‘రైతు బంధు’కు రాంరాం…. వడ్డీ లేని రుణం మాయం!

*జగన్ సర్కార్ లో నిలిచిపోయిన బృహత్తర పథకం
*వడ్డీ భారం మోయలేక రైతుల అగచాట్లు
*గిడ్డంగులు అద్దెకిచ్చి ఆదాయం పొందుతున్న మార్కెట్ కమిటీలు

రాష్ట్రంలో రైతుబంధు పథకాన్ని జగన్ రెడ్డి సర్కార్ శాశ్వతంగా మూసేసింది. మార్కెట్ యార్డులు అంటే కేవలం రైతుల వద్ద నుంచి పన్నులు వసూలు చేసుకునే కేంద్రాలుగా మార్చింది. రైతులు ఏ పంట అమ్ముకున్నా 1 శాతం పన్ను చెల్లిస్తున్నారు. ఇలా ఏటా వందల కోట్ల నిధులు జమవుతున్నా, రైతులకు మాత్రం రైతుబంధు రుణాలు ఇవ్వడం లేదు. పంట చేతికి వచ్చిన సమయంలో సరైన ధరలు లేనప్పుడు అండగా నిలవాల్సిన రైతుబంధు పథకం ఎత్తేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అధికారంలోకి రాగానే రూ.3000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామంటూ ఆర్భాటంగా ప్రచారం చేసిన జగన్ రెడ్డి, రైతుబంధు పథకాన్ని కూడా ఎత్తేశాడు. గుట్టుచప్పుడు కాకుండా రైతుబంధు పథకాన్ని నిలిపేయడంపై రైతు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
*వడ్డీ లేని రుణం రైతుకు దూరం
వ్యవసాయ మార్కెట్ యార్డుల ద్వారా అమలు చేసే రైతుబంధు పథకానికి వైసీపీ ప్రభుత్వం తూట్లు పొడిచింది. కేవలం రాజకీయ నాయకులకు పునరావాసం కల్పించడం కోసమే మార్కెట్ యార్డులను 191 నుంచి 218కి పెంచారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో ఏ ఒక్క రైతుకూ రైతుబంధు కింద రుణం ఇవ్వలేదు. ఇక మార్కెట్ యార్డుల్లో ఉండే గోదాముల్లోనూ రైతులు పంట నిల్వ చేసుకునే అవకాశం లేకుండా చేశారు. 1982 నుంచి పంటను గిడ్డంగుల్లో పెట్టి దానిపై రుణం తీసుకునే వెసులుబాటు ఉంది. 1995లో దీనికి రైతుబంధుగా నామకరణం చేశారు. రైతులు నిల్వ చేసిన పంట విలువలో 75 శాతం, గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు ఈ పథకం కింద రుణం అందిస్తారు. దీనిపై 6 నెలల వరకు ఎలాంటి వడ్డీ ఉండదు. గిడ్డంగి అద్దె కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదు. 6 నుంచి 9 నెలల వరకు 12 శాతం వడ్డీ వసూలు చేస్తారు. ఇన్ని ప్రయోజనాలున్న పథకాన్ని జగన్ రెడ్డి ప్రభుత్వం నిలిపివేయడం ఆందోళన కలిగిస్తోంది.
*గిడ్డంగులతో వ్యాపారం
సహజంగా రైతులు పంటలు వేసే సమయంలో ధరలు అధికంగా ఉంటాయి. పంటలు చేతికొచ్చే సమయానికి దారుణంగా పడిపోతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో తక్కువ ధరకు పంట అమ్ముకుని నష్టపోకుండా మార్కెట్ యార్డుల్లోని గిడ్డంగుల్లో సరకు నిల్వ చేసుకుని రుణం పొందే పథకం రైతుబంధు. గిట్టుబాటు ధర రాగానే అమ్ముకునే వెసులుబాటు రైతుబంధు కల్పిస్తోంది. వరి ధాన్యం, పప్పు ధాన్యాలు, చిరు ధాన్యాలు, నూనె గింజలు రైతుబంధు పథకం కింద మార్కెట్ యార్డుల్లోని గిడ్డంగుల్లో నిల్వ చేసుకునే సదుపాయాలు ఉన్నాయి. అయితే రైతుబంధు పథకం నిలిపివేసి గిడ్డంగులను ప్రైవేటు వారికి అద్దెకు ఇచ్చేశారు. గిడ్డంగులను ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే వనరులుగా మార్చారు. రైతు సంక్షేమం గాలికి వదిలేసి రైతుల కోసం నిర్మించిన గిడ్డంగులను అద్దెకు ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. రైతులు పంటలు అమ్మినప్పుడు మార్కెట్ యార్డుల ద్వారా ఏటా సగటున రూ.450 కోట్ల సెస్ వసూలు చేస్తున్నారు. ఆ నిధులను కూడా ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించింది. రైతులకు రైతుబంధు రుణాలు లేకుండా చేసింది.
*నిధుల దారి మళ్లింపు
రైతుబంధు పథకం మూడు దశాబ్దాల పాటు రైతులకు ఎంతో ఉపయోగపడింది. 2014-15లో 3145 మంది రైతులకు రూ.26 కోట్ల రుణాలు ఇచ్చారు. 2015-16లో 3414 మందికి రూ.33 కోట్లు, 2016-17లో 3890 మంది రైతులకు రూ.43 కోట్లు, 2017-18లో 4723 మంది రైతులకు రూ.54 కోట్లు, 2018-19లో 3238 మంది రైతులకు రూ.40 కోట్లు రైతుబంధు పథకం కింద రుణాలుగా అందించారు. ఇలా ఏటా వేలాది మంది రైతులకు ఉపయోగపడే పథకాన్ని రెండో కంటికి తెలియకుండా నిలిపేశారు. రైతులు ఎక్కడ పంట అమ్ముకున్నా మార్కెట్ యార్డులు చెక్ పోస్టులు పెట్టి మరీ 1 శాతం పన్ను వసూలు చేస్తున్నాయి. యార్డు ఉద్యోగుల జీతాలుపోను మిగిలిన నిధులను గతంలో రైతుబంధు పథకానికి ఉపయోగించేవారు. 2019 నుంచి రైతుబంధు పూర్తిగా నిలిపివేశారు. గడచిన నాలుగేళ్లలో మార్కెట్ యార్డుల ద్వారా రూ.1800 కోట్లకు పైగా పన్నుల రూపేణా వసూలు చేశారు. ఆ నిధులను కూడా ప్రభుత్వం దారి మళ్లించింది. రైతులకు సేవ చేయాల్సిన మార్కెట్ కమిటీలను రాజకీయ నాయకులకు పునరావాస కేంద్రాలుగా మార్చడాన్ని రైతు సంఘాల నేతలు తప్పు పడుతున్నారు.
అధికారంలోకి రాగానే రూ.3000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామంటూ 2019 ఎన్నికలకు ముందు జగన్ రెడ్డి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడం లేదు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయకపోగా, గిట్టుబాటు ధరలు లేనప్పుడు గిడ్డంగుల్లో పంట నిల్వ చేసుకుని రుణం పొందే వీలున్న రైతుబంధుకు కూడా తూట్లు పొడిచారు. మాది రైతు సంక్షేమ ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకోవడం తప్ప చేతల్లో చూపించడం లేదు. రైతుభరోసా పథకం కింద అందిస్తున్న సాయాన్ని చూపి ఇతర అన్ని రాయితీలను నిలిపివేశారు. రైతుబంధుకు కూడా ఇలాగే మంగళం పాడినట్టు ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని పునరుద్దరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.