ముఖ్యమంత్రి అసత్యాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు

•కౌలు రైతు ఆత్మహత్యలను చులకన చేసి మాట్లాడం వారి కుటుంబాలను అవమానించడమే
•వైసీపీ అధికారంలోకి వచ్చాక 3 వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు
•ఒక్క తూ.గో జిల్లాలోనే 53 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు
•ముఖ్యమంత్రి మొద్దు నిద్ర వదిలి వాస్తవాలు చూడాలి
•శ్రీ పవన్ కళ్యాణ్ వస్తున్నారనే రోడ్లు వేశారు… నష్టపరిహారం ఇచ్చారు
•ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆత్మహత్య చేసుకున్న ప్రతి కౌలు రైతుకు నష్టపరిహారం ఇవ్వాలి
•మండపేట కౌలు రైతు భరోసా రచ్చబండలో నాదెండ్ల మనోహర్

కౌలు రైతుల ఆత్మహత్యల విషయంలో ముఖ్యమంత్రి అసత్యాలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తప్పుపట్టారు. సాగు నష్టాలు భరించలేక కౌలు రైతులు బలవన్మరణాలకు పాల్పడితే వారి మరణాలను చులకన చేసేలా మాట్లాడటం సబబు కాదని అన్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి రూ. 7 లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. జనసేన కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా శనివారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా మండపేటలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడ్డ 53 మంది కౌలు రైతు కుటుంబాలకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పి.ఏ.సి. సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అన్నపూర్ణలాంటి తూర్పుగోదావరి జిల్లాలోనే దాదాపు 53 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. దీనికి సంబంధించి ఆధారాలు జనసేన పార్టీ దగ్గర ఉన్నాయి. రైతు స్వరాజ్య వేదిక ఇచ్చిన నివేదిక, సమాచార హక్కు చట్టం ద్వారా మా పార్టీ నాయకులు సేకరించిన వివరాలు ఆధారంగానే మేము మాట్లాడుతున్నాం. మేము చెబుతున్న లెక్కల్లో తప్పులు ఉంటే ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలు రైతు కుటుంబాలు వేదికపైనే ఉన్నాయి. ముఖ్యమంత్రికి దమ్ముంటే వీరిలో ఎవర కౌలు రైతు కుటుంబం కాదని నిరూపించగలరా? కౌలు రైతు మరణాలపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదయ్యింది, గ్రామస్తులు ధ్రువీకరించారు. అయినా వీళ్లకు సీసీఆర్సీ కార్డు లేదు, పట్టాదారు పాస్ పుస్తకం లేదని ముఖ్యమంత్రి నష్టపరిహారం ఇవ్వకుండా నిలిపివేశారు.
•హడావుడిగా నష్టపరిహారం ఇస్తున్నారు
మండపేటలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పర్యటిస్తున్నారని తెలిసి ఈ నియోజకవర్గంలో ఒక పెద్ద మనిషి రాత్రికి రాత్రే రోడ్లు మరమ్మతులు చేయించడం వాస్తవం కాదా? రెండేళ్లుగా కాళ్లు అరిగేలా తిరిగినా రాని నష్టపరిహారం ఇవాళ శ్రీ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని తెలిసి నాలుగు రోజుల క్రితం నలుగురు కౌలు రైతు కుటుంబాలకు రూ. 7 లక్షల చొప్పున ఇవ్వడం వాస్తవం కాదా? అన్నంపెట్టే రైతన్నను ఆదుకోవాలనే సదుద్దేశంతో జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టింది తప్ప… ఇందులో ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదు. ఆత్మహత్యకు పాల్పడ్డ కౌలు రైతు కుటుంబాల దీనస్థితి చూసి వారిని ఆదుకోవాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి… ప్రతి కుటుంబానికి రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇందుకోసం ఆయన సొంత సొమ్ము రూ. 5 కోట్లు విరాళం ఇచ్చారు.
•వ్యవసాయానికి రూ. లక్షా 27 వేల కోట్లు ఖర్చు చేశారా?
వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో వ్యవసాయ రంగంపై రూ. లక్షా 27వేల కోట్లు ఖర్చు చేశాం. ధాన్యం కొనుగోళ్లు కోసం రూ. 45 వేల కోట్లు ఖర్చు చేశాం. ఆర్‌బీకేల ద్వారా రైతన్నల చేయి పట్టుకుని నడిపిస్తున్నాం అంటూ ముఖ్యమంత్రి మాట్లాడారు. ఆయన నిజంగా వ్యవసాయ రంగంపై రూ. లక్షా 27 వేల కోట్లు ఖర్చు చేసి ఉంటే ఇంతమంది కౌలు రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు? కౌలు రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే మన రాష్ట్రం ఎందుకు రెండో స్థానంలో ఉంటుందని ప్రశ్నించారు.
•హెలికాప్టర్ లో కాదు రోడ్లపై తిరగాలి
గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో చాలా వరకు లంక గ్రామాలు నీట మునిగాయి. ముఖ్యమంత్రి తక్షణం స్పందించి వారికి ఆర్థికసాయం ప్రకటించాలి. హెలికాప్టర్ లో ఏరియల్ సర్వే చేస్తే సరిపోదు… రోడ్లపై తిరిగి క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్న కష్టాలు తెలుసుకోవాలి. రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా నిన్నటి నుంచి గుడ్ మార్నింగ్ సీఎం కార్యక్రమాన్ని ప్రతి ఒక్క జనసైనికుడు, వీర మహిళ అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అలాగే వాతావరణం సహకరించకపోయినా, పోలీసులు అడ్డుకున్నా ఇంతమంది జనసైనికులు, వీరమహిళలు తరలిరావడం చాలా ఆనందం కలిగించింది. గోదావరి ఉప్పొంగినా లంక గ్రామాల నుంచి సైతం రావడం విశేషం” అన్నారు. ఈ కార్యక్రమానికి మండపేట అసెంబ్లీ ఇంచార్జ్ శ్రీ వేగుళ్ళ లీలాకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, పి.ఏ.సి. సభ్యులు పంతం నానాజీ, ముత్తా శశిధర్, పితాని బాలకృష్ణ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, కార్యక్రమాల నిర్వహణ కమిటీ రాష్ట్ర ఛైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్, పార్టీ నేతలు మేడా గురుదత్ ప్రసాద్, శెట్టిబత్తుల రాజబాబు, బండారు శ్రీనివాస్, మర్రెడ్డి శ్రీనివాస్, శ్రీమతి మాకినీడు శేషుకుమారి, అత్తి సత్యనారాయణ, పాటంశెట్టి సూర్యచంద్ర, తుమ్మల రామస్వామి, పోలిశెట్టి చంద్రశేఖర్, వరుపుల తమ్మయ్యబాబు, సంగిశెట్టి అశోక్, వై.శ్రీనివాస్, రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు, వీరమహిళ విభాగ ప్రాంతీయ కో ఆర్డినేటర్లు, వివిధ విభాగాల సభ్యులు పాల్గొన్నారు.