మోపిదేవి మండలంలో శీతల గిడ్డంగి అనివార్యం: పూషడపు రత్నగోపాల్

ఉద్యానవన పంటలకు ప్రసిద్ధిగాంచిన మోపిదేవి మండలంలో శీతల గిడ్డంగి అనివార్యమని మోపిదేవి మండల జనసేన పార్టీ అధ్యక్షులు పూషడపు రత్నగోపాల్ అన్నారు. మోపిదేవిలో జరిగిన విలేకరుల సమావేశంలో మోపిదేవి మండల జనసేన పార్టీ అధ్యక్షులు పూషడపు రత్న గోపాల్ మాట్లాడుతూ, ప్రస్తుతం కరోనా మూడో దశ తీవ్ర స్థాయిలో ఉందని, మోపిదేవి మండలంలో అధిక సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయన్నారు. విద్యార్థులు సైతం కరోనా బారిన పడడం అత్యంత బాధాకరంగా ఉందని అన్నారు. ఇటువంటి క్లిష్ట సమయంలో విద్యాశాఖ మంత్రి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం హాస్యాస్పదమని వెల్లడించారు. అదేవిధంగా ఈ క్రాఫ్ట్ లో పేరు నమోదు కాకపోవడంతో అనేక మంది రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, నిబంధనలు సడలించి చివరి ధాన్యం గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని రత్న గోపాల్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న న్యాయపరమైన నిరసనకు తాము పూర్తిగా మద్దతు తెలుపుతున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నేతలు కామిశెట్టి శ్రీనివాసరావు, బాదర్ల లోలాక్షుడు నాయుడు, రేపల్లె సీతారామంజనేయులు, మండలి వెంకట రమణ, మత్తి శివరామప్రసాద్, రావి అంజి, మెరకనపల్లి నరేష్ బాబు, కూరేటి జగన్, అరజా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.