కరోనా వైరస్ కంటే వైసీపీ ప్రమాదకరం

* జనసేన- తెలుగుదేశం గెలుపే దీనికి వ్యాక్సినేషన్
* వైసీపీ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
* ఫ్యాను పార్టీని ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు
* పాయకరావుపేట కార్యకర్తల సమావేశంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు

కరోనా వైరస్ కంటే వైసీపీ ప్రమాదకరం అనే స్థితికి రాష్ట్ర ప్రజలు వచ్చారని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు దాటుతున్నా గ్రామాల్లో కనీస మౌలిక వసతులైన రోడ్లు, సాగు, తాగునీరు, డ్రైనేజ్ సదుపాయం కల్పించలేకపోయారన్నారు. నిరంకుశత్వంతో రెచ్చిపోతున్న వైసీపీ వైరస్ కు జనసేన- తెలుగుదేశం విజయమే వ్యాక్సినేషన్ అన్నారు. మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే పొత్తులో భాగంగా ఎవరికి ఏ స్థానం దక్కినా కలసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం పాయకరావుపేటలో శ్రీ నాగబాబు గారు పర్యటించారు. స్థానిక ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా శ్రీ నాగబాబు గారు మాట్లాడుతూ “వైసీపీ హయాంలో రాష్ట్ర అభివృద్ధి పదేళ్లు వెనక్కి వెళ్లిపోయింది. గ్రామాల్లో కనీస మౌలిక వసతులు కల్పించకపోవడంతో ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఎప్పడెప్పుడు ఎన్నికలు వస్తాయి జగన్ సర్కార్ ను ఇంటికి పంపిద్దామని ప్రజలు ఎదురు చూస్తున్నారు.
* గురజాడ పుట్టిన నేలలో డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయలేకపోయారు
మహాకవి, సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు గారికి జన్మనిచ్చిన పాయకరావుపేట నియోజకవర్గంలో దశాబ్దాలుగా డిగ్రీ కాలేజ్ నిర్మాణం కలగా మిగిలిపోయింది. విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఎన్నిసార్లు ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వాలు కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో లక్షలాది మంది మత్స్యకారులు రాష్ట్రాన్ని వదిలి పక్క రాష్ట్రాలకు వలసపోతున్నారు. మత్స్యకారుల జీవితాలను ప్రభుత్వం అస్తవ్యస్తం చేసింది. నేవల్‌ ఆల్టర్నేటివ్‌ ఆపరేషనల్‌ బేస్‌ (ఎన్‌ఏఓబీ) నిర్మాణానికి మత్స్యకారుల నుంచి భూమిని సేకరించిన ప్రభుత్వం… వారికి తగిన నష్టపరిహారంతోపాటు వేరొక ప్రాంతంలో భూమి, స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. హామీ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు మాట నిలబెట్టుకోలేకపోయింది. కనీసం ఆ ప్రాంతంలో వేటకు వెళ్లడానికి కూడా లేకుండా ఆంక్షలు విధించింది. హెటిరో, డెక్కన్ ఫార్మా కంపెనీల కాలుష్యం వల్ల సముద్ర జలాలు కలుషితమై మత్స్య సంపద తీవ్రంగా నష్టపోతోంది. స్థానిక పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం వల్ల భూగర్భ జలాలు కలుషితమై పశువులు మృత్యువాతపడటంతో యాదవులు తీవ్రంగా నష్టపోతున్నారు” అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర రాజకీయ వ్యవహారాల ముఖ్య ప్రతినిధి శ్రీ సుందరపు వెంకట సతీష్, విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు, పార్టీ నాయకులు శ్రీ గెడ్డం బుజ్జి, శ్రీమతి లక్ష్మి శివకుమారి, శ్రీ బోడపాటి శివదత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *