ఆ వ్యాక్సిన్ తో కొత్తరకం కరోనా వైరస్ కు చెక్..?

కరోనా మహమ్మారి విజృంభణ వల్ల భారత్ కు చెందిన ప్రజలతో పాటు ప్రపంచ దేశాలకు చెందిన ప్రజలు గడిచిన సంవత్సర కాలంగా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. కరోనా ఉధృతి తగ్గిందని, వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తోందని ప్రజలు ఆనందించే లోపు కొత్త రకం కరోనా స్ట్రెయిన్ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. మన దేశంలో నిన్నటి నుంచి కొత్తరకం కరోనా స్ట్రెయిన్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రెండు కొత్త రకం కరోనా కేసులు, ఏపీలో ఒక కొత్త రకం కరోనా కేసు నమోదు కావడం గమనార్హం. దీంతో ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. కొత్త రకం కరోనా కేసులు వెలుగులోకి వస్తున్న తరుణంలో భారత్ బయోటెక్ ప్రజలకు తీపికబురు చెప్పింది. తమ కంపెనీ తయారు చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ కొత్తరకం కరోనాపై అద్భుతంగా పని చేస్తుందని తేలిందని ఆ కంపెనీ వెల్లడించింది. కరోనా వైరస్ లో ఎన్ని మార్పులు వచ్చినా కోవాగ్జిన్ వ్యాక్సిన్ తో చెక్ పెట్టడం సాధ్యమేనని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. భారత్ బయోటిక్ ఛైర్మన్ కృష్ణ ఎల్ల మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్ లో అనేక మార్పులు చోటు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయని. కరోనా వైరస్ లో సంభవించే మార్పులకు అనుగుణంగా కోవాగ్జిన్ వ్యాక్సిన్ ను తయారు చేశామని కృష్ణ ఎల్ల వెల్లడించారు.

బ్రిటన్ లో శాస్త్రవేత్తలు కనుగొన్న కొత్తరకం కరోనా వైరస్ ఇప్పటికే ఇతర దేశాలకు వ్యాప్తి చెందింది. సాధారణ కరోనాతో పోలిస్తే 70 శాతం వేగంగా వ్యాప్తి చెందే ఈ వైరస్ ప్రమాదకరం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేస్తున్న ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ కూడా కొత్తరకం కరోనాపై సమర్థవంతంగా పని చేస్తుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.