పోరస్ కెమికల్ కర్మాగారంలో మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలి

ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ కెమికల్ కర్మాగారంలో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదం అత్యంత విషాదకరమని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు మృతి చెందారని తెలిసి ఆవేదనకు లోనయ్యాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. కష్టం మీద బతికే కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో ఇచ్చిన విధంగానే పోరస్ ప్రమాదంలో చనిపోయినవారికీ రూ.కోటి చొప్పున పరిహారం అందించాలి. ఒక్కో ప్రమాదానికి ఒక్కో తరహా పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించకూడదు. ఈ ఘటనలో మరో 13మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. వీరికి మెరుగైన వైద్యం అందించి న్యాయబద్ధంగా పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రసాయన కర్మాగారాల్లో తరచూ ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి. భద్రత ప్రమాణాల నిర్వహణపై అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలి. ఇటువంటి ప్రమాదాల నివారణకు కఠిన నిబంధనలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు.