూడా పెరిగిపోతున్నాయి. ఫలితంగా ఆ ప్ర‌భావం కూడా ప్ర‌జ‌ల మీద‌నే ప‌డుతోంది. సామాన్యుడి జేబుకి చిల్లులు పెడుతోంది.
*నాటి మాటలు గుర్తున్నాయా జ‌గ‌న్‌గారూ?
స‌రిగ్గా మూడేళ్ల క్రితం ప్ర‌తిప‌క్ష నేత‌గా జ‌గ‌న్ ఊరూరా పాద‌యాత్ర చేస్తూ పెట్రోలు, డీజిల్ ధ‌ర‌ల‌ను ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావిస్తూ విమ‌ర్శ‌లు సంధించారు. “పొరుగు రాష్ట్రాల కంటే ఆంధ్రాలో పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు ఏడు రూపాయ‌లు ఎక్కువ” అంటూ గ‌ణాంకాలు ఉద‌హ‌రించేవారు.
మ‌రి ఇప్పుడు ప‌రిస్థితి ఏంటో తెలుసా?
పొరుగు రాష్ట్రాల కంటే ఆంధ్రాలో పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు దాదాపు ఏడు నుంచి ప‌ది రూపాయ‌లు ఎక్కువ‌!
అంతేకాదు… దేశంలో మ‌రే రాష్ట్రంలో క‌న్నా ఆంధ్రాలోనే అధికం!
అధికారం కోసం అర్రులు చాస్తూ ప్ర‌జ‌ల‌ను న‌మ్మించిన‌ జ‌గ‌న్, అధికారం అందుకున్నాక సాధించిందిదేనా అంటూ సామాన్యులు సైతం ప్రశ్నిస్తున్నారిప్పుడు.
ఉదాహ‌ర‌ణ‌కు… జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయిన 2019 నాటికి తాడేప‌ల్లిలో లీట‌ర్ పెట్రోలు ధ‌ర రూ. 76.89 ఉండేది. మ‌రిప్పుడు ఎంతో తెలుసా? ఏకంగా రూ. 120.95!
అప్ప‌ట్లో డీజిల్ ధ‌ర లీట‌రు రూ. 71.50 అయితే… ఇప్పుడు అది రూ. 106.58కి ఎగ‌బాకింది! మూడేళ్లుగా అధికారంలో ఉన్న జ‌గ‌న్ ఈ ధ‌ర‌ల‌పై నోరు మెద‌ప‌డం లేదు స‌రిక‌దా… వాటిని త‌గ్గించే ప్ర‌య‌త్నం కూడా ఇసుమంతైనా చేయ‌డం లేదు.
పైగా జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యేనాటికి పెట్రోలు, డీజిల్ మీద లీట‌ర్‌కి రూ.2 అద‌న‌పు వ్యాట్ ఉండ‌గా, దాన్ని ఇప్పుడు రూ. 4కి పెంచేశారు. అంతేకాదు… ర‌హ‌దారుల అభివృద్ధి నిధి పేరుతో లీట‌ర్‌పై మ‌రో రూపాయి కూడా వ‌సూలు చేస్తున్నారు. పైగా దీనిపై కూడా వ్యాట్ అద‌నంగా వ‌డ్డిస్తున్నారు.
