కాపులకు బేషరతుగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి

  • కాపులను అవమానకరంగా మాట్లాడటం ముఖ్యమంత్రికి తగదు
  • రంగా హత్యకేసులో రాజశేఖర్ రెడ్డి తెరవెనుక పాత్ర అందరికీ తెలిసిందే
  • తాకట్టు, అమ్ముడుపోవటాలు కాపులకు అలవాటు లేదు
  • కాపుల ఆత్మగౌరవం, ఆత్మాభిమానం గాయపడేలా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు
  • వెన్నుపూసలేని దుస్థితిలో చావచచ్చిన స్థితిలో కాపు మంత్రులు, శాసనసభ్యులు
  • రిజర్వేషన్లు ఇవ్వను అన్నా వైసీపీని భుజానికెత్తుకోవటమే కాపులు చేసిన నేరమా?
  • కాపులపై వైసీపీది కపటప్రేమ
  • శ్రీకృష్ణదేవరాయల వారసులైన కాపులు రాజ్యాధికారం కోరుకోవడం నేరమా?
  • అన్ని వర్గాల ప్రజల సహకారంతో రాజ్యాధికారం దిశగా కాపుల అడుగులు
  • కాపులు ఐక్యంగా ఉండటమే సమస్త సమస్యలకు పరిష్కారం

ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వ్యాఖ్యలపై నిప్పులు చెరిగిన గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి మైనారిటీ నాయకులు షేక్ నాయబ్ కమాల్

కాపుల్ని పవన్ కళ్యాణ్ గంపగుత్తగా చంద్రబాబు నాయుడుకి తాకట్టు పెడుతున్నాడు అంటూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ మేరకు శనివారం జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడారు. కాపు జాతిని అమ్ముడుపోయే జాతిగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించటం పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు యావత్ కాపు జాతిని అవమానించేలా ఉన్నాయని, ఈ వ్యాఖ్యలపై తక్షణమే ముఖ్యమంత్రి బేషరతుగా కాపు జాతికి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చెంచల్ గూడా బ్యాచ్ రాసిచ్చే స్క్రిప్ట్ లో ఏది ఉంటే అది చదవటమేనా అని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి దగ్గరనుంచి ఇప్పటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వరకు కాపులపై చూపించేది అంతా కపటప్రేమేనన్నారు. రంగా హత్యకేసులో రాజశేఖర్ రెడ్డి చీకటి పాత్ర ఏమిటో బహిరంగ రహస్యమేనన్నారు. వంగవీటి రాధాని సైతం పార్టీలో నిరంతరం వేధించి బయటికి వెళ్లేలా కుట్ర పన్నింది వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. కాపులపై నిజంగా ప్రేమే ఉంటే అధికారంలోకి వచ్చిన అరక్షణంలోనే గత ప్రభుత్వం కాపులకు 5 శాతం కేటాయించిన ఈ డబ్ల్యు సీ రిజర్వేషన్లను ఎందుకు రద్దు చేశావని ప్రశ్నించారు. గుంటూరు జిల్లాను వియమ్మార్ జిల్లాగా ఎందుకు చేయలేదన్నారు. కాపు కార్పొరేషన్ ను నిర్వీర్యం చేసింది, విదేశీ విద్య పథకాన్ని నీరు కార్చింది వాస్తవం కాదా అన్నారు. సంవత్సరానికి రెండు వేల కోట్లు కాపుల సంక్షేమానికి ఇస్తానని చెప్పి మోసం చేసిన ముఖ్యమంత్రి కాపులకు 32 వేల కోట్లు ఇచ్చామంటూ కాకిలెక్కలు చెప్పటం కాపుల్ని నిలువెళ్లా మోసం చేయటమేనని ధ్వజమెత్తారు. కాపుల సంక్షేమం కోసం వైసీపీ చేసిన ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలని గాదె వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు.

రాష్ట్ర కార్యదర్శి, మైనారిటీ నాయకులు షేక్ నాయబ్ కమాల్ మాట్లాడుతూ కాపులకు ఎక్కడ రాజ్యాధికారం వస్తుందో అన్న భయంతో కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు సాక్ష్యాత్తు ముఖ్యమంత్రే కుట్రలు చేయటం శోచనీయం అన్నారు. శ్రీకృష్ణ దేవరాయల వారసులైన కాపుల్లో రాజ్యాధికారం పట్ల అంతర్మథనం మొదలైందని ఇదే ఇప్పుడు జగన్ రెడ్డికి నిద్రలేకుండా చేస్తుందన్నారు. ఉమ్మడిగోదావరి జిల్లాల్లో జనసేన క్లిన్ స్వీప్ చేస్తుందన్న నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో వైసీపీ నేతల్లో వణుకుమొదలైందన్నారు. ఇదే ప్రభావం కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల మీద జనసేన చూపించే అవకాశం ఉందని అదే జరిగితే వైసీపీ కనుమరుగవటం ఖాయమన్నారు. పవన్ కళ్యాణ్ నిజాయితీకి అన్ని కులాలు, అన్ని మతాల వారు ఆకర్షితులవుతున్నారని ఈ క్రమంలోనే జనసేనను ఒక కులానికే పరిమితం చేయాలన్న విషప్రచారానికి జగన్ రెడ్డి తెరతీసారన్నారు. కాపులు పెద్దన్న పాత్ర పోషిస్తూ అన్ని వర్గాల వారిని కలుపుకుంటూ వెళ్తే ఎంతమంది జగన్ రెడ్డిలు వచ్చినా జనసేన విజయాన్ని ఎవరూ ఆపలేరని నాయబ్ కమాల్ అన్నారు. జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి మాట్లాడుతూ వైసీపీలో కాపులు మంత్రులు అయ్యారన్నా, శాసనసభ్యులు అయ్యారన్నా, వైసీపీ ఆఫీసులో కుర్చీ వేశారన్నా అది జనసేన పార్టీ ఉండటం వల్లేనన్న సంగతి వైసీపీ కాపు నేతలు మరచిపోకూడదన్నారు. అసలు తాకట్టు, అమ్ముడుపోవడాలు అనే పదాలకు పేటెంట్ హక్కు వైసీపీదేనన్నారు. అక్రమాస్తుల కేసుల నుంచి బయటపడటం కోసం కేంద్రం దగ్గర పొలవరాన్ని, ప్రత్యేక హోదాని, విశాఖ ఉక్కుని తాకట్టు పెట్టింది ఎవరో అందరికి తెలుసన్నారు. సీబీఐ, ఈడి కేసుల భయంతో ఐదుకోట్ల ప్రజల జీవితాలను ఫణంగా పెట్టిన జగన్ రెడ్డికి కాపుల గురించి మాట్లాడే అర్హతలేదన్నారు. వైసీపీలో ఉన్న కాపు నేతలు కాస్త పౌరుషాన్ని అరువుతెచ్చుకోనైనా కాపులకు ముఖ్యమంత్రితో క్షమాపణ చెప్పించాలని కోరారు. లేనిపక్షంలో కాపు జాతి సత్తా ఏమిటో వైసీపీ పార్టీ చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. సమావేశంలో మహిళా రీజనల్ కో ఆర్డినేటర్ పార్వతి నాయుడు, కార్పొరేటర్ యర్రంశెట్టి పద్మావతి, జిల్లా ప్రధాన కార్యదర్శి నారదాసు ప్రసాద్, ఉప్పు రత్తయ్య, శివన్నారాయణ, నగర ఉపాదక్ష్యులు చింతా రాజు, కటకంశెట్టి విజయలక్ష్మి, తన్నీరు గంగరాజు, మహంకాళి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.