కులవృత్తులని కాపాడుకోవాలి: ముత్తా శశిధర్

  • జనసేన ఆధ్వర్యంలో శాలివాహన కుటుంబాల సందర్శన

కాకినాడ సిటి: జనసేన నాయకుడు శివాజీ యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ జగన్నాధపురంలోని శాలివాహన కుటుంబాలని సందర్శించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ మనిషి జీవితంలో శుభకార్యానికే కాకుండా అంతిమ కార్యక్రమంలో కూడా ప్రముఖంగా ఉపయోగించే మట్టి కుండలు, పాత్రలు తయారీకి కావలిసిన మట్టిని ఈ వృత్తివారు గవర్న్మెంట్ జీవో ఉండి తవ్వుకుని తెచ్చుకుంటుంటే నేటి ప్రభుత్వం వీరిపై దొంగతనం కేసులని బనాయించడం ఎంతవరకు సమంజసమన్నారు. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకృతి ప్రసాదించే ఇసుకని కొల్లగొడుతూ కోట్లాది రూపాయలు జేబులో వేసుకుంటుంటే ఇక్కడ చట్టం చుట్టమా వీరికో న్యాయం వారికో న్యాయమా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ముత్తా శశిధర్ మాట్లాడుతూ కొత్తసంవత్సరంలోకి వస్తూ ప్రజలయొక్క కులవృత్తులని కూడా కాపాడుకోవాలని తమ అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు చెప్పారన్నారు. విభిన్న కులాల సమూహమే ఈ సమాజమనీ చిన్న చిన్న కులాలు, కులవృత్తులు చేసేవారిని గౌరవించుకోవలసిన అవసరం ఎంతైనా మనమీద ఉందన్నారు. మనం చరిత్ర గురించి తెలుసుకోవాలంటే పుస్తకాలలో ఉటంకించిన మట్టి పాత్రలు, చిహ్నాలు అని చదువుకున్నామనీ, ఈనాడు ఆ నాగరికత పెరిగి పైకి వెళ్ళుతున్న వేళ మట్టిపాత్రలు, మట్టితో పనిచేసే మనుషులు కరువయ్యారన్నారు. నాగరికతకు చిహ్నాలు వాళ్ళు అయితే వాళ్ళు నేడు అంతమవుతున్నందుకు చింతిస్తున్నామన్నారు. ఒకనాడు 42 కుటుంబాల వాళ్ళు నగరంలో నివసిస్తుంటే నేడు వారి సంఖ్య 14కి పడిపోయిందని విచారం వ్యక్తం చేసారు. ఈ ప్రభుత్వం దృతరాష్ట్ర ప్రభుత్వమనీ, దీనిపై తమ రాబోయే కొత్త ఉమ్మడి ప్రభుత్వం చర్యలు తీసుకుని న్యాయం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లిపూడి శివాజీ యాదవ్ శ్రీ శివ శాలివాహన కుమ్మరి సంఘం టిల్లపుడి సత్తిబాబు గాలిపర్తి కుమారస్వామి సత్యనారాయణ రవి సిద్దు మరియు సంఘం సభ్యులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.