కమీషనర్ గారూ.. పేద ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా?

  • జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

గుంటూరు: సంపత్ నగర్, చివర పీకలవాగు ప్రాంతంలో జనావాసాల మధ్య డంపింగ్ యార్డ్ పెడితే దానిద్వారా వచ్చే దుర్గంధంతో ప్రజలెలా జీవిస్తారని, అసలే పీకలవాగులో ప్రవహించే మురుగువల్ల దోమలవ్యాప్తితో నరకయాతన పడుతుంటే మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందాన ఇప్పుడు ఇక్కడ డంపింగ్ యార్డ్ పెడితే ప్రజలు బ్రతకాలా వద్దా అని నగరపాలక సంస్థ కమీషనర్ ని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ప్రశ్నించారు. పేద ప్రజల ప్రాణాలంటే కమీషనర్ కు, పాలకులకు లెక్కలేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం డంపింగ్ యార్డ్ పై డెమో ఇవ్వటానికి వచ్చిన అధికారులపై ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ప్రజలకు మద్దతుగా జనసేన, టీడీపీ నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ.. ఈ ప్రదేశంలో డంపింగ్ యార్డ్ నిర్మించటాన్ని ప్రజలు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నా పాలకులు, అధికారులు మొండిగా వ్యవహించటం తగదన్నారు. ఇక్కడకు చేర్చే చెత్తతో వచ్చే దుర్గంధంతో ప్రజలకు పలురకాల జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దుర్గంధం పీల్చటం వల్ల ఊపిరితిత్తులు, కిడ్నీలు పాడైపోతాయని, శ్వాసకు సంభందించిన ఉబ్బసం లాంటి వ్యాధులు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారన్నారు. ఇక్కడ డంపింగ్ యార్డ్ నిర్మిస్తే ప్రజలు అన్నం కూడా తినలేని దుస్థితి నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్థలాలు ఉంటే వాటిలో బడులో, గుడులో నిర్మించండి కానీ ఇలా ప్రజలకు ఇబ్బంది కలిగే డంపింగ్ యార్డులు నిర్మించవద్దని అధికారులను కోరారు. ప్రజల అభీష్టం మేరకు ఇక్కడ నిర్మించతలబెట్టిన డంపింగ్ యార్డును తక్షణమే నిలిపివేసి నగరానికి వెలుపల నిర్మించాలని ఆళ్ళ హరి కోరారు. డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కృష్ణ మాట్లాడుతూ ప్రజలు జబ్బుల బారిన పడితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. స్థానిక నేతలు తమని బెదిరిస్తున్నారని మా ప్రాణాలు పోయినా ఇక్కడ డంపింగ్ యార్డుని పెట్టనివ్వమని స్థానిక మహిళలు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ప్రజల నుంచి ఎదురైన తీవ్ర నిరసనతో అధికారులు వెనుతిరిగారు. ఆందోళనలో జనసేన పార్టీ నేతలు కొలసాని బాలకృష్ణ, సయ్యద్ షర్ఫుద్దీన్, బాలు, వడ్డె సుబ్బారావు, సాయి టీడీపీ నేతలు సయ్యద్ అదంషా, షాదిక్, సాంబ మూర్తి, హుస్సేన్, వీరయ్య, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.