జగన్ జమానాలో ఉసూరుమంటోన్న ఉపాధి హామీ!

*ఒక్క ఏడాదిలో రూ.3 వేల కోట్లు తగ్గిన పనులు
*1.8 కోట్ల పని దినాలు కట్
* గ్రామీణ ప్రాంతాల్లో పనుల్లేక కూలీల వలసలు
*పాలకుల్లో లోపించిన శ్రద్ధ ఫలితమే

మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్ మెంట్ గ్యారంటీ యాక్ట్ ….నరేగాగా పిలుచుకునే ఉపాధి హామీ పథకం కూలీల పాలిట వరమనే చెప్పవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు 100 రోజుల పని గ్యారంటీ ఇవ్వడంతోపాటు గ్రామాల్లో కనీస సదుపాయాలు కల్పించేందుకు 2005లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ పథకాన్ని ప్రారంభించారు. అనంతపురం నుంచి ప్రారంభమైన ఈ పథకాన్ని దేశ వ్యాప్తంగా అన్ని గ్రామీణ జిల్లాల్లో విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఉపాధి హామీ నిధులు అందుబాటులోకి వచ్చాక గ్రామాల రూపురేఖలే మారిపోయాయి. ఈ పథకం ప్రారంభమయ్యాక నరేగా నిధులతో విభజిత ఏపీలో దాదాపు 27000 కిలోమీటర్ల సిమెంటు రోడ్లు, డ్రైనేజీలు నిర్మించారు. ఉపాధి హామీ నిధుల వినియోగంలో ఏపీ దేశంలోనే ఐదు అగ్ర రాష్ట్రాల సరసన నిలిచింది. ఏడాది క్రితం వరకూ కూడా ఇదే పరిస్థితి. కానీ నేడు నరేగా నిధులు వినియోగించుకోవడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదని లిబ్టెక్ సంస్థ సర్వే ఫలితాలు తేటతెల్లం చేస్తున్నాయి. దేశంలో ఉపాధి హామీ నిధుల వినియోగంపై లిబ్టెక్ స్వచ్చంద సంస్థ తాజాగా ఓ సర్వే నిర్వహించింది. లిబ్టెక్ తాజా సర్వే ఫలితాలు పరిశీలిస్తే ఏపీలో ఉపాధి హామీ పథకం ఎలా తిరోగమనంలోకి జారుకుందో అర్థం చేసుకోవచ్చు. అధికారంలోకి వచ్చిన మొదటి రెండేళ్లు ఉపాధి హామీ నిధుల వినియోగంలో ముందున్న వైసీపీ ప్రభుత్వం, ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మాత్రం తిరోగమనంలో పయనించింది.
*నాడు జోరు – నేడు బేజారు
ఉపాధి హామీ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు, విభజిత ఏపీలోనూ నరేగా నిధులు గరిష్ఠంగా వినియోగించుకున్నారు. 2014 నుంచి 2020-21 వరకు ఏటా ఉపాధి హామీ నిధుల వినియోగం పెరుగుతూ వచ్చింది. 2014-15లో రూ.6450 కోట్ల ఉపాధి హామీ నిధులను ఉపయోగించుకోగా అది 2020-21నాటికి రూ.10,900 కోట్లకు చేరింది. నిధుల వినియోగంలో ఏటా 15 శాతం పెరుగుదల నమోదైంది. అయితే ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఉపాధి నిధుల వినియోగంలో ఏపీ ప్రభుత్వం ఒక్కసారిగా తిరోగమనంలో పయనించింది. 2021-22లో కేవలం రూ.7,879 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. దీంతో కూలీలకు చెల్లింపులు కూడా భారీగా తగ్గిపోయాయి. మరోవైపు మెటీరియల్ నిధులు వినియోగించుకోవడంలోనూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెనకపడింది. మెటీరియల్ నిధులతో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాల సేకరణ కేంద్రాలు, వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీలు నిర్మిస్తున్నామని చెబుతున్నా, నరేగా నిధుల వినియోగంలో తిరోగమనం నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. 2021-22లో కోటి 80 లక్షల పని దినాలు తగ్గిపోవడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు.