*త‌గ్గించే అవ‌కాశం ఉన్నా ప‌ట్టించుకోని ప్ర‌భుత్వం
నిజానికి పెట్రో ధ‌ర‌వ‌ర‌లు అంత‌ర్జాతీయ మార్కెట్‌లోని ఒడిదుడుకులను అనుస‌రించి ఉంటాయ‌నేది వాస్త‌వ‌మే. అలా మారే మూల ధ‌ర‌పై కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని కొంత మేర‌కు విధిస్తుంది. ఆపై రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ రూపంలో కొన్ని ప‌న్నుల‌ను విధించుకునే అవ‌కాశం ఉంది. అందువ‌ల్ల‌నే పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు ప్రాంతాల‌ను బ‌ట్టి మారుతుంటాయి. అయితే ప్ర‌స్తుతం దేశంలోని ఏ రాష్ట్రం విధించన‌న్ని ప‌న్నుల‌ను ఆంధ్ర ప్ర‌భుత్వం వ‌డ్డించ‌డం వ‌ల్ల‌నే దేశం మొత్తం మీద ఎక్క‌డా లేనంత‌గా పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు ఇక్క‌డే అధికంగా మారాయి. క‌రోనా త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల గ‌తేడాది న‌వంబ‌ర్‌లో కేంద్రం పెట్రోలుపై లీట‌ర్‌కు రూ. 5, డీజిల్‌పై రూ. 10 రూపాయ‌ల వంతున త‌గ్గించింది. దీంతో చాలా రాష్ట్రాలు త‌మ ప‌రిధిలో ఆ మేర‌కు ధ‌ర‌లు తగ్గించి ఆ ప్ర‌యోజ‌నాన్ని వినియోగ‌దారుడికి బ‌ద‌లాయించాయి. అయితే జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆ విష‌యాన్నే విస్మ‌రించింది. కేంద్రం త‌గ్గించినప్ప‌టికీ ఇక్క‌డ త‌గ్గించ‌క‌పోవ‌డంతో ఆ భారం వినియోగ‌దారుడిపై ప‌డితే, ఆ మేర‌కు వేలాది కోట్ల రూపాయ‌ల అద‌న‌పు ఆదాయాన్ని రాష్ట్రం ప్ర‌భుత్వం పొందుతోంది. ఇలా చేస్తూ కూడా జ‌గ‌న్ మాత్రం కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్య వ‌ల్ల రాష్ట్ర ఆదాయం ప‌డిపోతోందంటూ ప్ర‌జ‌ల‌ను మ‌భ్య పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.
*అద‌నంగా వ‌డ్డిస్తూ… ప్ర‌జ‌ల న‌డ్డి విరుస్తూ…
ప్ర‌స్తుతం లీట‌ర్ పెట్రోలు మూల ధ‌ర ఆంధ్ర ప్ర‌దేశ్‌లో రూ.57.85 కాగా, దీనిపై కేంద్రం రూ. 27.90 ఎక్సైజ్ ప‌న్ను వేస్తోంది. రాష్ట్ర ప్ర‌భుత్వం రూ. 31.30 ప‌న్నులు వేస్తోంది. దీనికి డీల‌ర్‌ క‌మిష‌న్ రూ.3.80 కూడా క‌లిపి చూస్తే మొత్తంగా లీట‌రు పెట్రోలు ధ‌ర రూ.120.95 కి చేరుతోంది.
ఇలాగే లీట‌ర్ డీజిల్ మూల ధ‌ర రూ. 60.10 కాగా, కేంద్రం ఎక్సైజ్ ప‌న్ను రూ. 21.80 ప‌డుతోంది. దీనిపై రాష్ట్రం రూ.22.20 మేర‌కు ప‌న్నులు వేస్తోంది. డీల‌ర్ క‌మిష‌న్ రూ.2.50 కూడా క‌లిపి మొత్తం డీజిల్ ధ‌ర రూ. 106.60 కి ఎగబాకింది.
ఈ వివ‌రాలు గ‌మ‌నిస్తే కేంద్రాన్ని మించి జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికంగా ప‌న్నులు వేసి ప్ర‌జ‌ల‌ను పిండుతోంద‌ని అర్థ‌మ‌వుతుంది.
