నల్సా యాప్ ను ప్రారంభించిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేడు నల్సా యాప్ ను ప్రారంభించారు. జాతీయ న్యాయసేవల అథారిటీ నల్సా పేరుతో మొబైల్ యాప్ ను రూపొందించింది. ఈ యాప్ ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొవిడ్ పరిస్థితుల్లోనూ సమర్థంగా న్యాయసేవలు అందించామని వెల్లడించారు. న్యాయవాదులు కొంత సమయం ఉచిత సేవలకు కేటాయించాలని పిలుపునిచ్చారు. ఉచిత సేవలపై ప్రజలకు అవగాహన కల్పించేలా మీడియా చూడాలని సూచించారు. పోలీస్ స్టేషన్లు, జైళ్ల వద్ద దీనికి సంబంధించిన సమాచారంతో హోర్డింగ్ లు ఏర్పాటు చేయాలని తెలిపారు.

పేదలకు న్యాయం దూరం కారాదని జాతిపిత మహాత్మాగాంధీ అభిలషించేవారని ఎన్వీ రమణ గుర్తు చేసుకున్నారు. క్విట్ ఇండియా ఉద్యమకాలంలోనే ఉచిత న్యాయ సేవలకు నాంది పలికారని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. నాడు స్వాతంత్ర్య సమరయోధులే రాజ్యాంగ రచనలో పాల్గొన్నారని వివరించారు. అందువల్లే ఉచితన్యాయం అనేది ప్రజలకు హక్కుగా వచ్చిందని స్పష్టం చేశారు.