దశపల్లా భూములపై సీబీఐ విచారణ జరపాలి

  • సీబీఐ ఎస్పీకి పిర్యాదు చేసిన జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్

విశాఖపట్నం, విశాఖ నగరం ప్రభుత్వ అతిధి గృహం దారి సర్వే నంబర్లు 1196, 1197, 1027, 1028లలో సుమారు మూడు వేల కోట్ల రూపాయల విలువైన దసపల్లా భూములపై విచారణ జరపాలని ఎంవీపీ కాలనీలోని సీబీఐ కార్యాలయంలో సీబీఐ ఎస్పీకి జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ శుక్రవారం పిర్యాదు చేశారు. నగరంలోని దశపల్లా లే అవుట్ సర్వే నంబర్లు 1196, 1197, 1027, 1028లలో 60 ఎకరాల భూములు ఉన్నాయి. వీటిలో 40 ఎకరాలు జీవీఎంసీ, వుడా, తూర్పు నావికాదళం సేకరించాయి, 5 ఎకరాలు ప్రభుత్వం వివిధ అవసరాలకు వినియోగించింది. మిగితా 15 ఎకరాల భూమి కొన్నేళ్లుగా వివిదాల్లో ఉంది. ఎస్టేట్ అబాలిష్ మెంట్ చట్టం అమలులోకి వచ్చిన తరువాత ఈ దశపల్లా భూములకు అప్పటి అసిస్టెంట్ సెటిల్మెంట్ అధికారి గ్రౌండ్ రెంట్ పట్టా జారీచేశారు. 1981లో నాటి తహసీల్దార్ సర్వే అండ్ సెటిల్మెంట్ కోర్టులో అప్పీల్ చేయగా అప్పటి సర్వే శాఖ కమిషనర్ గ్రౌండ్ రెంట్ పట్టా రద్దు చేసి వివివాదాస్పద భూములను ప్రభుత్వానివేనని తేల్చారు. 2001లో సర్వే శాఖ దశపల్లా భూములను 22ఏ లో చేరుస్తూ జీవో 657 జారీ చేసింది. సుమారు రెండు వేల కోట్ల రూపాయల విలువైన ఈ దసపల్లా భూములను కాజేయడానికి ప్రయివేట్ వ్యక్తులు కొన్నేళ్లుగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీ పెద్దల అండతో ఈ భూములకు ఇప్పటికే పెండింగ్ రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. గతంలో అక్రమంగా ఈ భూములను రిజిస్ట్రేషన్ చేసుకున్న 60 మంది నుంచి ఇందుకోసం ఎష్యూర్ ఎస్టేట్స్ డెవలపర్స్ ఎల్ ఎల్ పీ పేరిట రాత్రికి రాత్రి కంపెనీని ఏర్పాటు చేసి డెవలప్మెంట్ ఎగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. దానిని రిజిస్టర్ కూడా చేశారు. 16 ఎకరాల విస్తీర్ణంలో 76 వేల గజాల్లో 15 అంతస్థుల భవన సముదాయాలను నిర్మించేందుకు, ఇందుకు అవసరమైతే టీడీఆర్ లు తీసుకొనేందుకు ఒప్పందాలు చేసుకున్నారు. మూడు రాజధానుల ప్రకటనలో భాగంగా విశాఖను పరిపాలన రాజధానిగా 2019 డిసెంబర్ 19న ప్రకటించారు. ఇది జరిగిన 17 రోజుల వ్యవధిలోనే ఈ కంపెనీ ఏర్పాటు చేసి హాడావుడిగా ఒప్పందం చేసుకోవడం ఇన్ సైడ్ ట్రేడింగే కిందకు వస్తుంది. ఈ భూములు నిషేధిత 22 ఏ జాబితాలో ఉన్నప్పటికీ డాక్యుమెంట్ నెంబర్లు పీ595/2021, పీ 783/2021,పీ 985/2021 లతో విశాఖ సబ్ రిజిస్ట్రార్ కార్యక్రమంలో రిజిస్ట్రేషన్లు జరగడం వాటిని తిరస్కరించడం జరిగింది. తాజాగా కొందరు ప్రభుత్వ పెద్దలతో ముడుపుల ఒప్పందాలు కుదరడంతో తిరస్కరించిన రిజిస్ట్రేషన్ లను ఆమోదించి, నిషేధిత 22 ఏళ్ల నుంచి వీటిని తొలగించేందుకు రంగం సిద్ధమవుతోందని తెలిసింది. కారుచౌకగా కొట్టేసిన ఈ భూములలో భారీ భవనాలు నిర్మించి పది వేల కోట్ల రూపాయల వ్యాపారం చేయడానికి రంగం సిద్ధమవుతోందని ఆరోపణలు వస్తున్నాయి. యూ ఎల్ సీ పరిధిలోని ఈ భూములను తప్పడు పత్రాలతో, ప్రభుత్వ ఉత్తర్వులతో సంబంధం లేకుండా కేవలం ఎక్స్ పార్టీ కోర్టు తీర్పుల ద్వారానే కొందరు అనుమతులు పొందారు. వాటిపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తూ కబ్జాదారులకు సహకరిస్తున్నారు. దశపల్లా భూములు కూడా 22ఏ నుంచి తొలిగించకుండా సుమారు రూ.3వేల కోట్ల భూముల కుంభకోణం నిలువరించాలని సీబీఐ అధికారులకు ఆయన పిర్యాదు చేశారు.