ఇలా చేయ‌డం ద్వారా 2020-21 సంవ‌త్స‌రంలో రూ. 7,514 కోట్ల రూపాయ‌ల రాబ‌డిని జ‌గ‌న్ ప్ర‌భుత్వం పొందింది. ఇక 2021-22 సంవ‌త్స‌రం సంగ‌తి చూస్తే తొలి 9 నెల‌ల్లోనే ఏకంగా రూ. 10,920 కోట్ల రూపాయ‌ల అద‌న‌పు రాబ‌డిని ప్ర‌జ‌ల నుంచి రాబ‌ట్టుకుంది. అంటే కింద‌టేడాది ల‌భించిన మొత్తం ఆదాయాన్ని మించి ఈ ఏడాది 9 నెల‌ల్లోనే జ‌నం జేబులు కొట్టి వ‌సూలు చేసింద‌న్న‌మాట‌!
*ఆంధ్రా అంటే అయ్య బాబోయ్‌…
దేశ వ్యాప్తంగా అనేక నిత్యావ‌స‌ర స‌రుకుల‌ను, వ్యాపార ఉత్ప‌త్తుల‌ను ర‌వాణా చేసే ప‌ర్మిట్లు ఉన్న లారీలు, భారీ వాహ‌నాల య‌జ‌మానులు ఆంధ్రా మీదుగా ప్ర‌యాణించాలంటే ఇక్క‌డి పెట్రోలు, డీజిల్ ధ‌ర‌ల‌ను త‌ల్చుకుని భ‌య‌ప‌డుతున్నారు. అందుక‌నే ఆంధ్రాలోకి ప్ర‌వేశించ‌డానికి ముందే త‌మ వాహ‌నాల‌లో ట్యాంకుల‌ను పూర్తిగా నింపుకుని వ‌స్తున్నారు. ఒక వేళ మార్గ‌మ‌ధ్యంలో ఇంధ‌నం నింపుకోవ‌ల‌సి వ‌స్తే రాష్ట్ర స‌రిహ‌ద్దు ఎన్ని కిలోమీట‌ర్ల‌లో దాటుతామో లెక్క వేసుకుని ఆ మేర‌కు మాత్ర‌మే కొట్టించుకుంటున్నారు. ఇలా రాష్ట్రం మీదుగా ప్ర‌యాణించే ల‌క్ష‌లాది వాహ‌నాల య‌జ‌మానులు జాగ్ర‌త్త ప‌డుతుండంతో ఆంధ్రా స‌రిహ‌ద్దుల్లో ఉండే అనేక పెట్రోలు, డీజిల్ బంక్‌లు వినియోగ‌దారులు త‌గ్గిపోయి వెల‌వెల పోతున్నాయ‌నేది వాస్త‌వం. అలాగే పొరుగు రాష్ట్రాల స‌రిహ‌ద్దుల్లో ఉండే వినియోగ‌దారులు, భారీ వాహ‌నాల య‌జ‌మానులు ఆంధ్రా ఎల్ల‌లు దాటి వెళ్లి త‌మ వాహ‌నాల‌కు ఇంధ‌నం నింపుకుంటున్నారు. పైగా అక్క‌డి నుంచి క్యాన్లలో అద‌న‌పు ఇంధ‌నం నింపించుకుని మ‌రీ వ‌స్తున్నారు.
ఉదాహ‌ర‌ణ‌కు ఆంధ్రాలో నెల్లూరు జిల్లా త‌డ చుట్టు ప‌క్క‌ల ప్రాంతాల వినియోగ‌దారులు త‌మ‌కు ద‌గ్గ‌ర‌లోని త‌మిళ‌నాడు స‌రిహ‌ద్దులు దాటి అక్క‌డి బంకుల్లో ఇంధ‌నం కొనుక్కుంటున్నారు. అలాగే అనంత‌పురం జిల్లాలోని స‌రిహ‌ద్దు మండ‌లాల వారు క‌ర్నాట‌క స‌రిహ‌ద్దుల్లోని బంకుల‌కు క్యూ క‌డుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోంచి యానాం, త‌మిళ‌నాడు హ‌ద్దులు దాటి ఇంధ‌నం కొనుక్కుంటున్నారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా జీలుగుమిల్లి, చింత‌ల‌పూడి, కుక్క‌నూరు, వేలేరుపాడు మండ‌లాల వారు కూడా రాష్ట్రం స‌రిహద్దులు దాటి త‌మిళ‌నాడు బంకుల‌కే వెళుతున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లాను ఆనుకుని ఒడిస్సా రాష్ట్రం ఉండడంతో వినియోగ‌దారులు ఇంధ‌న అవ‌స‌రాల కోసం అటు వైపు ప్ర‌యాణిస్తున్నారు.