*నరేగా తిరోగమనం ఇలా….
ఉపాధి హామీ పథకం ప్రారంభించినప్పటి నుంచి 2020-21లో అత్యధికంగా రూ.10,900 కోట్లు ఖర్చు చేశారు. పథకం ప్రారంభమయ్యాక అత్యధికంగా ఖర్చు చేసింది 2020-21లోనేనని లిబ్టెక్ సర్వే వెల్లడించింది. అది కాస్తా 2021-22 నాటికి రూ.7,879 కోట్లకు పడిపోయింది. అంటే ఒక్క సంవత్సరంలోనే ఏపీ ప్రభుత్వం దాదాపు రూ.3000 కోట్లు వినియోగించుకోలేకపోయిందని చెప్పవచ్చు. ఉపాధి హామీ పథకం కింద 2018-19లో రూ.9210 కోట్లు, 2019-20లో రూ.5,532 కోట్లు, 2020-21లో రూ.10900 కోట్లు, 2021-22లో రూ.7,879 కోట్లు ఖర్చు చేశారు. 2021-22లో పని దినాలు కూడా భారీగా తగ్గాయని లిబ్టెక్ సంస్థ సర్వే ఫలితాల ద్వారా తెలుస్తోంది. పెరుగుతున్న ధరల నేపథ్యంలో కూలీల వేతనం ఏటా పెరగాల్సింది పోయి తగ్గుతూ వచ్చిందని లిబ్టెక్ వెల్లడించింది. కేంద్రం ఏటా ప్రకటిస్తున్న కనీస వేతన మొత్తం కూడా ఆంధ్రలో కూలీలకు దక్కడం లేదని సర్వేలో తేలింది. 2019-20లో రూ.211 కనీస వేతనం ఉండగా ఏపీలో కూలీలకు సగటున కేవలం రూ.203 మాత్రమే లభించింది. 2020-21లో రూ.237 కనీస వేతనం ఉండగా, రూ.228 మాత్రమే కూలీలకు దక్కింది. ఇక 2021-22లో కనీస వేతనం రూ.245 ఉండగా రూ. 216 మాత్రమే రాష్ట్రంలో కూలీలకు చెల్లించారు. 2020-21లో కన్నా 2021-22లో కూలీ రేటు తగ్గడంతో పనికి వచ్చే కూలీలకు ఆసక్తి తగ్గిందని చెప్పవచ్చు. 2020-21 తో పోల్చితే 2021-22 లో కూలీలకు చెల్లించిన వేతనాలు రూ.781 కోట్లు తగ్గాయి. మెటీరియల్ నిధుల ఖర్చు రూ.2,052 కోట్లు తగ్గింది. పని దినాలు కూడా 1.8 కోట్లు తగ్గాయి. కూలీలకు చెల్లించాల్సిన కనీస వేతనం కూడా 11.8 శాతం తక్కువగా నమోదైందని లిబ్టెక్ సర్వే బయటపెట్టింది.
*ఎందుకీ దుస్థితి….
కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలకు నిధులు కేటాయిస్తూ ఉంటుంది. ఇందులో కేంద్రం కొంత మొత్తం, మరికొంత రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. అయితే ఉపాధి హామీ పథకంలో ఖర్చు చేసే ప్రతి రూపాయి కేంద్రమే భరిస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి భారం ఉండదు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధుల కొరత లేకుండా చూడటంతోపాటు, కూలీల వలసలను నిరోధించి వారికి ఏడాదికి కనీసం 100 రోజుల ఉపాధి గ్యారంటీ కల్పించేందుకు నరేగా పథకాన్ని చట్టం రూపంలో తీసుకువచ్చారు. ఓ పథకానికి చట్టబద్దత కల్పించడం అనేది నరేగా విషయంలోనే జరిగిందంటే ఈ పథకం ప్రాముఖ్యత అర్థం చేసుకోవచ్చు. ఉన్నతమైన లక్ష్యంతో ప్రారంభించిన ఈ పథకాన్ని చాలా రాష్ట్రాలు చక్కగా ఉపయోగించుకున్నాయి. అయితే ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఏపీలో నరేగా నిధులు ఖర్చు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పవచ్చు. నరేగా నిధులు సక్రమంగా వినియోగించుకోవడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంతోపాటు, ఉపాధి హామీలో మస్టర్లు వేసే సిబ్బందిని తొలగించి, ఆ విధులు గ్రామ కార్యదర్శులకు అప్పగించారు. దీంతో కార్యదర్శులు ఇతర పనులతో పాటు నరేగా పనులు కూడా పర్వవేక్షించాల్సి వచ్చింది. దీనికితోడు నరేగాలో సకాలంలో కూలీ చెల్లించక పోవడం, మెటీరియల్ పనులు చేసిన కాంట్రాక్టర్లకు సంవత్సరాలు గడచిపోయినా బిల్లులు చెల్లించకపోవడంతో నరేగా పథకం నీరుగారి పోయిందని భావిస్తున్నారు. కూలీలకు వారంలో చెల్లించాల్సిన కూలీ మొత్తం ఒక్కోసారి మూడు నెలలకు కూడా అందడం లేదు. దీంతో కూలీలు వలసబాట పడుతున్నారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అతి పెద్ద పథకం ఉపాధి హామీ ప్రోగ్రామ్. ఇది కేవలం ఓ పథకంగానే కాకుండా దీనికి చట్టబద్దత కూడా కల్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైనా జాబ్ కార్డు తీసుకుంటే వారికి ఏడాదిలో వంద రోజుల పని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అంతే కాదు. నరేగా నిధుల్లోని మెటీరియల్ కాంపోనెంట్ ఉపయోగించుకుని సిమెంట్లు రోడ్లు, డ్రైనేజీలు, పాలనా భవనాలు కూడా నిర్మించుకోవచ్చు. అంటే గ్రామానికి అవసరమైన అన్ని సదుపాయాలు ఈ నిధుల ద్వారా సమకూర్చుకోవచ్చు. ఈ పథకం వచ్చాకే చాలా గ్రామాల్లో సిమెంటు రోడ్లు వచ్చాయనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన పని లేదు. ఇలాంటి పథకాన్ని చక్కగా ఉపయోగించుకోవాల్సిన ఏపీ ప్రభుత్వం,అంతగా శ్రద్ధ పెట్టకపోవడంతో ఉపాధిహామీ పథకం కుదేలైందని చెప్పవచ్చు.
లిబరేషన్ టెక్నాలజీ ఇండియా…. దీన్నే క్లుప్తంగా లిబ్టెక్ ఇండియాగా పిలుస్తారు. ఇందులో అనేక మంది ఇంజనీర్లు, సామాజిక కార్యకర్తలు, సామాజికవేత్తలు గ్రూపులుగా ఏర్పడి పలు అంశాలపై సర్వేలు నిర్వహిస్తారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పారదర్శకత, జవాబుదారీతనం అంశాలను స్పృసిస్తారు. ప్రజలకు సేవలు మరింత పారదర్శకంగా అందేలా ఈ సంస్థ చూస్తుంది. నరేగా, ప్రజాపంపిణీ వ్యవస్థతోపాటు, సమాచార హక్కు, పెన్షన్లు, ప్రసూతి అర్హత వంటి వాటిపై సర్వేలు నిర్వహించి ఇవి మరింత సమర్థంగా పనిచేసేలా లిబ్టెక్ స్వచ్చంద సంస్థ కృషి చేస్తోంది.