పెట్రోలు, డీజిల్ ధ‌ర‌ల్లో ఈ వ్య‌త్యాసాన్ని గుర్తించిన ఇత‌ర రాష్ట్రాల స‌రిహ‌ద్దుల్లోని బంకుల వాళ్లు ఆంధ్రాలో ప్ర‌వేశించే ముందే త‌మ ద‌గ్గ‌ర ఇంధ‌నం కొనుక్కోమ‌ని ప్ర‌చారం చేసుకుంటూ వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటున్నారు. రెండు రాష్ట్రాల్లో ధ‌ర‌వ‌ర‌ల వ్య‌త్యాసాన్ని సూచిస్తూ పెద్ద పెద్ద బోర్డింగులు, ఫ్లెక్సీలు ప్ర‌ద‌ర్శించి మ‌రీ వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షిస్తున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు చిత్తూరు – వెల్లూరు హైవేలో స‌రిహ‌ద్దుల్లో ఉండే పెట్రోలు బంకుల వాళ్లు త‌మ ద‌గ్గ‌ర 100 లీటర్లకు మించి డీజిల్ కొట్టించుకుంటే ఒక కేజీ బాస్మతి రైస్ ఫ్రీ అంటూ హోర్డింగులు పెట్టి మరీ ఊరిస్తున్నారు. ఎందుకంటే ప్రాంతాన్ని బ‌ట్టి ఎలా చూసినా, ఆంధ్ర ప్ర‌దేశ్ తో పోలిస్తే త‌మిళ‌నాడు, క‌ర్నాట‌క‌, ఒడిస్సా, చత్తీస్ ఘ‌డ్ రాష్ట్రాల్లో పెట్రోలు మీద దాదాపు ప‌ది…. ప‌ద‌కొండు రూపాయ‌లు, డీజిల్ మీద ఆరేడు రూపాయ‌లు వ్య‌త్యాసం క‌నిపిస్తోంది.
ఇందువ‌ల్ల ఆంధ్రా స‌రిహ‌ద్దుల్లోని బంకులు వెల‌వెల పోతుండ‌గా, ఇత‌ర రాష్ట్రాల స‌రిహ‌ద్దుల్లోని బంకులు పెద్ద పెద్ద క్యూల‌తో సంద‌డిగా క‌నిపిస్తున్నాయి.
ఇంత జ‌రుగుతున్నా…
రాష్ట్రంలోని బంకుల య‌జ‌మానులు గోల పెడుతున్నా…
ఆంధ్రాలోని ప్ర‌జ‌లు గ‌గ్గోలు పెడుతున్నా…
ధ‌ర‌వ‌ర‌లు సైతం పెరిగిపోయి జ‌నం అల్లాడిపోతున్నా…
జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి మాత్రం చీమ‌కుట్టిన‌ట్టు అయినా అనిపించ‌డం లేద‌నేది వాస్త‌వం!
ఎందుకంటే ఈ ప్ర‌భుత్వానికి…
సామాన్యుల వెత‌ల క‌న్నా అద‌న‌పు రాబ‌డే ముఖ్యం!
ఎలాగోలా జ‌నం నుంచి ఆదాయాన్ని పిండుకోవ‌డ‌మే ల‌క్ష్యం!!
అదే… ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌ దౌర్భాగ్యం!!!